బీసీ నేతలను చులకన చేస్తే చూస్తూ ఊరుకోబోమని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ కాంగ్రెస్ నేతలనుద్దేశించి వ్యాఖ్యానించారు.
హైదరాబాద్: బీసీ నేతలను చులకన చేసి మాట్లాడితే సహించేది లేదని తెలంగాణ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ చెప్పారు.బీఆర్ఎస్ కు చెందిన బీసీ నేతలు బుధవారంనాడు తలసాని శ్రీనివాస్ యాదవ్ నివాసంలో సమావేశమయ్యారు. కాంగ్రెస్ పార్టీ నేతలు బీసీలను చులకన చేసేలా చేసిన వ్యాఖ్యలపై చర్చించారు. ఈ సమావేశం ముగిసిన తర్వాత మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ మీడియాతో మాట్లాడారు.
బాడీ షేమింగ్ చేస్తూ మాట్లాడడం బాధకరంగా ఆయన పేర్కొన్నారు. ఈ రకమైన వ్యాఖ్యలపై అన్ని బీసీ కులాలను పిలిపించి మాట్లాడుతామన్నారు. నోరుందని ఇష్టారీతిలో మాట్లాడితే చూస్తూ ఊరుకోబోమని తలసాని శ్రీనివాస్ యాదవ్ చెప్పారు. బీసీ నేతలపై వ్యక్తిగత దాడులు చేస్తే చూస్తూ ఊరుకోబోమన్నారు. తాము తెగిస్తే దేనికి భయపడమన్నారు. తామంటే ఏమిటో రానున్న రోజుల్లో నిరూపిస్తామని తలసాని శ్రీనివాస్ యాదవ్ చెప్పారు. పద్దతిగా ఉండాలని తాము ఇన్నాళ్లు మౌనంగా ఉన్నట్టుగా తలసాని శ్రీనివాస్ యాదవ్ తెలిపారు.
అనుచిత వ్యాఖ్యల ద్వారా లాభం కలుగుతుందని భావిస్తే మీ ఖర్మ అంటూ ఆయన కాంగ్రెస్ పార్టీ నేతలను ఉద్దేశించి వ్యాఖ్యానించారు. కళ్లు తెరవకపోతే కాంగ్రెస్ పార్టీ భూస్థాపితం కానుందని చెప్పారు. రాష్ట్ర వ్యాప్తంగా బీసీలను ఏకం చేసి కాంగ్రెస్ అంతు చూస్తామని తలసాని శ్రీనివాస్ యాదవ్ స్పష్టం చేశారు.కులవృత్తుల, సమస్యలు తమకు తెలుసునని తలసాని శ్రీనివాస్ యాదవ్ చెప్పారు. త్వరలోనే హైద్రాబాద్ లో భారీ బహిరంగ సభను ఏర్పాటు చేస్తామన్నారు.
బీసీలలో ఎదుగుతున్న నాయకత్వాన్ని చులకన చేస్తూ బరితెగించి అహంకారంతో కొంతమంది నాయకులు మాట్లాడుతున్నారని మరో మంత్రి వి.శ్రీనివాస్ గౌడ్ చెప్పారు.
బీసీల ఆత్మ గౌరవాన్ని దెబ్బతీసేలా కాంగ్రెస్ పార్టీ నేతలు మాట్లాడుతున్నారని ఆయన ఆరోపించారు.బీసీల జోలికొస్తే బీసీల నాయకులు, కుల సంఘాల ప్రతినిధులు, ప్రజలు కాంగ్రెస్ పార్టీని భూస్థాపితం చేస్తారని ఆయన వార్నింగ్ ఇచ్చారు.
ఆత్మగౌరవంతో ముందుకు వెళ్తుంటే అక్రోషం తో బీసీలపై కాంగ్రెస్ వ్యాఖ్యలు చేస్తుందన్నారు. బీసీలను అణచివేయాలని లక్ష్యంతో బీసీ నాయకత్వాన్ని ఎదగనీయకుండా
కాంగ్రెస్ కుట్ర పన్నుతుందని ఆయన విమర్శించారు. బీసీలను కించపరిచేలా పెయిడ్ ఆర్టిస్ట్ లతో టార్గెట్ చేస్తున్నారని మంత్రి శ్రీనివాస్ గౌడ్ ఆరోపించారు. తమ ఓట్ల తో గెలిచి తమనే టార్గెట్ చేస్తున్నారని ఆయన విమర్శలు చేశారు. గడపగడపకు వెళ్లి కాంగ్రెస్ పార్టీ నేతలు బీసీల పై చేస్తున్న వ్యతిరేక విధానాలను ఎండగడతామన్నారు.త్వరలో తమ కార్యాచరణను ప్రకటిస్తామని ఆయన ప్రకటించారు.తెలంగాణలో 56 శాతం బీసీలున్నారన్నారని మంత్రి గంగుల కమలాకర్ చెప్పారు. బీసీలు రాజకీయంగా, ఆర్ధికంగా ఎదిగేలా కేసీఆర్ కృషి చేశారని గంగుల కమలాకర్ చెప్పారు.