
హైదరాబాద్ : వ్యవసాయానికి 24గంటల ఉచిత విద్యుత్ అవసరం లేదంటూ తెలంగాణ కాంగ్రెస్ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలపై దుమారం రేగింది. తెలంగాణ రైతాంగానికి వ్యతిరేకంగా రేవంత్ వ్యాఖ్యలు వున్నాయంటూ ఇప్పటికే బిఆర్ఎస్ పార్టీ ఆందోళనలకు పిలుపునిచ్చింది. ఈ క్రమంలో నే ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో ఇవాళ, రేపు(మంగళ, బుధవారాలు)నిరసన కార్యక్రమాలు చేపట్టాలని బిఆర్ఎస్ శ్రేణులకు మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి సూచించారు. బిఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పిలుపుమేరకు కాంగ్రెస్ పార్టీ దిష్టిబొమ్మలు దహనం చేపట్టాలని మంత్రి సూచించారు.
ఈ సందర్భంగా రేవంత్ రెడ్డిపై మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి మండిపడ్డారు. మొదటినుండి కాంగ్రెస్ పార్టీ రైతు వ్యతిరేక విధానాలనే అవలంభిస్తోందని... రైతులను చిన్నచూపు చూస్తోందని అన్నారు. బిఆర్ఎస్ ప్రభుత్వం రైతులకు ఉపయోగపడే పని ఏదిచేసినా దాన్ని కాంగ్రెస్ నాయకులు వ్యతిరేకిస్తున్నారని అన్నారు. భూసమస్యల శాశ్వత పరిష్కారం కోసం ధరణి తీసుకువస్తే దాన్ని వద్దన్నారు... ఇప్పుడు వ్యవసాయానికి ఉచిత విద్యుత్ వద్దంటున్నారని అన్నారు. రేపు రైతులకు పెట్టుబడి సాయంకోసం అందిస్తున్న రైతు బంధుతో పాటు రైతు కుటుంబాలను ఆదుకునేందుకు తీసుకువచ్చిన రైతు భీమా కూడా రేవంత్ వద్దనేలా వున్నాడని మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి ఆందోళన వ్యక్తం చేసారు.
వీడియో
తెలంగాణ రైతాంగం సుభిక్షంగా వుండటం చూసి రేవంత్ కు కండ్ల మంట మొదలయ్యిందని ఇంద్రకరణ్ రెడ్డి అన్నారు. స్వయంగా రైతు కుటుంబం నుండి వచ్చిన సీఎం కేసీఆర్ కు అన్నదాతల బాధలు తెలుసు కాబట్టే వారికి మేలుచేసే నిర్ణయాలు తీసుకుంటున్నారని అన్నారు. దండగ అన్న వ్యవసాయాన్ని కేసీఆర్ పండగలా మారుస్తుంటే కాంగ్రెస్ నాయకులు మాత్రం రైతుల పొట్టగొట్టేందుకు ప్రయత్నిస్తున్నారని మంత్రి మండిపడ్డారు.
గతంలో ఇదే కాంగ్రెస్ పార్టీ పాలనతో కరెంట్ సమస్యలతో రైతులు అరిగోస పడ్డారని ఇంద్రకరణ్ రెడ్డి పేర్కొన్నారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడితే కరెంట్ కష్టాలు వుంటాయని భయపెట్టింది కూడా ఇదే కాంగ్రెస్ నాయకులని అన్నారు. కానీ స్వరాష్ట్రంలో కేసీఆర్ పాలన మొదలయ్యాక నాణ్యతతో కూడిన కరెంట్ ను రైతులకు ఉచితంగా ఇస్తుంటే వారు తట్టుకోలేకపోతున్నారని అన్నారు. అందుకే 24గంటల ఉచిత విద్యుత్ అవసరం లేదని... కేవలం 3గంటలు ఇస్తే చాలంటూ మళ్లీ రైతులను చీకట్లోకి నెట్టే ప్రయత్నం చేస్తున్నారని అన్నారు. బిఆర్ఎస్ ప్రభుత్వంపై బురదజల్లేందుకు కాంగ్రెస్ నాయకులు రైతులను బలిచేసేందుకు సిద్దమయ్యారని... దీన్ని ప్రజలే తిప్పికొట్టాలని మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి సూచించారు.
వ్యవసాయమన్నా, రైతులన్నా మొదటినుండి కాంగ్రెస్ పార్టీకి చిన్నచూపేనని మంత్రి అన్నారు. కాబట్టి తెలంగాణ రైతాంగమంతా వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి తగిన బుద్దిచెప్పి బంగాళాఖాతంలో కలపాలని మంత్రి సూచించారు. ముఖ్యమంత్రి కేసీఆర్, బిఆర్ఎస్ పార్టీకి మద్దతుగా నిలిచి మరోసారి రైతు ప్రభుత్వ ఏర్పాటుకు సహకరించాలని మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి సూచించారు.