అలా చేస్తే కాంగ్రెస్‌లో కష్టం, బీజేపీలోకి లేదంటే కొత్త పార్టీయే: కోమటిరెడ్డి లీకులు

By Siva KodatiFirst Published Mar 6, 2020, 6:04 PM IST
Highlights

రెండు సార్లు చేసిన తప్పుని మరోసారి కాంగ్రెస్ చేయకూడదన్నారు ఆ పార్టీ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి. మళ్ళీ మళ్లీ తప్పులు చేస్తే కాంగ్రెస్‌లోనే ఉండి టీఆర్ఎస్‌ను గద్దె దించడమా..? వేరే వేదిక ఏర్పాటు చేయడమా అన్నది ఆలోచిస్తామన్నారు. 

రెండు సార్లు చేసిన తప్పుని మరోసారి కాంగ్రెస్ చేయకూడదన్నారు ఆ పార్టీ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి. మళ్ళీ మళ్లీ తప్పులు చేస్తే కాంగ్రెస్‌లోనే ఉండి టీఆర్ఎస్‌ను గద్దె దించడమా..? వేరే వేదిక ఏర్పాటు చేయడమా అన్నది ఆలోచిస్తామన్నారు.

లేదంటే కొత్త పార్టీ సైతం పుట్టే అవకాశం ఉందని, సమయం వచ్చినప్పుడు అన్ని చెబుతానని  రాజగోపాల్ రెడ్డి బాంబు పేల్చారు. కాంగ్రెస్ తప్పుడు నిర్ణయం తీసుకుంటే బీజేపీ లేదంటే వేరే వేదికపై నుంచైనా కేసీఆర్‌తో కొట్లాడతామన్నారు. 

తెలంగాణ కాంగ్రెస్‌లో నాయకత్వ లోపం ఉందని, ఈ విషయాన్ని తాను ఎన్నోసార్లు చెప్పానన్నారు. ఇది బాధతో, ఆవేదనతో అన్న మాటలే తప్పించి వేరే ఉద్దేశ్యంతో కాదని కోమటిరెడ్డి స్పష్టం చేశారు.

Also Read:తాను అబద్ధాలు చెబుతూ.. గవర్నర్‌తో కూడానా: కేసీఆర్‌పై కోమటిరెడ్డి ఫైర్

అధికారాన్ని కోల్పోయిన తర్వాత టిక్కెట్లు సరిగ్గా ఇవ్వలేదని, పొత్తుల విషయంలో కాంగ్రెస్‌కు వ్యూహం లేదని ఆయన వ్యాఖ్యానించారు. తమ లక్ష్యం కేసీఆర్‌ను గద్దె దింపడమేనని, కాంగ్రెస్ హైకమాండ్ సరైన నిర్ణయాలు తీసుకుంటే అందరితో కలిసి పోరాడటానికి తాను సిద్ధమేనన్నారు. 

శుక్రవారం గాంధీభవన్‌లో ఆయన మీడియాతో మాట్లాడుతూ.. రాష్ట్రంలో కేసీఆర్ కుటుంబం, ఆయన అనుచరులు తప్పించి ఏ ఒక్కరూ సంతోషంగా లేరన్నారు. కేసీఆర్ ఓట్ల కోసమే పెన్షన్లు పెంచారని, ఎన్నికలు వచ్చినప్పుడే రైతు బంధు పథకం డబ్బులు రైతుల ఖాతాల్లో పడుతున్నాయని కోమటిరెడ్డి ఆరోపించారు.

కోకాపేటలో భూములు ఉన్నోళ్లకు, రియల్ ఎస్టేట్ వెంచర్లు వేసే వారికి, వందల ఎకరాలు ఉన్నోళ్లకు కూడా రైతు బంధు పథకం కింద డబ్బులు పడ్డాయన్నారు. దీనిపై తెలంగాణ ప్రభుత్వం సరైన ప్రణాళిక రూపొందించిందా అని కోమటిరెడ్డి నిలదీశారు.

కేసీఆర్ ఒక్కరే ఉద్యమం చేసినందువల్ల తెలంగాణ రాలేదని.. ఉద్యమం చేస్తేనే కేసీఆర్ ఫ్యామిలీ బాగుపడితే, బలిదానం చేసుకున్నవాళ్లు రోడ్లవెంట తిరుగుతున్నారని రాజగోపాల్ రెడ్డి ధ్వజమెత్తారు.

ఇంటింటికి కుళాయి ఇవ్వనిదే తాను ఓట్లు అడగనని చంద్రశేఖర్ రావు అన్నారని, మునుగోడు నియోజకవర్గంలో తనతో పాటు పర్యటిస్తే ఎన్ని గ్రామాల్లో నల్లా వస్తుందో తెలుస్తందని కోమటిరెడ్డి చెప్పారు. ఇంద్రకరణ్ రెడ్డి, ముత్తిరెడ్డి యాదగిరి సైతం తమ నియోజకవర్గాల్లో ఇంటింటి నల్లా రాలేదని అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేశారని కోమటిరెడ్డి గుర్తుచేశారు.

ఇంటింటి నల్లాపై టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు సైతం ఫిర్యాదు చేస్తున్నారని ఆయన విమర్శించారు. జరగని దానిని జరిగినట్లు కేసీఆర్‌కు అబద్ధం చెప్పాల్సిన అవసరం ఏంటని కోమటిరెడ్డి నిలదీశారు. కేసీఆర్ ఆబద్ధాలు ఆడేది కాక గవర్నర్‌తో కూడా చెప్పిస్తున్నారని కోమటిరెడ్డి మండిపడ్డారు.

Also Read:తెలంగాణ అసెంబ్లీలో టీఆర్ఎస్‌కు చెక్:సీఎల్పీ ప్లాన్ ఇదీ

ఆరేళ్లలో ఎన్ని లక్షల డబుల్ బెడ్‌రూమ్ ఇళ్ళు కట్టించారని రాజగోపాల్ రెడ్డి ప్రశ్నించారు. చింతమడక, ఎర్రవల్లి, సిరిసిల్ల, ఎర్రవల్లి, గజ్వేల్‌ తప్పించి ఇంకెక్కడ కట్టించారో చెప్పాలని ఆయన డిమాండ్ చేశారు.

రైతులు పండించిన పంటలకు గిట్టుబాటు ధర కల్పించడంలోనూ టీఆర్ఎస్ సర్కార్ విఫలమైందని కోమటిరెడ్డి ఆరోపించారు. కాళేశ్వరం ప్రాజెక్ట్ ద్వారా ఇప్పటి వరకు ఎన్ని ఎకరాలకు నీరు అందిందో చెప్పాలని రాజగోపాల్ రెడ్డి ప్రశ్నించారు. 

click me!