
రెండు మూడు రోజుల్లో కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధులను నియమిస్తామన్నారు టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి. చాలా మంది ఇతర పార్టీల నేతలు టచ్‌లోకి వస్తున్నారని ఆయన తెలిపారు. కౌశిక్ విషయం తనకు ముందే తెలుసునని రేవంత్ రెడ్డి వెల్లడించారు. ఆయనతో మాట్లాడిస్తోంది కేసీఆరేనని ఆరోపించారు. కౌశిక్‌కు టీఆర్ఎస్‌లో టికెట్ ఇస్తారని తాను అనుకోవడం లేదని రేవంత్ చెప్పారు. హుజురాబాద్‌లో తమ అభ్యర్ధిని ఇప్పుడే చెప్పేది లేదన్నారు. టీఆర్ఎస్‌కు అభ్యర్ధి లేకనే కాంగ్రెస్ నేతకు గాలం వేస్తున్నారని రేవంత్ ఆరోపించారు.
కాగా, పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడ్డారనే ఆరోపణలపై పార్టీ హుజురాబాద్ నాయకుడు కౌశిక్ రెడ్డిపై తెలంగాణ కాంగ్రెసు బహిష్కరణ వేటు వేసింది. టీఆర్ఎస్ తో కుమ్మక్కయి కౌశిక్ రెడ్డి కోవర్టుగా మారాడాని పీసీసీ అభిప్రాయపడింది. కాగా, కౌశిక్ రెడ్డిని పార్టీ నుంచి సస్పెండ్ చేయాలని కోరుతూ కరీంనగర్ జిల్లా కాంగ్రెసు కమిటీ తీర్మానం చేసింది.
Also Read:కౌశిక్ రెడ్డిపై బహిష్కరణ వేటు: ఇంటి దొంగలను వదిలేది లేదన్న రేవంత్ రెడ్డి
ఇదే సమయంలో పార్టీలో క్రమశిక్షణను ఉల్లంఘించే నేతలకు తెలంగాణ పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి తీవ్రమైన హెచ్చరికలు చేశారు. ఇంటి దొంగలను విడిచి పెట్టేది లేదని ఆయన హెచ్చరించారు. ఇంటి దొంగలు ఎవరైనా ఉంటే పరార్ కావాలని, లేదంటే బుద్ధి తెచ్చుకుని మసలుకోవాలని ఆయన అన్నారు. నెలాఖరు వరకు ఇంటి దొంగలకు సమయం ఇస్తున్నట్లు ఆయన తెలిపారు. పార్టీలో కష్టపడోడుంటే వదులుకునేది లేదని, దగ్గర పెట్టుకుని గుండెల్లో పెట్టుకుని చూసుకుంటామని ఆయన చెప్పారు.