Operation Sindoor : భారతీయుడిగా నేను గర్వపడుతున్నా : కేసీఆర్

భారత ఆర్మీ చేపట్టిన ఆపరేషన్ సింధూర్ ను తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి, బిఆర్ఎస్ అధినేత కేసీఆర్ ప్రశంసించారు. ఉగ్రవాదాన్ని అంతం చేయడానికి ప్రపంచ దేశాలన్ని ఏకం కావాలని సూచించారు.  

Google News Follow Us

Operation Sindoor : జమ్మూ కాశ్మీర్ పహల్గాంలో ఉగ్రవాదులు సృష్టించిన మారణహోమానికి భారత్ రివేంజ్ తీర్చుకుంది. పాకిస్థాన్ తో పాటు పాక్ ఆక్రమిత కాశ్మీర్ లోని ఉగ్రవాద స్థావరాలపై మిస్సైల్ దాడులతో విరుచుకుపడింది భారత ఆర్మీ... 'ఆపరేషన్ సింధూర్' ను సక్సెస్ ఫుల్ గా పూర్తిచేసారు. కేవలం ఉగ్రవాదులే టార్గెట్ గా భారత్ ఈ దాడులు చేపట్టింది... ఇందులో మోస్ట్ వాంటెడ్ టెర్రరిస్ట్ లతో సహా 100 మంది వరకు మరణించినట్లు తెలుస్తోంది. 

అయితే భారత్ ఉగ్రవాదుల ఏరివేతకు చేపట్టిన ఆపరేషన్ సింధూర్ పై ఇప్పటికే పార్టీలకు అతీతంగా రాజకీయ నాయకులు స్పందించారు... భారత ఆర్మీకి మద్దతు తెలిపారు. ఇలా తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్ రావు (KCR) కూడా ఆపరేషన్ సింధూర్ పై రియాక్ట్ అయ్యారు. సాహసోపేతమైన భారత ఆర్మీ ఆపరేషన్ ను ఆయన ప్రశంసించారు. 

భారత సైన్యం ప్రదర్శించిన తన సైనిక పాటవానికి ఒక భారతీయుడుగా గర్వపడుతున్నానని కేసీఆర్ అన్నారు. ఉగ్రవాదం, ఉన్మాదం ఏ రూపంలో ఉన్నా.. ఏ దేశంలో ఉన్నా ప్రపంచ మానవాళికి నష్టం కలిగించేదే తప్ప లాభం చేకూర్చేది కాదని... కాబట్టి ఈ ఉగ్రవాదం అంతం కావాల్సిందేనని స్పష్టం చేసారు.  

ఉగ్రవాదం విషయంలో పాజిటివ్ గా ఆలోచించే ప్రపంచ శక్తులన్నీ ఏకమవ్వాలని సూచించారు.  ఉగ్రవాదాన్ని అంతమొందిస్తేనే శాంతి సామరస్యాలు నెలకొంటాయన్నారు. భారత సైన్యం ఎంత వీరోచితంగా దాడులు చేసిందో అంతే అప్రమత్తంగా వుండాలన్నారు. దేశ రక్షణలో మేమెవరికి తీసిపోము అన్నట్టుగా వారికి శక్తి సామర్థ్యాలుండాలని భగవంతున్ని ప్రార్థిస్తున్నానని మాజీ సీఎం కేసీఆర్ పేర్కొన్నారు. 
 

Read more Articles on