ఓ ప్రబుద్ధుడు కట్నం వద్దంటూ పెళ్లి చేసుకుని, ఆ తరువాత తన నిజస్వరూపాన్ని చూపించాడు. ఆస్తులు మొత్తం తన పేరు మీదికి మార్చాలంటూ వేధింపులకు గురిచేయడం మొదలుపెట్టాడు. మరో మహిళతో సహజీవనం చేస్తున్నాడు.
హైదరాబాద్ : నగరానికి చెందిన ఓ మహిళను కట్నం వద్దంటూ పెళ్లి చేసుకున్న ఓ ప్రబుద్ధుడు ఆ తరువాత తన నిజ స్వరూపాన్ని బయటపెట్టాడు. అతను ఓ రెస్టారెంట్ నిర్వాహకుడు. ఆమెను పెళ్లి చేసుకున్న తర్వాత అతను తన కట్నానికి బదులుగా ఆమె డైరెక్టర్‌గా ఉన్న కంపెనీలలో షేర్లు రాయాలంటూ బెదిరించాడు. శారీరకంగా, మానసికంగా వేధించడంతో పాటు ఆమెపై సీసీఎస్ లో తప్పుడు కేసు పెట్టాడు. దీంతో బాధితురాలు తనకు జరిగిన అన్యాయాన్ని సీసీఎస్ ఆధీనంలోని మహిళా ఠాణాలో ఫిర్యాదు చేసింది. రవి కుమార్ తో సహా ఆరుగురుపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు.
మాట్రిమోనియల్ సైట్ ద్వారా…
బంజర హిల్స్ ప్రాంతానికి చెందిన రీనా ఓ ప్రైవేటు సంస్థకు ప్రమోటర్ డైరెక్టర్. ఏపీలోని తూర్పుగోదావరి జిల్లా.. చింతలపూడి నుంచి వచ్చి గడ్డి అన్నారంలోని తిరుమల హిల్స్ లో నివసిస్తున్న రెస్టారెంట్ నిర్వాహకుడు రవి కుమార్ తో ఈమెకు క్రిస్టియన్ మ్యాట్రిమోనీ వెబ్సైట్ ద్వారా పరిచయమైంది. తల్లిదండ్రులు, రవికుమార్ సమీప బంధువులైన తగరం అబ్రహం, మేరీ రాణి, కరుణ కుమారి, శ్రీనివాస్ లతో సంప్రదింపులు జరిపారు. వాళ్ళు కట్నం కోసం పట్టుబట్టడంతో సంబంధం కుదరలేదు. ఆ తర్వాత కొన్నాళ్లకు రీనాతో సంప్రదింపులు జరిపిన రవి కట్నం లేకుండా వివాహం చేసుకోవడానికి అంగీకరించాడు.
undefined
కేసీనో దందా: ఈడీ విచారణకు హాజరైన చీకోటి ప్రవీణ్
ఈ సమయంలోనే రవికుమార్ యోగా ట్రైనర్ గా చెపుతున్న షాగుఫ్తాను రీనాకు పరిచయం చేశాడు. నిరుడు అక్టోబర్ 15న నిశ్చితార్థం, ఈ ఏడాది ఫిబ్రవరి 12న వివాహం జరిగాయి. రవికుమార్ నిశ్చితార్థం, వివాహానికి ఆయన తరఫువారు హాజరు కాలేదు. దీంతో వారి కోసమంటూ రవికుమార్ చింతలపూడిలో ఈ ఏడాది ఫిబ్రవరి 26న మరోసారి వివాహ కార్యక్రమం, పార్టీ పెట్టాడు. అయితే, వివాహం అయిన కొన్ని రోజులకే రవికుమార్, అతని కుటుంబీకుల అసలు రంగు బయటపడింది. కంపెనీలో రీనా షేర్లు, ఆస్తులు అడగడంతో భర్తే కదా అని ఆమె అన్నీ చెప్పింది. ఈ నేపథ్యంలో ఇంటికి ఆలస్యంగా రావడం మొదలుపెట్టాడు. అదేమని ప్రశ్నిస్తే అసభ్యంగా, అభ్యంతరకరంగా దూషించడంతో పాటు చేయి చేసుకునేవాడు.
