మహేశ్వరంలో పోటీ విషయమై కాంగ్రెస్ పార్టీలో గందరగోళం నెలకొంది. పార్టీ అధిష్టానం టికెట్ కేఎల్ఆర్‌కు కేటాయించగా.. అదే పార్టీ నేత పారిజాత నామినేషన్ దాఖలు చేశారు.
హైదరాబాద్: మహేశ్వరం నియోజకవర్గంలో కాంగ్రెస్ క్యాడర్‌లో అయోమయం నెలకొంది. ఎవరు తమ ఎమ్మెల్యే అభ్యర్థి అనే విషయంపై అనిశ్చిత ఉన్నది. మహేశ్వరం నియోజకవర్గంలో గత ఎన్నికల్లో కాంగ్రెస్ టికెట్ పై గెలుపొందిన సబితా ఇంద్రారెడ్డి ప్రస్తుతం బీఆర్ఎస్ నుంచి పోటీ చేస్తున్నారు. మొదటి నుంచీ మహేశ్వరంలో కాంగ్రెస్ టికెట్ తనకేనని ప్రచారం చేసుకున్న బడంగ్‌పేట మేయర్ చిగురింత పారిజాత నర్సింహారెడ్డికి రిక్తహస్తం ఎదురైంది. కాంగ్రెస్ హైకమాండ్ అనూహ్యంగా కిచ్చన్నగారి లక్ష్మారెడ్డి(కేఎల్‌ఆర్)కి మహేశ్వరం టికెట్ కన్ఫామ్ చేసింది.
కేఎల్‌ఆర్‌కు టికెట్ ప్రకటించడంపై అసమ్మతి సెగలు వచ్చాయి. అయినప్పటికీ పారిజాత నర్సింహారెడ్డి మాత్రం తన ఆశలను వదులుకోలేదు. కేవలం టికెట్ ప్రకటించారని, బీ ఫామ్ తనకే వస్తుందనే ధీమాతో ఢిల్లీలోనూ ఆమె ప్రయత్నాలు చేశారు. దీంతో క్యాడర్‌లో కన్ఫ్యూజన్ నెలకొంది.
Also Read: చోరీ కేసులో నిందితుడి అరెస్టు కోసం వెళ్లిన పోలీసులు.. దాడి చేసిన గ్రామస్తులు.. ఎక్కడంటే?
ఇంతలో శనివారం ఆమె ఓ కార్పొరేటర్ సహాయంతో పారిజాత నామినేషన్ కూడా దాఖలు చేశారు. దీంతో కాంగ్రెస్ టికెట్ ప్రకటించిన క్యాండిడేట్‌గా కేఎల్ఆర్ ఉండగా.. నామినేషన్ వేసింది మాత్రం మరో కాంగ్రెస్ నేత అయింది. దీంతో పార్టీలో గందరగోళం నెలకొంది. పార్టీ అధిష్టానానికీ ఇలా రెబల్ తలనొప్పి ఎదురవుతున్నది.
కాగా, తాను వేరే సీటు ఆశించానని, కానీ, అధిష్టానం సూచన మేరకు మహేశ్వరం టికెట్ స్వీకరించినట్టు కేఎల్ఆర్ చెప్పారు. తనకు మహేశ్వరంలో కాంగ్రెస్ గెలవడమే ప్రధానమని టికెట్ గొడవను పేర్కొంటూ కామెంట్ చేశారు.