తెలంగాణ నిరుద్యోగులకు శుభవార్త: కేసీఆర్ జోనల్ వ్యవస్థకు మోడీ ఓకే

First Published Aug 6, 2018, 11:34 AM IST
Highlights

తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం  తీసుకొచ్చిన  కొత్త జోనల్ వ్యవస్థకు కేంద్రం ఆమోదం తెలిపే అవకాశాలున్నాయి. రెండు మూడు రోజుల్లోనే ఈ మేరకు  ఉత్తర్వులు వెలువడే అవకాశాలున్నాయని  సమాచారం


హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం  తీసుకొచ్చిన  కొత్త జోనల్ వ్యవస్థకు కేంద్రం ఆమోదం తెలిపే అవకాశాలున్నాయి. రెండు మూడు రోజుల్లోనే ఈ మేరకు  ఉత్తర్వులు వెలువడే అవకాశాలున్నాయని  సమాచారం. కొత్త జోన్ల వ్యవస్థకు సంబంధించి కేంద్రం ఆమోదం కోసం కేసీఆర్ ఢిల్లీకి వెళ్లి ప్రధానమంత్రి మోడీని కలిసిన విషయం తెలిసిందే.

తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు  తర్వాత రాష్ట్ర అవసరాలకు అనుగుణంగా  కొత్త జోన్లను ఏర్పాటు చేసింది సర్కార్.  ఉమ్మడి ఏపీ రాష్ట్రంలో  మొత్తం ఆరు జోన్లు ఉండేవి. ఒకటి నుండి నాలుగు జోన్ల వరకు  ఏపీ , రాయలసీమ ప్రాంతంలో ఉండేవి.  ఐదు, ఆరు జోన్లు తెలంగాణ ప్రాంతంలో ఉండేవి. అయితే తెలంగాణ  రాష్ట్రం ఏర్పాటైన తర్వాత  జోన్లను కేసీఆర్ సర్కార్  పునర్వవ్యస్థీకరించింది.

తెలంగాణలోని 31 జిల్లాలకు గాను ఏడు జోన్లు, రెండు మల్టీజోన్లను ఏర్పాటు చేశారు. 95 శాతం ఉద్యోగావకాశాలను స్థానికులకే దక్కేలా  ఏర్పాటు చేశారు.  ఐదు శాతం మాత్రమే ఓపెన్ కేటగిరిలో ఏర్పాటు చేశారు. రాష్ట్ర స్థాయి కేడర్‌ను పూర్తిగా రద్దు చేశారు.  

371 డీ  అధికరణ ప్రకారం కొత్త జోనల్ వ్యవస్థను ఆమోదిస్తూ  రాష్ట్రపతి ఉత్తర్వులు జారీ చేస్తే  కొత్త జోన్లకు ఆమోదం దక్కుతోంది. కొత్త జోన్లకు ఆమోదం కోసం తెలంగాణ సీఎం కేసీఆర్ ఈ నెల 3వ తేదీన ఢిల్లీకి వెళ్లారు. ఈ నెల 4వ తేదీన ప్రధానమంత్రి మోడీతో సీఎం కేసీఆర్ సమావేశమయ్యారు.

కొత్త జోన్లకు ఆమోదముద్ర వేయాలని  ఆయన ప్రధానమంత్రి మోడీని కోరారు. ఈ మేరకు ఆయన సానుకూలంగా స్పందించారు.  జోనల్ వ్యవస్థకు రాష్ట్రపతి ఆమోదం పొందేందుకు వీలుగా  కేంద్రం అవసరమైన చర్యలు తీసుకోవాల్సి ఉంది.ఈ మేరకు ఆ ప్రక్రియను చేపట్టాలని  సీఎం కేసీఆర్  కేంద్ర హోంశాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ తో పాటు సంబంధిత మంత్రులను కలిశారు. సీఎం కేసీఆర్ వినతి పట్ల  కేంద్రం సానుకూలంగా ఉందని సమాచారం. ఈ మేరకు  త్వరలోనే  కేంద్రం ఈ విషయమై నిర్ణయం తీసుకొనే అవకాశాలున్నాయని చెబుతున్నారు.

ఈ వార్త చదవండి:జోనల్ వ్యవస్థ అంటే ఏమిటీ?: మోడీ చేతికి చిక్కిన కేసీఆర్

                          జోనల్ వ్యవస్థపై కుస్తీ: డీల్లీకి కేసీఆర్, మోడీ వింటారా?

 

click me!