నేపాలీ కుటుంబానికి సాయం... మానవత్వాన్ని చాటుకున్న మంత్రి కేటీఆర్

By Arun Kumar PFirst Published Aug 11, 2021, 11:17 AM IST
Highlights

ఆపదలో వున్న నేపాలీ కుటుంబానికి సాయం అందేలా చూసి మంచి మనసున చాటుకున్నారు మంత్రి కేటీఆర్. మంత్రి ఆదేశాలతో నాగార్జున సాగర్ ఎమ్మెల్యే భగత్ స్వయంగా బాధిత కుటుంబాన్ని కలిసి భరోసా ఇచ్చారు. 

నాగార్జునసాగర్: కరోనా కారణంగా దేశంకాని దేశంలో ఇబ్బంది పడుతున్న నిరుపేద కుటుంబానికి సహాయం అందేలా చూసి మానవత్వాన్ని చాటుకున్నారు మంత్రి కేటీఆర్. సోషల్ మీడియా ద్వారా నల్గొండ జిల్లా లో ఓ నేపాలీ కుటుంబం తీవ్ర ఇబ్బందుల్లో వుందని తెలుసుకున్న కేటీఆర్ తక్షణమే సాయం అందించాల్సిందిగా జిల్లా కలెక్టర్, స్థానిక ఎమ్మెల్యేను ఆదేశించారు. దీంతో ఆ కుటుంబానికి భరోసా లభించింది. 

వివరాల్లోకి వెళితే... నేపాల్ దేశంలోని కాఠ్మండుకు చెందిన భవాని బహుదూర్‌ ఉపాధి నిమిత్తం ఇరవై సంవత్సరాల క్రితమే కుటుంబంతో కలిసి తెలంగాణకు వలసవచ్చాడు. నల్గొండ జిల్లా నాగార్జునసాగర్ నియోజకవర్గ పరిధిలోని హాలియాలో ఓ ఇంటిని అద్దెకు తీసుకుని జీవిస్తున్నాడు. అక్కడే గూర్ఖాగా పనిచేస్తూ కుటుంబాన్ని పోషించుకుంటున్నాడు. 

అయితే ఇటీవల కరోనా కారణంగా బహద్దూరు ఉపాధి కోల్పోయి తీవ్ర ఆర్థిక కష్టాలను ఎదుర్కొంటున్నాడు. దీంతో అతడికి భార్యా, ఆరుగురు కూతుర్లు, ఇద్దరు కొడుకులను పోషించడం కూడా భారంగా మారింది. ఎలాగోలా సంసారాన్ని నెట్టుకువస్తున్న అతడికి మరో కష్టం ఎదురయ్యింది. అద్దెకుంటున్న ఇంటిని ఖాళీ చేయాలని యజమాని కోరగా కరోనా సమయంలో వేరే ఇళ్లు అద్దెకు దొరకడం లేదు. ఇలా తీవ్ర ఇబ్బందుల్లో వున్న ఈ నేపాలీ కుటుంబ పరిస్థితిని ఓ యువకుడు ట్విట్టర్ ద్వారా మంత్రి కేటీఆర్ కు తెలిపి సాయం చేయాల్సిందిగా కోరాడు. 

read more హుజూరాబాద్ బైపోల్: టీఆర్ఎస్ అభ్యర్ధిగా గెల్లు శ్రీనివాస్, నేడు ప్రకటించే ఛాన్స్

''నేపాల్ నుండి బ్రతుకుదెరువు కోసం హాలియా వచ్చిన బహదూర్ కరోనా కారణంగా జీవనోపాది కోల్పోయి కుటుంబ పోషణ భారమై తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఇటీవల కిరాయి ఇంటి యాజమాన్యం కూడా  ఎక్కువ మంది నివాసముంటున్నారని ఇల్లు ఖాళీ చేయమని అంటున్నారు. కేటీఆర్ అన్నా... ఈ బీద కుటుంబానికి మీరే ఏదైనా దారి చూపండి'' అంటూ ఓ వ్యక్తి కేటీఆర్ కు ట్వీట్ చేశాడు. 

ఈ ట్వీట్ పై వెంటనే స్పందించిన మంత్రి కేటీఆర్‌ బాధిత కుటుంబాన్ని ఆదుకోవాలని నల్గొండ కలెక్టర్‌ ప్రశాంత్‌ జీవన్‌పాటిల్‌, నాగార్జున సాగర్‌ ఎమ్మెల్యే నోముల భగత్‌కు సూచించారు. దీంతో మంగళవారం ఎమ్మెల్యే భగత్‌ బాధిత కుటుంబాన్ని కలిశారు. ప్రభుత్వం నుంచి డబుల్‌ బెడ్రూం ఇల్లు, హాలియా మున్సిపాలిటీలో బహుదూర్‌కు అవుట్‌సోర్సింగ్‌ ఉద్యోగం ఇవ్వాల్సిందిగా మున్సిపల్‌ కమిషనర్‌ను ఎమ్మెల్యే ఆదేశించారు. ఈ విషయాన్ని మంత్రి కేటీఆర్ కు ట్విట్టర్ ద్వారా తెలియజేశారు ఎమ్మెల్యే భగత్. దీంతో భగత్ కు ధన్యవాదాలు తెలిపారు కేటీఆర్. 

click me!