
ఆపదలో వున్న వారిని సంజీవనిలా ఆదుకునే అంబులెన్స్‌లు దేశవ్యాప్తంగా తమ సేవలను అందిస్తున్నాయి. సైరన్ వేసుకుంటూ వచ్చే అంబులెన్స్‌లకు దారి ఇస్తూ ప్రజలు కూడా సహకరిస్తున్నారు. అయితే కొందరు దీనిని దుర్వినియోగం చేస్తున్నారు. కొందరు అంబులెన్స్ డ్రైవర్లు అవసరం లేకపోయినప్పటికీ సైరన్‌ను ఉపయోగించి ట్రాఫిక్‌కు ఇబ్బంది కలిగిస్తున్నారనే ఆరోపణలు వున్నాయి.
తాజాగా ఓ వ్యక్తి మిర్చి బజ్జి తెచ్చుకోవడానికి అంబులెన్స్ సైరన్ ఉపయోగించిన వ్యవహారం తెలంగాణలో కలకలం రేపింది. దీనిపై విమర్శలు రావడంతో తెలంగాణ డీజీపీ అంజనీ కుమార్ స్పందించారు. అవసరం లేకపోయినా సైరన్ ఉపయోగిస్తే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. అంబులెన్స్‌లు పేషెంట్లు వుండి, వారు అత్యవసర పరిస్ధితుల్లో వుంటేనే సైరన్ వినియోగించాలని డీజీపీ సూచించారు. దీనికి సంబంధించిన మరిన్ని వివరాలు తెలియాల్సి వుంది.