
Telangana Sarpanch Elections: తెలంగాణలో స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణపై రాజకీయ చర్చ కొనసాగుతోంది. హైకోర్టు ఆదేశాల ప్రకారం సెప్టెంబర్ చివరి నాటికి ఎన్నికలు నిర్వహించాలి. అయితే.. కొంతమంది బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు ఇచ్చిన తరువాతే ఎన్నికలు నిర్వహించాలని అభిప్రాయపడుతుండగా, మరికొందరు కోర్టు ఆదేశాల ప్రకారం ఎన్నికలు నిర్వహించాలని కోరినట్టు తెలుస్తోంది.
ఇలా తుది నిర్ణయం కోసం సీనియర్ నేతలతో చర్చలు ముమ్మరంగా సాగుతున్నాయి. ఈ నేపథ్యంలో ఈ నెల 23న కాంగ్రెస్ పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ (PAC) సమావేశం నిర్వహించాలని సీఎం రేవంత్‌రెడ్డి సూచించారు. ఇందులో సీనియర్ నేతల అభిప్రాయాలను సేకరించి, ఇతరుల సూచనల ఆధారంగా తుది నిర్ణయం ప్రకటించనున్నారు.
బీసీ రిజర్వేషన్లపై పోరాటం
స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 42% రిజర్వేషన్లు అమలు చేయడానికి అధికార కాంగ్రెస్ తీవ్రంగా ప్రయత్నిస్తోంది. ఈ నేపథ్యంలో పీసీసీ అధ్యక్షుడు మహేశ్‌కుమార్ గౌడ్ కూడా బీసీలకు 42% రిజర్వేషన్లు అమలులోకి వచ్చిన తరువాతే స్థానిక ఎన్నికలు జరగాలనే తన పట్టుదలతో ఉన్నట్టు తెలుస్తోంది. ఈ క్రమంలో బీసీ రిజర్వేషన్లపై కేంద్రం నుంచి ఇంకా స్పందన రాకపోవడంతో, అవసరమైతే హైకోర్టును మరింత గడువు అడగాలని కూడా ఆయన సూచించినట్లు సమాచారం.
సీఎం నివాసంలో సుదీర్ఘ చర్చలు
ఈ నేపథ్యంలో పీసీసీ అధ్యక్షుడు మహేశ్‌కుమార్ గౌడ్, మంత్రి పొన్నం ప్రభాకర్, మాజీ ఎంపీ వీ.హెచ్. కలిసి జూబ్లీహిల్స్‌లోని సీఎం నివాసంలో ఆదివారం నాడు ఎన్నికల అంశంపై సుదీర్ఘ చర్చ జరిపారు. ఈ సందర్భంగా కొందరు మంత్రులు వెంటనే ఎన్నికలు జరపాలని కోరగా, మరోవైపు బీసీ రిజర్వేషన్ల సమస్య తేలేవరకూ వాయిదా వేయాలనే అభిప్రాయం వ్యక్తమైంది. బీసీ రిజర్వేషన్ల కోసమే కులగణన సర్వే చేసి... అసెంబ్లీలో బిల్లు ఆమోదించి రాష్ట్రపతికి పంపినందువల్ల దానికి కట్టు బడి ఉన్నామనే సందేశాన్ని ప్రజలకు పంపాల్సి ఉంటుందని ముగ్గురు నేతలు సీఎంకు చెప్పినట్లు తెలుస్తోంది. పార్టీపరంగా రిజర్వేషన్లు కల్పించి ఎన్నికలకు వెళ్తే ఎలా ఉంటుందనే కోణంలో సమాలోచనలు జరిపినట్లు తెలుస్తోంది.
పార్టీ బలోపేతంపై దృష్టి
ఇక, ఎన్నికల చర్చలతో పాటు పార్టీని క్షేత్రస్థాయిలో బలోపేతం చేసే దిశగా కూడా వ్యూహరచన సాగుతోంది. కొన్ని అసెంబ్లీ నియోజకవర్గాల్లో ఇతర పార్టీల నుంచి వచ్చిన నేతలకు, పాత కాంగ్రెస్ శ్రేణులకు మధ్య తలెత్తుతున్న విభేదాలను చక్కదిద్దాలని పీసీసీ అధ్యక్షు డికి రేవంత్ రెడ్డి సూచించినట్లు తెలుస్తోంది. అలాగే.. కాంగ్రెస్‌లో అంతర్గత విభేదాలను పరిష్కరించి, అందరూ కలిసికట్టుగా పనిచేసేలా చూడాలని నిర్ణయించారు. పార్టీ విరోధక చర్యలకు పాల్పడే నేతలపై క్రమశిక్షణా చర్యలు తప్పవని కూడా హెచ్చరిక వెలువడినట్లు సమాచారం. మొత్తానికి, బీసీ రిజర్వేషన్లు - ఎన్నికల సమయం అనే రెండు కీలక అంశాలపై కాంగ్రెస్ వ్యూహాత్మక నిర్ణయాలు తీసుకోబోతోందని స్పష్టమవుతోంది.