సికింద్రాబాద్ సింధి కాలనీ వ్యాపారి ఇంట్లో చోరీ కేసులో నేపాలీకి చెందిన తొమ్మిది మంది గ్యాంగ్ ను అరెస్ట్ చేసినట్టుగా హైద్రాబాద్ సీపీ సీవీ ఆనంద్ చెప్పారు.
హైదరాబాద్: సికింద్రాబాద్ సింధి కాలనీలో వ్యాపారి ఇంట్లో చోరీ కేసులో నేపాలీకి చెందిన తొమ్మిది మంది గ్యాంగ్ ను అరెస్ట్ చేసినట్టుగా హైద్రాబాద్ సీపీ సీవీ ఆనంద్ చెప్పారు.బుధవారంనాడు తన కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఈ చోరీ కేసు వివరాలను సీపీ సీవీ ఆనంద్ వివరించారు. నిందితుల నుండి రూ. 5 కోట్ల విలువైన బంగారు ఆభరణాలు, నగదును స్వాధీనం చేసుకున్నట్టుగా సీపీ ఆనంద్ తెలిపారు. పక్కా ప్రణాళికతోనే ఈ గ్యాంగ్ చోరీ చేసిందన్నారు.
ఈ నెల 9వ తేదీన సికింద్రాబాద్ కు చెందిన వ్యాపారి రాహుల్ గోయల్ నివాసంలో చోరీ జరిగింది. ఈ చోరీకి రాహుల్ ఇంట్లో సెక్యూరిటీ గార్డుగా పనిచేసే కమల్ కీలకపాత్రధారిగా వ్యవహరించాడని సీపీ తెలిపారు. కమల్ స్నేహితులు, బంధువులు ఈ చోరీలో పాల్గొన్నారని సీపీ ఆనంద్ తెలిపారు.
వ్యాపారి రాహుల్ మొయినాబాద్ ఫాం హౌస్ కు వెళ్తున్న విషయం తెలుసుకుని అదే రోజు చోరీకి ముహుర్తంగా నిర్ణయించుకున్నారన్నారు. మొయినాబాద్ ఫాం హౌస్ కు రాహుల్ కుటుంబం వెళ్లిన తర్వాత కమల్ తన స్నేహితులను పిలిపించి చోరీకి పాల్పడ్డారన్నారు.
చోరీ చేయడానికి ముందు వ్యాపారి రాహుల్ కుటుంబానికి ఎలాంటి అనుమానం కలగకుండా కమల్ వ్యవహరించారని సీపీ తెలిపారు. రాహుల్ నివాసం నుండి దోచుకున్న సొమ్ముతో వారంతా కూకట్ పల్లి నుండి పుణెకి వెళ్లారని సీపీ ఆనంద్ తెలిపారు.
దోచుకున్న సొమ్ముతో వీరంతా ఇండియా నేపాల్ సరిహద్దులో అరెస్ట్ చేశామన్నారు. వీరంతా నేపాల్ వెళ్లకుండా తమ అధికారులంతా తమ పరిచయాలతో ఆయా రాష్ట్రాల్లో ఉన్న పోలీస్ ఉన్నతాధికారులతో మాట్లాడారని హైద్రాబాద్ సీపీ సీవీ ఆనంద్ తెలిపారు.