హైదరాబాద్ లో కలకలం రేపిన గోనెసంచిలో మృతదేహం కేసులో ప్రతీకారంతోనే... చనిపోయిన సోదరుడి మృతదేహాన్ని ముక్కలుగా చేసి, గోనెసంచితో మూటకట్టి పడేశారని తేలింది.
హైదరాబాద్ : హైదరాబాదులోని లంగర్ హౌస్ లో కలకలం సృష్టించిన గోనెసంచిలో మృతదేహం కేసులో మరో దారుణమైన విషయం వెలుగు చూసింది. అంత్యక్రియలకు డబ్బులు లేక అన్నను ముక్కలుగా కోసి గోనెసంచిలో పెట్టి.. పడేసామని మృతుడి అన్నా చెల్లెలు శుక్రవారం చెప్పడం తెలిసిందే. అయితే.. అతను బతికున్న సమయంలో మద్యానికి అలవాటు పడి తమను చిత్రహింసలకు గురి చేసేవాడని.. తమ దగ్గర ఉన్న డబ్బులు కూడా లాక్కుని.. వేధించేవాడని.. అందుకే అతను చనిపోయాక కసి తీర్చుకోవడానికి.. ముక్కలుగా కోసి, గోనె సంచిలో పెట్టి పడేసినట్లుగా పోలీసుల విచారణలో అన్నా చెల్లెలు స్వరూప, రాజు వెల్లడించారు.
దీనికి సంబంధించి లంగర్ హౌస్ ఇన్స్పెక్టర్ కే శ్రీనివాస్ తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి.. దివ్యాంగుడైన తమ అన్న, మృతుడు అశోక్ (50).. బతికున్నంత కాలం మద్యానికి బానిసై తీవ్రంగా వేధింపులకు గురి చేసేవాడని అతని సోదరి స్వరూప (35), తమ్ముడు రాజు(45) తెలిపారు. అందుకే చనిపోయిన తర్వాత ప్రతీకారం తీర్చుకోవాలి అనుకున్నారు. అంత్యక్రియలకు డబ్బులు లేకపోవడంతో.. ఆ కోపంలో అశోక్ మృతదేహాన్ని మూడు ముక్కలుగా చేశారు.
రాజేంద్రనగర్లోని ఎన్ఎఫ్ సిఎల్ కాలనీకి చెందిన బాలరాజు, బాలమ్మ దంపతులకు ముగ్గురు కొడుకులు, ఇద్దరు కూతుర్లు. బాలరాజ్ పోస్ట్ ఆఫీస్ లో పనిచేసేవాడు. అతను గతంలోనే మృతి చెందాడు. పెద్ద కుమారుడు, పెద్ద కుమార్తె పెళ్లిళ్లు అయ్యాయి. నగరంలోని వేర్వేరు ప్రాంతాల్లో వీరిద్దరూ నివసిస్తున్నారు. బాలరాజు గతంలోనే మృతి చెందాడు. బాలమ్మకు ఆయన పెన్షన్ వస్తుంది. రెండో కొడుకు అశోక్ (50)దివ్యాంగుడు. అతనితోపాటు చిన్న కొడుకు రాజు, చిన్న కూతురు స్వరూప.. బాలమ్మ కలిసి ఎన్ఎఫ్ సిఎల్ కాలనీలోనే ఉంటున్నారు.
వీడిన గోనెసంచిలో మృతదేహం మిస్టరీ : పోలీసుల అదుపులో అన్నాచెల్లెళ్లు...అంత్యక్రియలకు డబ్బులు లేక..
బాలమ్మకు వచ్చే పింఛనుతోనే కుటుంబం గడుస్తుంది. అశోక్ దివ్యాంగుడు, పైగా ఏ పని చేయకపోయేవాడు.. దీనికి తోడు మద్యానికి బానిస అయ్యాడు. రాజు, స్వరూప కూలీ పనులకు వెళ్తుండే వాళ్ళు. మద్యం కోసం అశోక్ తల్లి పింఛన్ డబ్బులు ఇవ్వమని వేధించేవాడు. రాజు, స్వరూపలను కూడా కూలీ డబ్బులు ఇవ్వమని వేధించి, లాక్కునేవాడు. కాగా ఇటీవల అశోక్ అనారోగ్యం బారిన పడ్డాడు. అతని పరిస్థితి విషమించింది. దీంతో ఇంటికి తీసుకువచ్చారు. తీవ్ర అనారోగ్యంతో మే 9వ తేదీన అశోక్ మృతి చెందాడు.
