తెలంగాణలో మరో రెండు కొత్త విమానాశ్రయాలు.. 2027 నాటికి పూర్తి.. ఎక్కడంటే?

Published : Aug 18, 2025, 11:23 AM IST
Bengaluru 2nd Airport

సారాంశం

Telangana New Airports: తెలంగాణలో కొత్తగా వరంగల్, ఆదిలాబాద్ జిల్లాల్లో బ్రౌన్‌ఫీల్డ్ విమానాశ్రయాలు రానున్నాయి. వీటిని 2027 డిసెంబర్ నాటికి అందుబాటులోకి తీసుకురావాలని ఏఏఐ (AAI) లక్ష్యంగా పెట్టుకుంది.

Telangana New Airports: తెలంగాణ వాసులకు శుభవార్త. ఇక విమాన ప్రయాణం మరింత సులభతరం కాబోతుంది. విమానాశ్రయాల విస్తరణలో భాగంగా ఎయిర్‌పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా (AAI) రెండు బ్రౌన్‌ఫీల్డ్ ప్రాజెక్టులను ఆమోదించింది. అవి ఎక్కడంటే? ఎప్పటి వరకు అందుబాటులోకి రానున్నాయనే అంశాలు మీకోసం..

తెలంగాణ రాష్ట్రంలో వైమానిక సౌకర్యాలు మరింత విస్తరించనున్నాయి. వరంగల్, ఆదిలాబాద్ జిల్లాల్లో రెండు బ్రౌన్‌ఫీల్డ్ విమానాశ్రయాలను అభివృద్ధి చేసేందుకు ఎయిర్‌పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా (AAI) కసరత్తు చేస్తోంది. ఈ ప్రాజెక్టులను 2027 డిసెంబర్ నాటికి పూర్తిచేసి, ప్రజలకు అందుబాటులోకి తీసుకురావాలని లక్ష్యంగా పెట్టుకుంది.

వరంగల్ – మామునూరు విమానాశ్రయం

వరంగల్‌లోని మామునూరు విమానాశ్రయ అభివృద్ధి పనులు త్వరలో ప్రారంభం కానున్నాయి. ఈ ప్రాజెక్టుకు అవసరమైన 253 ఎకరాల భూసేకరణ కోసం రాష్ట్ర ప్రభుత్వం గత నెలలో రూ. 205 కోట్లు విడుదల చేసింది. ప్రస్తుతం భూసేకరణ ప్రక్రియ చివరి దశలో ఉంది. మొదట చిన్న విమానాల రాకపోకలకు అనుకూలంగా అభివృద్ధి చేయాలని ఏఏఐ యోచిస్తుంది. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ విజ్ఞప్తి మేరకు A320, B737 వంటి పెద్ద విమానాలు, కార్గో విమానాలు కూడా ల్యాండ్ అయ్యేలా నేరుగా ఆధునిక ప్రమాణాలతో నిర్మాణం చేపట్టాలని నిర్ణయించింది.

ఆదిలాబాద్ – వాయుసేన అనుమతి

ఆదిలాబాద్‌లోని బ్రౌన్‌ఫీల్డ్ విమానాశ్రయం అభివృద్ధికి భారత వాయుసేన ఇప్పటికే అనుమతి తెలిపింది. ఇక్కడ వాయుసేనకు సంబంధించిన 362 ఎకరాల భూభాగం అందుబాటులో ఉండగా, అదనపు భూసేకరణను రాష్ట్ర ప్రభుత్వం చేపట్టనుంది. ఈ ప్రాజెక్టుతో ఉత్తర తెలంగాణలో వైమానిక కనెక్టివిటీ పెరగనుంది.

రాష్ట్ర ప్రభుత్వం ఈ రెండు విమానాశ్రయాలను 2027 జూన్ నాటికి పూర్తి చేయాలని కేంద్రాన్ని కోరింది. అయితే, కేంద్ర ప్రభుత్వం స్థానిక పరిస్థితులను పరిగణనలోకి తీసుకుని 2027 డిసెంబర్ నాటికి అందుబాటులోకి తెస్తామని హామీ ఇచ్చినట్లు సమాచారం.

భవిష్యత్ ప్రణాళికలు: వరంగల్, ఆదిలాబాద్‌తో పాటు రాష్ట్ర ప్రభుత్వం రామగుండం, నిజామాబాద్ జిల్లాల్లో కూడా విమానాశ్రయాల ఏర్పాటుకు సన్నాహాలు ప్రారంభించింది. ఇవి కూడా పూర్తి అయితే.. తెలంగాణలో విమాన రవాణా మరింత బలోపేతం కానుంది.

PREV
Read more Articles on
click me!

Recommended Stories

సజ్జనార్ నువ్వు కాంగ్రెస్ కండువా కప్పుకో: Harish Rao Comments on CP Sajjanar | Asianet News Telugu
Harish Rao Serious Comments: సైబర్ నేరగాళ్లకు రేవంత్ రెడ్డికి తేడా లేదు | Asianet News Telugu