నాగమణిని క్షమించండి: ప్రభుత్వానికి డాక్టర్స్ అసోసియేషన్ విజ్ఞప్తి, మెత్తబడ్డ సర్కార్

By Siva KodatiFirst Published Mar 6, 2020, 5:50 PM IST
Highlights

గాంధీ ఆసుపత్రి ఆసుపత్రి వైరాలజీ ల్యాబ్ ఇన్‌ఛార్జ్ డాక్టర్ నాగమణిపై చర్యలు తీసుకోవద్దని తెలంగాణ ప్రభుత్వ వైద్యుల సంఘం ప్రభుత్వానికి విజ్ఞప్తి చేసింది. 

గాంధీ ఆసుపత్రి ఆసుపత్రి వైరాలజీ ల్యాబ్ ఇన్‌ఛార్జ్ డాక్టర్ నాగమణిపై చర్యలు తీసుకోవద్దని తెలంగాణ ప్రభుత్వ వైద్యుల సంఘం ప్రభుత్వానికి విజ్ఞప్తి చేసింది. కరోనా అనుమానితుల వైద్య పరీక్షల్లో సరైన ఫలితం నిర్ధారణ చేయలేదని ఇటీవల నాగమణిపై ప్రభుత్వం వేటు వేసింది.

అయితే డాక్టర్ల సంఘం అభ్యర్ధన మేరకు నాగమణిని ఫీవర్ ఆసుపత్రికి బదిలీ చేస్తూ వైద్య ఆరోగ్య శాఖ ఆదేశాలు జారీ చేసింది. కరోనా అనుమానితులు గాంధీకి క్యూ కట్టడంతో ఆసుపత్రి కిటకిటలాడుతోంది. ఇదే సమయంలో హైదరాబాద్ మైండ్ స్పేస్‌లో ఓ సాఫ్ట్‌వేర్ ఉద్యోగినితో పాటు మరో వ్యక్తికి కరోనా సోకిందా.. లేదా అన్న రిపోర్టు ఆలస్యం అవ్వడంతో పాటు తప్పులు దొర్లాయి.

Also Read:మైండ్ స్పేస్ ఉద్యోగికి కరోనా నెగెటివ్: ఈటల రాజేందర్ స్పష్టీకరణ

దీనిని తీవ్రంగా పరిగణించిన ప్రభుత్వం నాగమణిపై ఆగ్రహం వ్యక్తం చేసింది. గాంధీ ఆసుపత్రికి ఉన్న పేరు ప్రఖ్యాతుల దృష్ట్యా ప్రజల్లోకి తప్పుడు సంకేతాలు వెళ్లే అవకాశం ఉన్నందున ఈ నిర్ణయం తీసుకున్నట్లు సర్కార్ ఆదేశాల్లో తెలిపింది. 

బుధవారం మైండ్‌స్పేస్‌లోని 20వ నెంబర్ భవనంలో కరోనా లక్షణాలు బయటపడిన ఉద్యోగినికి నెగిటివ్ రిజల్ట్ వచ్చినట్లు తెలంగాణ వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ఈటల రాజేందర్ తెలిపారు.

గురువారం మీడియాతో మాట్లాడిన ఆయన తెలంగాణలో రెండు కరోనా అనుమానిత కేసులకు నెగిటివ్ వచ్చిందన్నారు. మైండ్ స్పేస్ ఉద్యోగినితో పాటు అపోలో ఆసుపత్రిలో శానిటేషన్ మహిళకు కూడా కరోనా నెగిటివ్ అని తేలిందన్నారు.

అలాగే గాంధీ ఆసుపత్రిలో కరోనా పాజిటివ్ వచ్చిన యువకుడు కూడా కోలుకుంటున్నాడని ఈటల స్పష్టం చేశారు. తెలంగాణలో ఒక్క పాజిటివ్ కేసు మాత్రమే నమోదయ్యిందని, ఒక రకంగా రాష్ట్ర ప్రజలు అదృష్టవంతులని ఆయన అన్నారు.

Also Read:కరోనా ఎఫెక్ట్: పడిపోయిన మెట్రో ప్రయాణాలు, రోజుకు 20 వేల తగ్గుదల

తెలంగాణలో ఇక కరోనా రాకూడదని కోరుకుంటున్నానని, కరోనాపై ప్రజలు ఆందోళన చెందాల్సిన అవసరం లేదన్నారు. రాష్ట్ర ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలను కేంద్ర ప్రభుత్వం అభినందించిందని, భారతదేశంలో కరోనా ప్రభావం లేదని ఈటల రాజేందర్ చెప్పారు. 

click me!