అయితే ఈ విషయాన్ని.. రాజు, స్వరూపలు ఎవరికీ చెప్పలేదు. రెండు రోజులకు పైగా మృతదేహాన్ని ఇంట్లోనే పెట్టుకున్నారు. అన్న చనిపోయాడు అన్న విషాదాన్ని మించి.. తమను వేధించిన విషయాలే వారిని ఎక్కువగా బాధించాయి. అంత్యక్రియలు చేద్దామన్నా.. తమ దగ్గర చిల్లిగవ్వ లేకుండా లాక్కున్నాడని వాపోయారు. దీంతో చుట్టుపక్కల వారికి చెప్పి వారి సాయంతో అంత్యక్రియలు చేద్దామని తల్లి బాలమ్మ చెప్పింది. రాజు, స్వరూప ఈ విషయాన్ని వినిపించుకోలేదు.
ప్రతీకారం తీర్చుకోవాలనుకున్నారు.కూరగాయలు కోసే కత్తితో అశోక్ మృతదేహాన్ని.. మూడు ముక్కలుగా చేశారు. తలా, కాళ్లు, మొండెంగా విడదీశారు. వీటిని రెండు ప్లాస్టిక్ సంచుల్లో మూటగట్టి గురువారం రాత్రి లంగర్ హౌస్ దగ్గరికి ఆటోలో బయలుదేరారు. అయితే, తమ దగ్గర డబ్బులు లేవని ఆటో డ్రైవర్ కి మార్గమధ్యంలో చెప్పడంతో.. మిల్ట్రీ హాస్పిటల్ దగ్గర వారిద్దరిని ఆటో డ్రైవర్ దింపేసి వెళ్లిపోయాడు.
చేసేదేం లేక అక్కడే సమీపంలో ఉన్న ఫుట్పాత్ మీద అన్న మృతదేహం ఉన్న సంచుల్ని పెట్టి వెళ్లిపోయారు. వీరిని గమనించిన ఓ వ్యక్తి…సంచులను విప్పి చూడగా ఒకదాంట్లో తల కనిపించింది. వెంటనే అతను అప్రమత్తమై మరో ఇద్దరి సహాయం తీసుకుని.. రాజు, స్వరూపలను పట్టుకున్నారు. వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. వీరి సమాచారం మేరకు ఇన్స్పెక్టర్ శ్రీనివాస్ తన సిబ్బందితో అక్కడికి చేరుకుని సంచులను పూర్తిగా తెరిచి చూడగా.. రెండు సంచుల్లో మూడు ముక్కలుగా మృతదేహం కనిపించింది.
మొదట పొంతనలేని సమాధానాలు చెప్పిన రాజు, స్వరూపలు… ఆ తర్వాత పోలీసులు గట్టిగా నిలదీయడంతో.. అది తమ సోదరుడిదేనని చెప్పారు. రాజు కూడా క్యాన్సర్ బాధితుడు. ఈ అన్నింటి నేపథ్యంలో రాజు పోలీసుల ముందే రక్తపు వంతులు కూడా చేసుకున్నాడు. అయితే, రాజు, స్వరూపలతో పాటు.. చనిపోయిన అశోక్ కూడా మానసికంగా బాధపడుతుండే వారిని స్థానికులు పోలీసులకు తెలిపారు. ఈ విషయం వెలుగులోకి రావడంతో పోలీసులు శుక్రవారం ఉదయం పెద్ద కుమారుడైన విజయ్ ని మంగళహాట్ నుంచి పిలిపించి స్టేట్మెంట్ రికార్డ్ చేశారు. శనివారం నాడు పోస్టుమార్టం తర్వాత మృతదేహాన్ని కుటుంబానికి అప్పగించనున్నారు.