ఓ భూవివాదంలో మంత్రి మల్లారెడ్డి బావమరిది మీద, గుండ్ల పోచంపల్లి మున్సిపల్ చైర్ పర్సన్ భర్త శ్రీనివాస్ రెడ్డితో పాటు 15 మందిపై కేసు నమోదయ్యాంది.
హైదరాబాద్ : గుండ్లపోచంపల్లి మున్సిపల్ పరిధిలోని భూవివాదంలో మంత్రి మల్లారెడ్డి బావమరిది, గుండ్లపోచంపల్లి మున్సిపల్ చైర్ పర్సన్ భర్త ముద్దుల శ్రీనివాస్ రెడ్డితో పాటు 15 మందిపై కేసు నమోదయ్యింది. వారిలో ఎనిమిది మంది మహిళలు, ఇద్దరు వ్యక్తులు మొత్తం పది మందిని రిమాండ్ కు తరలించినట్లు పేట్ బషీరాబాద్ పోలీసులు తెలిపారు. సీఐ రమేష్ తెలిపిన వివరాల ప్రకారం గుండ్లపోచంపల్లిలోని సర్వేనెంబర్ 5,6లో ఉన్న భూయజమానులు మల్లారెడ్డి, వేణునాయుడు మధ్య స్థల వివాదం నడుస్తోంది.
మూడు రోజుల కిందట 1:00 సమయంలో మల్లారెడ్డికి సంబంధించిన వ్యక్తులు మద్యం సేవించి స్థలంలో ఉన్న కడీలను పడగొట్టి సెక్యూరిటీ సిబ్బంది విచక్షణారహితంగా దాడి చేశారని తమకు అందిన ఫిర్యాదు మేరకు నిందితులపై కేసు నమోదు చేయగా అందులో పది మందిని ఇప్పటికే రిమాండ్కు తరలించాం అని చెప్పారు. మరో ఐదుగురిలో మంత్రి మల్లారెడ్డి బావమరిది శ్రీనివాసరెడ్డి, మల్లారెడ్డి, విద్యాసాగర్ రెడ్డి, నరసింహారెడ్డి పరారీలో ఉన్నారని తెలిపారు
కాగా, ఈ నెల 9న మంత్రి మల్లారెడ్డికి బెదిరింపు కాల్స్ రావడం కలకలం రేపింది. ఇప్పటికే తెలంగాణ ఎక్సైజ్ శాఖ మంత్రి శ్రీనివాస్ గౌడ్ హత్యకు కుట్రపన్నిన వ్యవహారం జాతీయ స్థాయిలో కలకలం రేపిన సంగతి తెలిసిందే. ఇది మర్చిపోకముందే మరో రాష్ట్ర మంత్రి మల్లారెడ్డికి కొందరు బెదిరింపు కాల్ చేశారు. అర్ధరాత్రి పలువురు దుండగులు అసభ్య మెసేజ్ లు చేశారు. దీంతో బోయిన్పల్లి పోలీసులకు ఫిర్యాదు చేశారు. రంగంలోకి దిగిన పోలీసులు విజయవాడకు చెందిన లారీ డ్రైవర్ వాసును అరెస్టు చేశారు.