కేసీఆర్ ప్రగతి రథం బస్సును తనిఖీ చేసిన ఎన్నికల అధికారులు..

By Sumanth Kanukula  |  First Published Nov 5, 2023, 5:11 PM IST

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలకు సమయం దగ్గర పడుతున్న వేళ పోలీసులు, అధికారులు తనిఖీలను ముమ్మరం చేశారు.


తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలకు సమయం దగ్గర పడుతున్న వేళ పోలీసులు, అధికారులు తనిఖీలను ముమ్మరం చేశారు. తాజాగా సీఎం కేసీఆర్ ప్రయాణించే ప్రగతి రథం బస్సును ఎన్నికల అధికారులు తనిఖీ చేశారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా కొత్తగూడెం చేరుకున్న  సీఎం కేసీఆర్ ప్రయాణించే ప్రగతిపథం వాహనాన్ని విధి నిర్వహణలో భాగంగా ఎన్నికల అధికారులు తనిఖీ చేసారు. అయితే ఎన్నికల ప్రవర్తన నియామవళికి అనుగుణంగా సీఎం కేసీఆర్ సిబ్బంది కూడా అధికారులకు సహకరించారు. 

ఇదిలా ఉంటే, సీఎం కేసీఆర్‌ కాన్వాయ్‌ను నిజామాబాద్‌ జిల్లా కేంద్రంలో పోలీసులు గురువారం తనిఖీ చేశారు. ఆదిలాబాద్‌ జిల్లా భైంసాలో నిర్వహించిన ప్రజా ఆశీర్వాద సభలో సీఎం కేసీఆర్‌ పాల్గొనేందుకు హెలికాప్టర్‌లో వెళ్లగా.. ఆయన కాన్వాయ్‌ రోడ్డుమార్గంలో వెళ్లింది. తిరుగు ప్రయాణంలో కాన్వాయ్‌లోని వాహనాలు నిజామాబాద్‌ మీదుగా హైదరాబాద్‌కు వస్తుండగా..నిజమాబాద్ నగరంలో పికెట్ పాయింట్ వద్ద కేసీఆర్ కాన్వాయ్‌లో తనిఖీలు నిర్వహించారు. 

Latest Videos

ఇక, ఆదివారం కొత్తగూడెంలో జరిగిన బీఆర్ఎస్ ప్రజా ఆశీర్వాద సభలో కేసీఆర్ ప్రసంగిస్తూ.. ఎన్నికలు రాగానే ప్రజలు ఆగమాగం కావొద్దని.. ఎవరో చెప్పారని తమాషాగా ఓటు వేస్తే నష్టం తప్పదని అన్నారు. అభ్యర్ధుల వెనుక పార్టీ ఉంటుందని.. ఆ పార్టీ చరిత్ర ఏంటో చూడాలని కేసీఆర్ ప్రజలను కోరారు. సింగరేణి పరిధిలో 22 వేల మందికి ఇళ్ల పట్టాలిచ్చామని తెలిపారు. ఎవరో చెప్పారని ఆలోచించకుండా ఓటేస్తే అభివృద్ధి దెబ్బతింటుందుని కేసీఆర్ అన్నారు. 

సింగరేణి చరిత్రను యువత తెలుసుకోవాలని.. తమ ఆకాంక్షలు నెరవేర్చే వ్యక్తినే ప్రజలు గెలిపించుకోవాలని కేసీఆర్ కోరారు. సింగరేణి తెలంగాణ ప్రజల ఆస్తి, తెలంగాణ సొత్తు అని కేసీఆర్ స్పష్టం చేశారు. అభ్యర్ధుల సీనియార్టీ, గుణం , వ్యక్తిత్వం చూడాలన్నారు. కాంగ్రెస్ హయాంలో సింగరేణిపై అప్పు తెచ్చి తీర్చలేదని.. గతంలో కార్మికులకు రూ.60 కోట్ల నుంచి రూ.70 కోట్లు బోనస్‌గా ఉండేదని కేసీఆర్ పేర్కొన్నారు. కొత్తగూడెంలో ఆసుపత్రి, మెడికల్ కాలేజ్ ఏర్పాటు చేశామని, ఈసారి సింగరేణి కార్మికులకు రూ.700 కోట్లు బోనస్‌గా ఇచ్చామని సీఎం తెలిపారు. 

కాంగ్రెస్ హయాంలో తెచ్చిన అప్పు తీర్చని కారణంగా సింగరేణిలో 49 శాతం వాటా కేంద్రం సొంతం అయ్యిందని కేసీఆర్ అన్నారు. ఎన్నికల సమయంలో పార్టీలు పూర్తి స్థాయిలో మోసం చేస్తుంటాయని.. ప్రజాస్వామ్యంలో పరిణితి రావాలని కేసీఆర్ అన్నారు. ప్రజలు గెలిచే రోజు వచ్చినప్పుడే ప్రజల కష్టాలు తీరుతాయన్నారు. 

click me!