తెలంగాణ సచివాలయంలో ‘వైఫై వార్’

First Published Oct 5, 2017, 3:06 PM IST
Highlights
  • గంటల కొద్దీ ఇంటర్ నెట్ సేవలకు అంతరాయం
  • టెక్నికల్ కారణమా? లేక మ్యాన్యువల్ రీజనా ?
  • ఏదో గూడుపుటానీ నడుస్తోందని ఉద్యోగుల అనుమానాలు

తెలంగాణ సచివాలయంలో మరో వార్ నడుస్తోంది. ఇది ఉద్యోగుల మధ్యనో లేక అధికారుల మధ్యనో కాదు. అచ్చంగా కేబుల్ ఆపరేటర్ల మధ్య నడుస్తోంది. మరి ఇలా వైఫై కేబుల్ వార్ నడిస్తే నష్టమేంటి అనుకోవచ్చు. కానీ నష్టం ఉంది. ఆ నష్టం మొత్తం తెలంగాణ పాలనాయంత్రాంగాన్ని స్థంభింపజేస్తున్నది. అంత పెద్ద డేంజర్ వార్ అన్నమాట. మరి వివరాలు చదవండి.

తెలంగాణ సచివాలయంలో గురువారం ఉదయం నుంచి మధ్యాహ్నం వరకు ఇంటర్ నెట్ సేవలు నిలిచిపోయాయి. మామూలే కదా అప్పుడప్పుడు సచివాలయంలో ఇంటర్ నెట్ సేవలు ఆగిపోతాయి కదా? అన్న అనుమానం మీకు రావొచ్చు. కానీ ఇది అలా కాదు. టెక్నికల్ గా వచ్చిన సమస్య కాదు. మ్యానువల్ గా కొందరు కీలక వ్యక్తులు సృష్టించిన సమస్య.

ఇంటర్ నెట్ నిలిచిపోవడంతో సచివాలయంలో వైఫై పనిచేయడంలేదు. ఫలితంగా అధికారులు, సిబ్బంది చేయాల్సిన ఎక్కడి పనులు అక్కడే ఆగిపోయాయి. సచివాలయంలో అధికారులు, సిబ్బంది అంతా ఇంటర్ నెట్ తోనే కంప్యూటర్ లోనే పనిచేయాల్సిన అవసరం ఉంటుంది. కానీ ఇంటర్ నెట్  రాకపోవడంతో వారి పని పెండింగ్ లో పడింది.

అసలు విషయమేమంటే సచివాలయంలో ఇంటర్ నెట్ అందించే ఒక కేబుల్ ఆపరేటర్ సేవలను రద్దు చేసి కొత్త కేబుల్ ఆపరేటర్ కు సేవలందించే భాగ్యం కల్పించాలన్న విషయంలో వివాదం నెలకొంది. ఇందులో ఎవరి ప్రయోజనాలు, ఎవరి ఆమ్యామ్యాలు ఎలా ఉన్నాయో ఏమో అందుకే వైఫై వార్ జరుగుతోందని సచివాలయ ఉద్యోగి ఒకరు వివరించారు.

మరి ఎవరి సేవలు ఎలా ఉన్నా, ఎవరి లెక్కలు ఎలా ఉన్నా సచివాలయానికి మాత్రం జల్దీగా ఇంటర్ నెట్ సేవలు పునరుద్ధరించాలని కొందరు ఉద్యోగులు, ఉన్నతాధికారులు డిమాండ్ చేస్తున్నారు.

అయితే మధ్యాహ్నం తర్వాత ఇంటర్ నెట్ సేవలు పునరుద్ధరించినట్లు తెలిసింది.

click me!