కౌశిక్​రెడ్డికి మరో షాక్: లీగల్ నోటీసులు పంపిన మాణిక్యం ఠాగూర్, క్షమాపణకు డిమాండ్

By Siva KodatiFirst Published Jul 13, 2021, 7:01 PM IST
Highlights

మూలిగే నక్క మీద తాటికాయ పడ్డట్టుగా అయ్యింది కౌశిక్ రెడ్డి పరిస్ధితి. ఆడియో కాల్ వ్యవహారంలో కాంగ్రెస్ నుంచి బహిష్కరణకు గురైన ఆయకు ఏఐసీసీ తెలంగాణ వ్యవహారాల ఇంచార్జ్​ మాణిక్కం ఠాగూర్​ లీగల్​ నోటీసు పంపారు.

కాంగ్రెస్​ బహిష్కృత నేత పాడి కౌశిక్​రెడ్డికి మరో షాక్ తగిలింది. ఆయనకు ఏఐసీసీ రాష్ట్ర వ్యవహారాల ఇంచార్జ్​ మాణిక్కం ఠాగూర్​ లీగల్​ నోటీసు పంపారు. మధురై కోర్టు నుంచి ఈ లీగల్​ నోటీసు జారీ అయింది. టీపీసీసీ చీఫ్ ఎంపిక​ సందర్భంగా రేవంత్​రెడ్డి నుంచి రూ. 50 కోట్లు తీసుకున్నారనే ఆరోపణలపై ఠాగూర్ నోటీసులిచ్చారు. దీనిపై వారం రోజుల్లో రాతపూర్వకంగా క్షమాపణ చెప్పాలని నోటీసుల్లో పేర్కొన్నారు. లేనిపక్షంలో రూ. కోటి నష్టపరిహారంతో పాటు చట్టపరమైన చర్యలు తీసుకుంటామని మాణిక్యం ఠాగూర్ నోటీసులో వివరించారు.

ఈ సందర్భంగా మాణిక్యం ఠాగూర్​ ట్విట్టర్​ వేదికగా కౌశిక్​రెడ్డిపై వ్యంగ్యాస్త్రాలు సంధించారు. ఇష్టానుసారంగా మాట్లాడినందుకు లీగల్​ నోటీసు పంపుతున్నామని, మధురైకి తిరగాల్సి వస్తుందని సూచించారు. ఈ సందర్భంగా మధురైకి స్వాగతం అంటూ ట్వీట్ చేశారు.

Also Read:మేం లుచ్చాలమా, రూ.50 కోట్లిచ్చి పదవి తెచ్చుకున్నారు: రేవంత్ రెడ్డిపై కౌశిక్

కాగా, తెలంగాణ రాజకీయాలలో కౌశిక్ రెడ్డి వ్యవహారం దుమారం రేపిన విషయం తెలిసిందే. హుజురాబాద్ కాంగ్రెస్ పార్టీ నాయకుడు అయిన కౌశిక్ రెడ్డి టిఆర్ఎస్ పార్టీ తనకు టికెట్ ఇస్తున్నట్లుగా మాట్లాడిన ఆడియో వైరల్ అయ్యింది. ఈ వ్యవహారం తెలంగాణ రాజకీయాల్లో దుమారం రేగింది. శరవేగంగా చోటుచేసుకున్న పరిణామాలలో భాగంగా కౌశిక్ రెడ్డికి కాంగ్రెస్ పార్టీ షోకాజ్ నోటీసులు జారీ చేయడం, ఆ వెంటనే కౌశిక్ రెడ్డికి రాజీనామా చేయడం జరిగిపోయింది.

అనంతరం మీడియాతో మాట్లాడుతూ.. కాంగ్రెస్ పార్టీ నేతలపై ముఖ్యంగా రేవంత్ రెడ్డి, మాణిక్యం ఠాగూర్‌లపై తీవ్ర వ్యాఖ్యలు చేశారు.  ఠాగూర్ కు 50 కోట్ల రూపాయలు ఇచ్చి రేవంత్ రెడ్డి పదవి కొనుక్కున్నారని కౌశిక్ రెడ్డి ఆరోపించారు. అంతేకాకుండా మాణిక్యం ఠాగూర్ యూజ్ లెస్ ఫెలో అంటూ వ్యాఖ్యానించారు. దీనిపై సీరియస్ అయిన మాణిక్యం ఠాగూర్ లీగల్ నోటీసులు పంపారు. 

click me!