
Telangana Congress vs BRS: రానున్న అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో తెలంగాణ రాజకీయాలు రసవత్తరంగా మారుతున్నాయి. గెలుపు కోసం అన్ని ప్రధాన రాజకీయ పార్టీలు తమ ముందున్న అన్న వనరులను ఉపయోగించుకుంటున్నాయి. ఉమ్మడి రంగారెడ్డి జిల్లాలో ప్రస్తుత అధికార పార్టీ తిరుగులేని అధిపత్యంలో ఉంది. అయితే, రానున్న ఎన్నికలను దృష్టిలో ఉంచుకుని కాంగ్రెస్ దూకుడు పెంచింది. కారు దిగే నాయకులను తమవైపునకు తిప్పుకోవడానికి వ్యూహాలు రచిస్తోంది. అధికార పార్టీ అసంతృప్త నేతలో ఉమ్మడి రంగారెడ్డి జిల్లాలో పాగా వేయాలని రేవంత్ టీమ్ ప్లాన్ చేసుకుంటోంది.
విభజన అనంతరం ఉమ్మడి రంగా రెడ్డి జిల్లా మూడు జిల్లాలుగా మారింది. ఈ ప్రాంతంలో అధికార పార్టీ బీఆర్ఎస్ బలమైన శక్తిగా ఎదిగింది. మూడు జిల్లాల పరిషత్ లు సైతం తమ కైవసం చేసుకుంది. అయితే, కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు బీఆర్ఎస్ కంచుకోటను స్వాధీనం చేసుకోవాని వ్యూహాలు రచిస్తోంది. ఇప్పటికే అసెంబ్లీ ఎన్నికల టిక్కెట్లకు సంబంధించి అధికార పార్టీ నుంచి హామీ రాని నేతలు కారు దిగేందుకు సిద్దమవుతున్నారని రాజకీయ వర్గాల్లో చర్చ సాగుతోంది. ఇదే సమయంలో దూకుడు పెంచిన కాంగ్రెస్.. ఉమ్మడి రంగారెడ్డి జిల్లాలోని అధికార పార్టీకి చెందిన అసంతృప్త నేతలను తమ వైపునకు తిప్పుకోవడానికి ప్లాన్ చేసుకుంటోంది. అధికార పార్టీని వీడే నేతలను తమ పార్టీలోకి వచ్చేలా చేస్తే హైదరాబాద్ నగరం చుట్టూ ఉన్న ఉమ్మడి రంగారెడ్డి ప్రాంతంలో పట్టు సాధించవచ్చని రేవంత్ రెడ్డి టీమ్ భావిస్తోంది.
ముగ్గురు జడ్పీ ఛైర్ పర్సన్లు అధికార పార్టీలోనే ఉన్నప్పటికీ నాయకత్వం మీద అసంతృప్తితో రగిలిపోతున్నారనీ, టికెట్లు దక్కని పక్షంలో కారు దిగేందుకు సిద్ధమవుతున్నారనే టాక్ వినిపిస్తోంది. వారిలో తీగల కృష్ణారెడ్డికి మహేశ్వరం టికెట్ దక్కని పక్షంలో కాంగ్రెస్ గూటికి వెళ్లడానికి సన్నాహాలు చేసుకుంటున్నారని సమాచారం. దీంతో వారి కుంటుంబానికి చెందిన రంగారెడ్డి జిల్లా పరిషత్ ఛైర్ పర్సన్ గా తీగల అనితారెడ్డి కూడా అదే బాటలో ముంందుకు సాగనున్నారని టాక్ వినిపిస్తోంది. అలాగే, వికారాబాద్ జడ్‌పీ ఛైర్ పర్సన్‌గా ఉన్న పట్నం సునీతారెడ్డి.. తన భర్త పట్నం మహేందర్ రెడ్డికి తాండూరు టికెట్ ఇవ్వకపోతే కాంగ్రెస్ లోకి వెళ్లడానికి సిద్దమవుతున్నారని సమాచారం. వీరితో పాటు మేడ్చల్ జడ్పీ ఛైర్మన్‌గా ఉన్న శరత్ చంద్రారెడ్డి.. తన తండ్రి సుధీర్ రెడ్డికి టికెట్ కన్ఫర్మ్ కాకపోతే.. కారు గుడ్ బై చెప్పడానికి సిద్ధమవుతున్నారని జోరుగా ప్రచారం సాగుతోంది.
ఇదే సమయంలో కాంగ్రెస్ పార్టీ ఆయా నాయకులను తమ పార్టీలోకి తీసుకువచ్చేందుకు ప్లాన్ చేసుకుంటోందని రాజకీయ వర్గాలు పేర్కొంటున్నాయి. ఇదే జరిగితే అధికార పార్టీకి తీవ్ర నష్టం జరగడం ఖాయం. ఇదే విషయంపై అప్రమత్తమైన అధికార పార్టీ ఆయా నాయకులు పార్టీ మారకుండా చర్యలు తీసుకుంటోంది. వారి పదవీ కాలపరిమితిలో పూర్తికావస్తున్నందున గీత దాటితే అవిశ్వాస తీర్మానంతో వేటు వేయడానికి పార్టీ సిద్ధమవుతోందని టాక్. ఉమ్మడి రంగారెడ్డి జిల్లాలో వీరు మాత్రమే కాకుండా మరింత మంది కాంగ్రెస్ కు టచ్ లో ఉన్నారని ఆ పార్టీ వర్గాలు సైతం పేర్కొంటున్నాయి. పలువురు బీజేపీ నేతలు సైతం రేవంత్ కు టచ్ లో ఉన్నారనీ, త్వరలోనే వారు కాంగ్రెస్ లోకి వస్తారని కూడా జోరుగా ప్రచారం సాగుతోంది. అయితే, ఉమ్మడి రంగారెడ్డి జిల్లాలో కాంగ్రెస్ ఆపరేషన్ ఆకర్ష్ ఎలాంటి మలుపు తిరుగుతుందో చూడాలి.. !