
రేపటి నుండి పెట్రోలు,డీజల్ కు సమస్యే. పెట్రోలు బంకుల్లో 24 అర్ధరాత్రి నుండి రద్దైన నోట్లను తీసుకోవటం నిలిపేస్తుండటంతో రవాణా రంగంపై తవ్ర ప్రభావం చూపనున్నది. గడచిన 15 రోజులుగా దేశవ్యాప్తంగా అన్నీ పెట్రోలు బంకుల్లోనూ రద్దైన నోట్లను తీసుకుంటున్నారు. అయితే, గురువారం అర్ధరాత్రి నుండి వాటిని అంగీకరించకూడదని అఖిల భారత పెట్రోలు బంకుల సంఘం నిర్ణయించింది. దాంతో ప్రజల ఇక్కట్లు మొదలవ్వనున్నది.
రెండు తెలుగు రాష్ట్రాల్లో కలిపి సుమారు 7 వేల బంకులున్నాయి. ఇవన్నీ సగటున రోజుకు 35 లక్షల లీటర్ల పెట్రోలు, డీజల్ అమ్ముతున్నాయి. ఇందులో ఒక్క హైదరాబాద్ చుట్టుపక్కలే 400 బంకులున్నాయి. పై 35 లక్షల ఆయిల్ కేవలం రీటైల్ అమ్మకాలే. ప్రభుత్వ సంస్దలు కొనుగోలు లెక్కలోకి రాదు. ఎందుకంటే, అవి నెలవారీ ఖాతాలు ఉండటంతో తక్షణం వాటికి వచ్చే ఇబ్బందులు లేవు.
శుక్రవారం నుండి వెయ్యి, 500 రూపాయల నోట్లను అంగీకరించకూడదన్న నిర్ణయం సమాజంపై తీవ్ర ప్రభావమే చూపనున్నది. ఎందుకంటే, కేంద్రప్రభుత్వం విడుదల చేసిన కరెన్సీలో కేవలం 2 వేల రూపాయల నోట్లే అధికంగా ఉన్నాయి. ఇంకా కొత్త 500 రూపాయల నోట్లు అందరికీ అందుబాటులోకి రాలేదు.
దాంతో చెలామణిలో ఉన్న 100, 50, 20 ,10 రూపాయల నోట్లు ఇస్తేనే పెట్రోలు పోయలని నిర్ణయమైంది. అవేమో చెలామణిలో చాలా తక్కువగా ఉన్నాయి. దాంతో ఇటు చిల్లర అందుబాటులో లేక అటు రద్దైన నోట్లను తిరస్కరించనుండటంతో ప్రజల దైనందిన జీవితంపై తీవ్ర ప్రభావం చూపనుండటం ఖాయం.
పెట్రోలు బంకు యాజమాన్యాల నిర్ణయంతో వ్యక్తిగత వాహనాలున్న వారంతా ఆందోళన మొదలైంది. ఉన్న కొద్ది చిల్లరతోనే పెట్రోలు బంకుల వద్ద క్యూ కట్టారు. అయితే అందరి వద్ద ట్యాంకు నింపుకోవటానికి సరిపడా రద్దైన నోట్లు కూడా లేకపోవటం గమనార్హం.
ఎందుకంటే, రద్దైన నోట్లను మార్పిడి కోసం ఉన్న వాటిని చాలా వరకూ బ్యాంకుల్లో జమచేసారు. చిన్న నోట్లను మాత్రమే తీసుకుంటామని స్పష్టం చేస్తున్న యజమాన్యాలు ప్లాస్టిక్ మనీని మాత్రం అంగీకరించనున్నట్లు చెబుతున్నారు. అయితే, డెబిట్, క్రెడిట్ కార్డులు ఎంత మంది వద్ద ఉన్నాయన్నదే అసలైన ప్రశ్న.