కేటీఆర్ కు అసలు సవాల్ హరీష్ రావే...

By Nagaraju TFirst Published Dec 14, 2018, 11:31 AM IST
Highlights

ఏదైనా పార్టీ పరంగా కానీ వ్యవస్థ పరంగా కానీ బాధ్యతలు అప్పగించినప్పుపడు వాటిని సమర్థవంతంగా నిర్వహించాలంటే ఎన్నో సవాళ్లు, ప్రతిసవాళ్లు ఎదురవుతుంటాయి. వాటినన్నింటిని అధిగమించాలంటే చాలా నేర్పరితనం ఉండాలి. 

హైదరాబాద్: ఏదైనా పార్టీ పరంగా కానీ వ్యవస్థ పరంగా కానీ బాధ్యతలు అప్పగించినప్పుపడు వాటిని సమర్థవంతంగా నిర్వహించాలంటే ఎన్నో సవాళ్లు, ప్రతిసవాళ్లు ఎదురవుతుంటాయి. వాటినన్నింటిని అధిగమించాలంటే చాలా నేర్పరితనం ఉండాలి. 

అలాగే ఇతరుల నుంచి వచ్చే సవాళ్లను సునాయాసంగా అధిగమించవచ్చు. కానీ సొంత సంస్థలో కానీ వ్యవస్థలో కానీ ఏర్పడే అసంతృప్తి, పరోక్షంగా ఎదురయ్యే సవాళ్లను అధిగమించడం మాత్రం కత్తిమీద సామే అని చెప్పుకోవాలి.అందుకే అంటారు ఇంటి దొంగను ఈశ్వరుడు కూడా పట్టుకోలేడని.

ఇది రాజకీయాలకు కూడా అతీతం ఏమీ కాదు. ఒక పార్టీ బాధ్యతలు తీసుకున్న తర్వాత ఇతర పార్టీలను ఎంతలా ఇరుకున పెట్టేందుకు ప్రయత్నిస్తామో అంతే స్థాయిలో తనను ఎన్నుకున్న పార్టీలోని అసంతృప్తి జ్వాల, ఆధిపత్య పోరులాంటి వాటిని అధిగమిస్తూనే ఉండాలి. ఇంకా చెప్పాలంటే సొంతపార్టీలో ఎలాంటి కుంపటి లేకుండా అనుక్షణం గమనిస్తూ ఉండాలి. 

అయితే ఇవే సవాళ్లు ఇప్పుడు టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కు ఉన్నాయి. టీఆర్ఎస్ పార్టీలో కీలక నేతలు ఎవరంటే అధినేత కేసీఆర్ అయితే మిగిలిన వాళ్లు హరీష్ రావు, కేటీఆర్, కవిత అని చెప్పుకోవాలి. 
   
తెలంగాణ ఉద్యమానికి రాజకీయ వేదికను ఏర్పాటు చేయాలనే లక్ష్యంతో కేసీఆర్ తెలంగాణ రాష్ట్రసమితి పార్టీని స్థాపించారు. టిఆర్ఎస్ పార్టీ తెలంగాణ ఉద్యమాన్ని గమ్యానికి చేర్చి, ప్రత్యేక రాష్ట్రం సాధించింది. తెలంగాణ రాష్ట్రంలో రెండోసారి ప్రభుత్వం ఏర్పాటు చేసి టిఆర్ఎస్ పార్టీ ఇకపై బంగారు తెలంగాణ నిర్మాణం దిశగా బలమైన అడుగులు వేస్తోంది. 

అందులో భాగంగా తెలంగాణ సీఎం గులాబీ దళపతి కేసీఆర్ అనేక మార్పులకు శ్రీకారం చుట్టారు. తెలంగాణ రాష్ట్ర ఉద్యమంతో దేశదృష్టిని ఆకర్షించిన కేసీఆర్ తన రాజకీయ పార్టీ  భారతదేశంలోనే అతి గొప్ప పార్టీగా రూపుదిద్దాలనే సంకల్పంతో కీలక నిర్ణయాలు తీసుకుంటున్నారు. 

దేశ రావజకీయాల్లో గుణాత్మక మార్పు తీసుకురావడానికి సీఎం కేసీఆర్ జాతీయ రాజకీయాలపై దృష్టి పెట్టిన నేపథ్యంలో రాష్ట్ర బాధ్యతలను తనయుడు కేటీఆర్ కు అప్పగించారు. టీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ గా ఎంపిక చేశారు. 
 
ఇప్పటికే టీఆర్ఎస్ పార్టీలోనూ, ప్రభుత్వంలోనూ కేటీఆర్ కీలక పాత్ర పోషిస్తున్నారు. తండ్రికి తగ్గ తనయుడుగా పాలనలో గట్టి పట్టు సాధించారు. అంతేకాదు తన మంత్రిత్వ శాఖలను సమర్థవంతంగా నిర్వహించగలిగిన వ్యక్తిగా కూడా కేటీఆర్ గుర్తింపు పొందారు.  

అమెరికా అధ్యక్షుడు ట్రంప్ తనయ ఇవాంకా ట్రంప్ ను తెలంగాణ రప్పించి ఒక సమ్మిట్ ను నిర్వహించిన కేటీఆర్ ప్రపంచ వ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకున్నారు. ఎందరో ప్రశంసలు అందుకున్నారు. ఇవన్నీ కేటీఆర్ ను టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ గా ఎంపికచెయ్యడానికి దోహదపడ్డాయి అని చెప్పుకోవచ్చు. 

