
హైదరాబాద్: నల్గొండ జిల్లాకు ఓ రాజకీయ నాయకుడి కోడలి మృతి కేసులో మరో కీలక ట్విస్టు చోటుచేసుకుంది. అయితే మృతురాలి తండ్రి.. ఈ కేసులో రాజకీయ కుట్ర ఉందనే అనుమానం వ్యక్తం చేస్తున్నారు. తన అల్లుడిపై రాజకీయ కుట్ర జరిగిందనే అనుమానం ఉందని ఆయన వెల్లడించారు. వివరాలు.. నల్గొండ జిల్లా నిడమానూను మండలం తుమ్మడము గ్రామానికి చెందిన కాంగ్రెస్ నేత, యడవెల్లి రంగశాయి రెడ్డి తనయుడు వల్లభ్ రెడ్డికి హైకోర్టు ఉద్యోగి కోతి జైపాల్‌రెడ్డి కుమార్తె అయున లహరితో ఏడాది క్రితం వివాహం జరిగింది.
వల్లభ్ రెడ్డి, లహరి ప్రస్తుతం హైదరాబాద్‌లో నివాసం ఉంటున్నారు. అయితే రెండు వారాల క్రితం లహరికి గుండెపోటు వచ్చిందని వల్లభ్ ఆస్పత్రికి తీసుకెళ్లారు. అయితే లహరి ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతిచెందిందని ఆమె తండ్రి జైపాల్ రెడ్డికి వల్లభ్ సమాచారం అందించారు. దీంతో జైపాల్ రెడ్డి దంపతులు వెంటనే ఆస్పత్రికి వెళ్లారు. అయితే తొలుత సహజ మరణంగానే భావించినప్పటికీ.. ఈ ఘటనలో అనుమానాలు తలెత్తాయి. పోలీసులు 174 సీఆర్‌పీసీ కింద కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు.
లహరి తలకు బలమైన గాయం కావడం వల్లే చనిపోయందని పోస్టుమార్టమ్ నివేదికలో వెల్లడైంది. శరీరంలో శరీరంలో అంతర్గత గాయాలు అయినట్టుగా కూడా పోస్టుమార్టమ్ నివేదికలో తేలింది. మరోవైపు వల్లభ్ రెడ్డి తీరును అనుమానించిన పోలీసులు.. అతడిని రెండు రోజుల క్రితం నల్గొండ జిల్లా నుంచి నారాయణగూడ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అతడిపై 201, 302 సెక్షన్ల కింద కేసు నమోదు చేసి రిమాండ్‌కు తరలించారు. వల్లభ్ తనకున్న రాజకీయ పలుకుబడితో సహజ మరణంగా నమ్మించే ప్రయత్నం చేసినట్టుగా తెలుస్తోంది.
అయితే ఈ పరిణామాలపై స్పందించిన లహరి తండ్రి జైపాల్ రెడ్డి మీడియాతో మాట్లాడుతూ.. కిందపడి తన కూతురుకు గాయాలు అయినట్టుగా ఫోన్ రావడంతో తాను ఆస్పత్రికి వెళ్లడం జరిగిందని తెలిపారు. తాను వెళ్లేసరికి వైద్యులు ఆమెకు చికిత్స అందించే ప్రయత్నం చేశారని.. కొంతసేపటికి చనిపోయినట్టుగా ధ్రువీకరించారని చెప్పారు. తన అల్లుడి కుటుంబం చాలా మంచిదని.. రెండు కుటుంబాలు బాగానే ఉంటాయని తెలిపారు. దంపతులిద్దరూ కూడా చాలా బాగా ఉండేవారని.. వారి మధ్య ఎలాంటి గొడవలు లేవని చెప్పారు.
ఇంకా పోస్టుమార్టమ్ రిపోర్టు తనకు అందలేదని చెప్పారు. ప్రస్తుతం చంచల్‌గూడ జైలులో ఉణ్న తన అల్లుడిని కలిసి మాట్లాడినట్టుగా చెప్పారు. పోలీసులు చట్టప్రకారం చర్యలు తీసుకుంటున్నారని అన్నారు. అయితే మొత్తంగా తన కూతురు మృతిపై జైపాల్ రెడ్డి ఎలాంటి అనుమానం వ్యక్తం చేయడం లేదు.