Telangana: ఆపరేషన్‌ సిందూర్‌ నేపథ్యంలో సీఎం రేవంత్ కీలక ఆదేశాలు

Published : May 08, 2025, 05:48 AM IST
Telangana: ఆపరేషన్‌ సిందూర్‌ నేపథ్యంలో సీఎం రేవంత్ కీలక ఆదేశాలు

సారాంశం

ఆపరేషన్‌ సిందూర్‌పై స్పందించిన సీఎం రేవంత్‌, అత్యవసర సిబ్బందికి సెలవులు రద్దు, భద్రతా చర్యల్లో జాగ్రత్తలు తీసుకోవాలని ఆదేశాలు జారీ చేశారు.

దేశవ్యాప్తంగా ఉద్రిక్తతలు నెలకొన్న నేపథ్యంలో ఆపరేషన్‌ సిందూర్‌ పేరుతో భద్రతా చర్యలు చేపట్టిన కేంద్ర సర్కార్‌ నిర్ణయానికి అనుగుణంగా తెలంగాణ ప్రభుత్వం అప్రమత్తమైంది. ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి అత్యవసర సమావేశం నిర్వహించి కీలక నిర్ణయాలు తీసుకున్నారు. కమాండ్‌ కంట్రోల్‌ సెంటర్‌లో జరిగిన ఈ సమీక్షలో అత్యవసర సేవల సిబ్బందికి సెలవులు రద్దు చేయాలని సీఎం ఆదేశించారు. అధికారులు, మంత్రులు అందరూ అందుబాటులో ఉండాలని స్పష్టం చేశారు.

అసత్య ప్రచారాలు చేస్తే..

హైదరాబాద్‌ వ్యూహాత్మక నగరం కావడంతో అన్ని శాఖలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. ముఖ్యంగా డిఫెన్స్‌, ఐటీ సంస్థల చుట్టుపక్కల భద్రత పెంచి నిరంతర తనిఖీలు చేయాలని అన్నారు. గతంలో ప్లాన్‌ చేసిన విదేశీ పర్యటనలు ఉంటే మంత్రులు, అధికారులు తాత్కాలికంగా వాయిదా వేసుకోవాలని చెప్పారు. ఇక ప్రభుత్వ ఉద్యోగులు సోషల్‌ మీడియాలో అసత్య ప్రచారాలు చేస్తే వారిపై కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు.

పాకిస్థాన్‌, బంగ్లాదేశ్‌ నుంచి అక్రమంగా వచ్చి నివసిస్తున్నవారిని గుర్తించి వెంటనే అదుపులోకి తీసుకోవాలని ఆదేశించారు. సైబర్‌ దాడుల ముప్పు ఉండే అవకాశం నేపథ్యంలో సైబర్‌ భద్రతకు ప్రత్యేక జాగ్రత్తలు తీసుకోవాలని చెప్పారు. సీసీ కెమెరాలను కమాండ్‌ కంట్రోల్‌ సెంటర్‌కు అనుసంధానం చేసి, రాజధానిలో మూడూ పోలీస్‌ కమిషనరేట్‌ల పరిధిలో భద్రతా పర్యవేక్షణను మెరుగుపరచాలని సూచించారు.

అత్యవసర మందులు, బ్లడ్‌ బ్యాంకుల్లో నిల్వలు సిద్ధంగా ఉంచాలని, ప్రైవేట్‌ ఆసుపత్రుల్లో ఖాళీ బెడ్స్‌ వివరాలను సేకరించాలని అధికారులను ఆదేశించారు. రెడ్‌క్రాస్‌ సమన్వయంతో అవసరమైన సహాయ చర్యలు తీసుకోవాలని అన్నారు. రౌడీషీటర్లు, హిస్టరీషీటర్లపై నిఘా పెంచాలని, శాంతి సంఘాలతో సమావేశాలు నిర్వహించాలని పోలీసులకు సూచించారు.సచివాలయం నుంచి నెక్లెస్‌ రోడ్‌ వరకు గురువారం సాయంత్రం 6 గంటలకు భారత సైన్యానికి మద్దతుగా భారీ ర్యాలీ నిర్వహించనున్నట్టు సీఎంఓ ప్రకటించింది. సీఎం రేవంత్‌ రెడ్డి స్వయంగా పాల్గొననున్న ఈ ర్యాలీలో మంత్రులూ చేరనున్నారు.

ఇటీవలే జరిగిన మాక్‌ డ్రిల్‌ను సీఎం స్వయంగా పర్యవేక్షించగా, ఢిల్లీలో ఉన్న డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్కను వెంటనే హైదరాబాద్‌కు రావాలని సూచించారు. సోషల్‌ మీడియాలో అవాస్తవాలు పోస్ట్‌ చేసే వారిపై గట్టి చర్యలు తీసుకోవాలని, సైబర్‌ భద్రతా విభాగం ఎప్పటికప్పుడు నిఘా ఉంచాలని ఆదేశించారు.ఈ పరిస్థితుల్లో అధికారులు సీఎం కార్యాలయానికి నిరంతరం సమాచారాన్ని చేరవేయాలన్నారు. దేశం ఎదుర్కొంటున్న భద్రతా సవాళ్లకు సమరస్వరంగా, రాజకీయాలకు అతీతంగా స్పందించాల్సిన అవసరం ఉందని ముఖ్యమంత్రి స్పష్టం చేశారు. టీపీసీసీ అధ్యక్షుడు మహేష్‌గౌడ్‌ కూడా ఉగ్రవాదాన్ని ఎదుర్కొనే విషయంలో దేశం ఐక్యంగా ముందుకు సాగుతోందని పేర్కొన్నారు.

PREV
Read more Articles on
click me!

Recommended Stories

Renu Desai Fires on Social Media Trolls: బూతులు పెడితే జైలుకే- రేణుదేశాయ్ హెచ్చరిక | Asianet Telugu
CM Revanth Reddy English Speech: ఇంగ్లీష్ లో స్పీచ్ అదరగొట్టిన సీఎం రేవంత్ రెడ్డి | Asianet Telugu