ఉద్దేశపూర్వకంగా కులాల ప్రస్తావన తీసుకు వస్తూ కించపరిచే వాడు. కట్నం తీసుకోలేదు కాబట్టి తన కంపెనీతో పాటు, ప్రైవేటు సంస్థలో రీనాకు ఉన్నవి బదిలీ చేయాలని బలవంతం చేశాడు. ఈ ఏడాది మార్చి 11న ఇంటి నుంచి వెళుతూ బదిలీ పూర్తి అయితేనే వస్తాం అని అన్నాడు. మర్నాడు రాత్రి వచ్చిన రవి షేర్లు బదిలీ చేయాలంటూ రీనాను దూషించడంతో పాటు తీవ్రంగా హింసించాడు. ఆమె సంస్థలోనే ఉన్నత స్థానంలో ఉన్న వ్యక్తితో వివాహేతర సంబంధం అంటగట్టాడు. తాను చెప్పినట్లు చేయకపోతే పరువు తీస్తానని, హైదరాబాదులో తలెత్తుకుని బతకలేని స్థితి తీసుకువస్తానని బెదిరించాడు. అలా బయటకు వెళ్లిన రవి తిరిగి ఇంటికి రాలేదు.
సీసీఎస్‌లో కేసు పెట్టి..
దీంతో రీనా స్వయంగా అతడి ఇంటితోపాటు చైతన్యపురిలోని అతడి రెస్టారెంట్ కి వెళ్ళింది. రీనాను రవికుమార్ ఇరుగు వారికి, రెస్టారెంట్ ఉద్యోగులకు సైతం అప్పటి వరకు పరిచయం చేమలేదు. ఇంటికి రావడం పూర్తిగా మానేసిన రవి యోగా ట్రైనర్ గా చెబుతున్నా షాగుఫ్తాతో కలిసి ఉంటున్నట్లు రీనా తెలుసుకుంది. ఆ తరువాత ఈ ఏడాది మార్చిలో రీనాతో పాటు, ఆమె కుటుంబీకులు, మరికొందరి మీద సీసీఎస్ లో తప్పుడు ఫిర్యాదు చేశాడు.
మహిళా ఠాణాలో ఆరుగురిపై కేసు…
అప్పటి వరకు తనతో పాటు కుటుంబం పరువు కోసం అంటూ బాధను భరించిన రీనా ఈ కేసుకు సంబంధించిన నోటీసులు అందడంతో నోరు విప్పారు. సిసిఎస్ పోలీసులు ఎదుట అసలు విషయం చెప్పడంతో పాటు ఆధారాలు అందించారు. దీంతో రవి ఫిర్యాదు నిజం కాదని తేల్చిన అధికారులు ఆ కేసు మూసేశారు. ఇతగాడి వ్యవహారం శృతిమించడంతో రీనా కూడా ఉమెన్ పోలీస్ స్టేషన్ ను ఆశ్రయించింది. రవికుమార్ తో పాటు అతని కుటుంబీకులు తగరం అబ్రహం, తగరం మేరీ రాణి, karuna kumari, షాగుఫ్తాలపై ఫిర్యాదు చేశారు.
ఈమె కు జరిగిన అన్యాయాన్ని గుర్తించిన పోలీసులు వీరిపై ఐపీసీ తోపాటు వరకట్న నిషేధ చట్టం కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. ఈ ఏడాది ఫిబ్రవరిలో రీనాని వివాహం చేసుకున్న రవికుమార్ మరో పెళ్ళికి సిద్ధమయ్యాడు. దీనికోసం జూన్ 10న ఇండియన్ క్రిస్టియన్ మాట్రిమోనీ సైట్ లో మరో ప్రొఫైల్ క్రియేట్ చేశాడు. దీన్ని అతడి తల్లిదండ్రులు తెరిచినట్లు అందులో పొందుపరిచాడు. ఈ విషయాన్ని పోలీసులు పరిగణలోకి తీసుకుని దర్యాప్తు చేస్తున్నారు.