అయితే అన్ని అంశాల్లోనూ పట్టుసాధించిన కేటీఆర్ వర్కింగ్ ప్రెసిడెంట్ గా ఎలా నడుస్తారా అన్నది ప్రశ్నార్థకంగా మారింది. టీఆర్ఎస్ పార్టీలో ఒక శక్తి కేసీఆర్ అయితే మరో శక్తి హరీష్ రావు అని చెప్పుకోవాలి. అది వాస్తవం కూడా. అయితే వర్కింగ్ ప్రెసిడెంట్ గా ఎన్నికైన కేటీఆర్ తన బావ మంత్రి హరీష్ రావుతో ఎలా నడుచుకుంటారా అన్నది మిలియన్ డాలర్ల ప్రశ్న.

అంతేకాదు హరీశ్ రావు వర్కింగ్ ప్రెసిడెంట్ అయిన కేటీఆర్ కు ఏమాత్రం సహకరిస్తారా అన్న చర్చ జోరుగా సాగుతోంది. రాజకీయాల్లో ప్రత్యేక శైలితో ముందుకు వెళ్తుంటారు హరీష్ రావు. ఇప్పటికే ఆరుసార్లు అసెంబ్లీకి ఎన్నికైన వ్యక్తిగా, అత్యధిక మెజారిటీతో గెలుపొందిన ఎమ్మెల్యేగా, ఐదుసార్లు ప్రత్యర్థులకు డిపాజిట్లు దక్కనివ్వకుండా చేసిన ఘనత కూడా హరీష్ దే అని చెప్పుకోవాలి. 

ఇంకా చెప్పాలంటే హరీష్ వ్యూహాలు పన్నడంలో నేర్పరి. అందుకే కేసీఆర్ ప్రాతినిథ్యం వహించే గజ్వేల్ నియోజకవర్గం బాధ్యతలను హరీష్ రావుకు అప్పగించారు. గజ్వేల్ బాధ్యతలు తీసుకున్న హరీష్ రావు ఈసారి ఎన్నికల్లో మామ కేసీఆర్ కు భారీ మెజారిటీని సాధించారు. 

ప్రత్యర్ధి కాంగ్రెస్ నేత వంటేరు ప్రతాప్ రెడ్డి ఎన్ని ఆరోపణలు చేసినా కుటుంబంలో చీలికలు తెచ్చే వ్యాఖ్యలు చేసిన అటు కేసీఆర్ కానీ ఇటు హరీష్ రావు కానీ స్పందించలేదు. ఇదంతా ట్రాష్ అంటూ కొట్టిపారేశారు. ఏది ఏమైనా మేనమామ గెలుపుకోసం అహర్నిశలు శ్రమించి కేసీఆర్ ఊహించని స్థాయి మెజారిటీ సాధించడంలో సక్సెస్ అయ్యారు. 

మరోవైపు తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో హరీష్ రావు కీలకపాత్ర పోషించారు. రాజకీయ ఉద్దండులను ఓడించడంలో హరీష్ రావు పన్నిన పద్మవ్యూహం రాష్ట్రమంతా చర్చించుకుంటుంది. హరీష్ పద్మవ్యూహం నుంచి బయటపడటం అంతా ఆషామాషీకాదని ప్రచారం.  

ఈ ఎన్నికల్లో కొడంగల్ కొదమ సింహం అంటూ చెప్పుకున్న కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డిని ఓడించడంలో హరీష్ రావు పాత్ర అద్భుతమని ప్రతీ ఒక్కరూ కొనియాడుతున్నారు. అలాగే 26 మంది అభ్యర్థులను గెలిపించాల్సి ఉండగా ఒకటి రెండు మినహా అన్ని స్థానాలను ఒంటి చేత్తో గెలిపించిన సత్తా హరీష్ రావుదేనంటూ పార్టీ నేతలు చెప్పుకొస్తున్నారు. 

రాష్ట్ర రాజకీయాల్లో తనకంటూ ఓ గుర్తింపు, ప్రత్యేకతను సంపాదించుకున్న హరీష్ రావు వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కు ఎలా సహకరిస్తారన్నది ఆసక్తికర చర్చ జరుగుతోంది. హరీష్ రావు బావమరిది కేటీఆర్ కు సహకరిస్తారా లేదా అన్నది సర్వత్రా ఆసక్తి రేపుతోంది.

తెలంగాణ ముందస్తు ఎన్నికలకు వెళ్లినప్పుడే ప్రతిపక్ష పార్టీలు కేటీఆర్ ను ముఖ్యమంత్రిని చేసేందుకే కేసీఆర్ ముందస్తుకు వెళ్లారని ఆరోపించింది. ప్రతిపక్షాల ఆరోపణలకు తగ్గట్లుగానే కేసీఆర్ అడుగులు కూడా వేస్తున్నాయి. పార్టీని కష్టకాలంలో ముందకు నడిపించి ట్రబుల్ షూటర్ గా పేర్గాంచిన హరీష్ ఎలా నడిపిస్తారా అన్నది భవిష్యత్ కాలమే నిర్ణయించాలి.   
 

ఈ వార్తలు కూడా చదవండి

పారిన కేసీఆర్ పాచిక: భారీ మెజారిటీతో హరీష్ రావుకు షాక్

కొడుకును సీఎం చేసే దిశగా: టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్‌గా కేటీఆర్

వర్కింగ్ ప్రెసిడెంట్‌గా కేటీఆర్.. హరీశ్ పరిస్థితేంటీ..

 

click me!