జూబ్లీహిల్స్ లోని ఓ వ్యాపారి ఇంట్లో దొంగతనానికి పాల్పడ్డ ఓ దొంగ.. వారి ఫోన్ నుంచే క్యాబ్ బుక్ చేసుకుని మరీ పరారయ్యాడు.
హైదరాబాద్ : ఈ మధ్యకాలంలో దొంగలు కొత్త ఎత్తులు వేస్తున్నారు. పట్టపగలే బాహాటంగా ఇంట్లోకి చొరబడి దొంగతనాలకు పాల్పడుతున్నారు. అంతేకాదు, తమ డిమాండ్ల మేరకే చోరీ చేసుకుని బయటపడుతున్నారు. అలాంటి ఓ విచిత్రమైన దొంగతనం హైదరాబాద్ జూబ్లీహిల్స్ లోని ఓ వ్యాపారి ఇంట్లో చోటు చేసుకుంది. ఆంధ్రప్రదేశ్లోని భీమవరానికి చెందిన ఓ వ్యాపారి జూబ్లీహిల్స్ లో నివాసం ఉంటున్నాడు. అతని ఇంట్లోకి ప్రవేశించిన అగంతకుడు.. ‘నాకు బంగారం వద్దు.. డబ్బులే కావాలి’ అంటూ 6 గంటలకు పైగా ఇంట్లోనే ఉండి బయోత్పాతాన్ని సృష్టించాడు.
చివరికి రూ.10 లక్షల నగదుతో ఉడాయించాడు. ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలలోకి వెళితే.. ఆంధ్రప్రదేశ్లోని భీమవరం ప్రాంతానికి చెందిన ఎన్ఎస్ఎన్ రాజు వ్యాపారి. ఆయన తల్లి, భార్య.. ఎనిమిది నెలల నిండు గర్భిణీ అయిన కూతురితో జూబ్లీహిల్స్ రోడ్ నెంబర్ 52లో ఉంటున్నారు. అతని ఇంటికి శుక్రవారం తెల్లవారుజామున నాలుగు గంటల ప్రాంతంలో నల్లని ముసుగు వేసుకున్న ఓ అగంతకుడు వచ్చాడు.
undefined
అతని ఇంట్లోని మొదటి అంతస్తులోకి నిచ్చెన సహాయంతో ఎక్కాడు. ఆ తరువాత కిటికీ నుంచి ఇంట్లోకి ప్రవేశించాడు. అతని ప్రవేశించిన గదిలో రాజు కుమార్తె గర్భిణీ అయిన నవ్య నిద్రపోతోంది. అగంతకుడు ఆమెను నిద్ర లేపి మేడ మీద కత్తి పెట్టి బెదిరించాడు. తనకు డబ్బులు కావాలని అడిగాడు. అయితే, ఆమె తన ఒంటి మీద ఉన్న వజ్రాల ఆభరణాలు, దాదాపు అరకిలో బంగారు ఆభరణాలు ఇస్తానని తననేమీ చేయొద్దని అడిగింది. అయితే, అతను నవ్యను భయపడవద్దని చెబుతూ.. తనకు బంగార ఆభరణాలు వద్దని డబ్బులే కావాలని డిమాండ్ చేశాడు. రూ.20 లక్షలు నగదు కావాలని అడిగాడు.
ఆమె మెడ మీద కత్తి పెట్టి అలాగే అదే గదిలో ఉదయం 9 గంటల వరకు ఉన్నాడు. తొమ్మిదిన్నర అవుతున్నా కుమార్తె గదిలో నుంచి కిందికి రాకపోవడంతో తల్లికి అనుమానం వచ్చింది. ఏమైందో చూద్దామని వెళ్లి తలుపులు తీయగా కుమార్తె మెడ మీద కత్తి పెట్టిన అగంతకుడు కనిపించాడు. దీంతో విపరీతమైన ఆందోళనకు గురైంది.
మనస్థాపంతో జేపీఎస్ బైరి సోని ఆత్మహత్య.. న్యాయం చేయాలని ఉద్యోగుల ఆందోళన, క్యాండిల్ ర్యాలీ..
తల్లిని చూసిన అంగతకుడు లీలను గదిలో ఓ పక్కన కూర్చోబెట్టాడు. తనకు డబ్బులు కావాలని డిమాండ్ చేశాడు. బంగారం ఇస్తామంటే.. నాకు బంగారం వద్దని నగదు మాత్రమే ఇవ్వాలని డిమాండ్ చేశాడు. దీంతో అప్పటికప్పుడు వారు తమ దగ్గర ఉన్న రూ.2లక్షలు ఇచ్చారు. ఆ తరువాత మరో గంట సేపట్లో నవ్య భర్త మనిష్ రెడ్డి రూ.8లక్షలను తన స్నేహితుడితో పంపించడంతో.. ఆ డబ్బులు కూడా అతనికి ఇచ్చారు. అవి తీసుకుని ఉదయం 10 గంటల సమయంలో ఆ దొంగ ఇంట్లో నుంచి వెళ్లిపోయాడు.
అయితే ఇంత జరుగుతున్నా.. రాజు ఇంకా తన గదిలో నిద్రిస్తూనే ఉన్నాడు. ఆగంతకుడు విషయాన్ని ఎవరికైనా చెబితే చంపేస్తానని బెదిరించాడు. అంతేకాదు డబ్బులు అందిన తర్వాత పదిన్నర గంటల సమయంలో.. నవ్య ఫోన్ నుంచి ఓలా క్యాబ్ బుక్ చేసుకున్నాడు. జూబ్లీహిల్స్ నుంచి షాద్నగర్ వరకు బుక్ చేసుకుని అగంతకుడు వెళ్లిపోయాడు.
ఆ తర్వాత కాసేపటికి తేరుకున్న కుటుంబ సభ్యులు వెంటనే 11:30 గంటల ప్రాంతంలో జూబ్లీహిల్స్ పోలీసులకు సమాచారం ఇచ్చారు. వారు చెప్పిన వివరాల మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.