ఉత్తమ్ కుమార్ రెడ్డిని ఢీకొట్టేది ఆయనే...

By pratap reddyFirst Published Oct 9, 2018, 1:25 PM IST
Highlights

తెలంగాణ అమరుడు శ్రీకాంతాచారి తల్లి శంకరమ్మ ఈ సీటు కోసం సైదిరెడ్డితో పోటీ పడుతున్న విషయం తెలిసిందే. గత ఎన్నికల్లో శంకరమ్మ హుజూర్ నగర్ సీటులోనే ఉత్తమ్ కుమార్ రెడ్డిపై పోటీ చేసి ఓడిపోయారు. 

హైదరాబాద్: హుజూర్ నగర్ శాసనసభ నియోజకవర్గంలో తెలంగాణ పిసిసి అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డిపై పోటీ చేసే తెలంగాణ రాష్ట్ర సమితి (టీఆర్ఎస్) అభ్యర్థి ఖరారైనట్లు తెలుస్తోంది. ఒకటి రెండు రోజుల్లో అభ్యర్థి పేరును తెలంగాణ ఆపద్ధర్మ ముఖ్యమంత్రి, టీఆర్ఎస్ అధినేత కె. చంద్రశేఖర రావు ప్రకటిస్తారని అంటున్నారు. 

ఎన్నారై శానంపూడి సైదిరెడ్డి పేరునే కేసిఆర్ పార్టీ అభ్యర్థిగా ఖరారు చేసినట్లు విశ్వసనీయవర్గాల ద్వారా తెలిసింది. తెలంగాణ అమరుడు శ్రీకాంతాచారి తల్లి శంకరమ్మ ఈ సీటు కోసం సైదిరెడ్డితో పోటీ పడుతున్న విషయం తెలిసిందే. గత ఎన్నికల్లో శంకరమ్మ హుజూర్ నగర్ సీటులోనే ఉత్తమ్ కుమార్ రెడ్డిపై పోటీ చేసి ఓడిపోయారు. 

తిరిగి తనకే టికెట్ ఇవ్వాలని పట్టుబడుతూ వచ్చారు. కానీ, ఉమ్మడి నల్లగొండ జిల్లా నాయకులు ఆమెకు నచ్చజెప్పినట్లు తెలుస్తోంది. అయితే, తొలుత ఆమె పేరుతో పాటు తిప్పన విజయసింహారెడ్డి, శానంపూడి సైదిరెడ్డి పేర్లను టీఆర్ఎస్ నాయకత్వం పరిశీలించింది. ఈ ముగ్గురిలో టికెట్ ఎవరికి ఇస్తే బాగుంటుందనే విషయంపై కేసిఆర్ రెండు విడుతలు సర్వే చేయించారని అంటున్నారు. 

రెండు సర్వేల్లోనూ ఎన్నారై శానంపూడి సైదిరెడ్డికే అనుకూలంగా ఫలితం వచ్చినట్లు తెలుస్తోంది. దాంతో శంకరమ్మకు నచ్చజెప్పే బాధ్యతను ఉమ్మడి నల్లగొండ జిల్లా నాయకులకు కేసిఆర్ అప్పగించి, సైదిరెడ్డి పేరును ఖరారు చేసినట్లు తెలుస్తోంది. 

కుటుంబానిది రాజకీయ నేపథ్యం కావడం, స్థానికుడు కావడం సైదిరెడ్డికి కలిసి వచ్చిందని అంటున్నారు. అయితే, ఇప్పటికే ఆయన నియోజకవర్గంలో విస్తతంగా పర్యటించారు. సోషల్ మీడియాలో విస్తృతంగా ప్రచారం సాగిస్తున్నారు. 

సంబంధిత వార్తలు

ఉత్తమ్ కు కేసిఆర్ చెక్: హుజూర్ నగర్ బరిలో ఎన్నారై

14 పెండింగ్ స్థానాలపై కేసిఆర్ వ్యూహం ఇదే..

ఉత్తమ్ పై పోటీ ఎవరు: ఎన్నారైకి టీఆర్ఎస్ సీటు దక్కేనా?

click me!