
న్యూఢిల్లీ: ఇటీవలే ఓ వార్త తీవ్ర ప్రకంపనలు సృష్టించింది. పాకిస్తాన్‌లో లైంగిక కోరికలతో ఫ్రస్ట్రేటెడ్ అయినవారు ఉన్నారని, వారు సమాధుల నంచి మహిళల మృతదేహాలను బయటకు తీసి మరీ రేప్ చేస్తున్నారనేది ఆ వార్త సారాంశం. సమాధిపైన ఇనుప గ్రిల్స్ పెట్టి తాళం వేసినట్టు చూపిస్తున్న ఫొటో కూడా తెగ వైరల్ అయింది. ఈ ఫొటో ఆధారంగానే ఆ స్టోరీ ఉన్నది. ఈ ఫొటోలను ఫ్యాక్ట్ చేస్తే తాళం వేసి ఉన్న ఆ సమాధి పాకిస్తాన్‌లోనిది కాదని, అది హైదరాబాద్‌లోనిదని తేలింది. ఆ కథనం పూర్తిగా అవాస్తవం అని వెల్లడైంది.
పాకిస్తాన్ యాక్టివిస్ట్ హరిస్ సుల్తాన్ వ్యాఖ్యలను డైలీ టైమ్స్ కోట్ చేసి ఓ కథనం రాసింది. పాకిస్తాన్ ఒక సెక్సువల్లీ ఫ్రస్ట్రేటెడ్ సొసైటీని తయారు చేస్తున్నదని ఆ సమాధి ఫొటో షేర్ చేస్తూ ట్వీట్ చేశారు. ఈ ట్వీట్ ఆధారంగా డైలీ టైమ్స్ కథనం రాయగా.. ఏఎన్ఐ న్యూస్ ఏజెన్సీ కూడా స్టోరీ రాసింది. దీంతో మన దేశంలోని చాలా వార్తా సంస్థలు అదే నిజమని కథనాలు ప్రచురించాయి. కానీ, ఆల్ట్ న్యూస్ ఫ్యాక్ట్ చెకర్ మొహమ్మద్ జుబేర్ ఆ సమాధి ఫొటోను ట్వీట్ చేసి అది పాకిస్తాన్‌కు చెందినది కాదని, హైదరాబాద్‌లో ఆ సమాధి ఉన్నదని ట్వీట్ చేయడంతో అసలు విషయం వెలుగులోకి వచ్చింది.
ఆ తర్వాత హరిస్ సుల్తాన్ కూడా తన ట్వీట్‌ను డిలీట్ చేశారు. ఏఎన్ఐ కూడా ఆ కథనం అవాస్తవం అని మరో స్టోరీ రాసింది.
హైదరాబాద్‌లోని ఓల్డ్ సిటీలో మాదన్నపేట్‌లోని దరబ్‌గంజ్ కాలనీలో ఓ స్మశానం ఉన్నది. ఆ స్మశానంలోనే వైరల్ ఫొటోలోని సమాధి ఉన్నది. ఓ వ్యక్తి ఆ సమాధి గురించి వివరిస్తున్న వీడియో కూడా ట్వీట్ చేశారు.
ఆ సమాధి తమ పూర్వీకులదేనని ఆయన వివరించారు. ఇక్కడ స్మశానంలో పాత సమాధిలోనే కొందరు ఇప్పుడు తవ్వకాలు జరిపి కొత్తగా మళ్లీ మృతదేహాన్ని పూడ్చి పెడుతున్నారని, అందుకే తమ పూర్వీకుల అవశేషాలు భద్రంగా ఉండాలనే ఉద్దేశంతోనే ఈ సమాధిని మరెవరూ తవ్వకుండా నివారించడానికే ఇనుప గ్రిల్ పెట్టి తాళం వేసినట్టు ఆయన తెలిపారు. అంతే తప్పా.. దీని వెనుక మరే విషయమూ లేదని స్పష్టం చేశారు.
కానీ, సోషల్ మీడియాలో ఈ సమాధి ఫొటోతో పాకిస్తాన్‌లో కొందరు శవాలను తవ్వి తీసి రేప్ చేస్తున్నారని, అందుకే సమాధులకు తాళాలు వేసుకుంటున్నారనే ఒక స్టోరీ వైరల్ అవుతున్నదని ప్రస్తావించగా.. అదంతా అవాస్తవం అని తెలిపారు.