పారిన కేసీఆర్ పాచిక: భారీ మెజారిటీతో హరీష్ రావుకు షాక్

By pratap reddyFirst Published Dec 14, 2018, 10:48 AM IST
Highlights

పక్కా వ్యూహరచనతో కేసిఆర్ కేటీఆర్ ను పార్టీలోనూ ప్రభుత్వంలోనూ చాలా కాలం నుంచే ముందుకు నెడుతూ వచ్చారు. ఎన్నికలకు ముందే హరీష్ రావును పక్కకు తొలగించే ప్రయత్నం చేసినప్పటికీ అది బెడిసి కొట్టే ప్రమాదం ఉందని గ్రహించి మేల్కొన్నారు.

హైదరాబాద్: తన తనయుడు కెటి రామారావుకు పార్టీలోనూ ప్రభుత్వంలోనూ ప్రమోషన్ ఇవ్వడానికి ఇప్పటి వరకు ఉన్న అడ్డును తెలంగాణ ముఖ్యమంత్రి, తెలంగాణ రాష్ట్ర సమితి (టీఆర్ఎస్) అధినేత తొలిగించుకున్నారు. శాసనసభ ఎన్నికల్లో భారీ మెజారిటీ రావడంతో, ఇతర పార్టీల ఉనికి కూడా ప్రమాదంలో పడడంతో అందుకు మార్గం ఏర్పడింది. తాను ముఖ్యమంత్రిగా ప్రమాణం స్వీకారం చేసిన మర్నాడే ఆయన తనయుడు కేటీఆర్ ను పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ గా నియమించి హరీష్ రావుకు షాక్ ఇచ్చారు. 

పక్కా వ్యూహరచనతో కేసిఆర్ కేటీఆర్ ను పార్టీలోనూ ప్రభుత్వంలోనూ చాలా కాలం నుంచే ముందుకు నెడుతూ వచ్చారు. ఎన్నికలకు ముందే హరీష్ రావును పక్కకు తొలగించే ప్రయత్నం చేసినప్పటికీ అది బెడిసి కొట్టే ప్రమాదం ఉందని గ్రహించి మేల్కొన్నారు. కొన్నాళ్ల పాటు హరీష్ రావు వార్తలు టీఆర్ఎస్ అధికారిక పత్రిక నమస్తే తెలంగాణలో కనిపించకపోవడంతో దుమారం చెలరేగింది. 

హరీష్ రావును కేసిఆర్ పక్కకు పెట్టినట్లేనని భావించారు. అయితే, దానివల్ల ఎదురయ్యే ప్రమాదాన్ని గ్రహించి వ్యూహాత్మకంగా వ్యవహరించారు. హరీష్ రావుతో కలిసి కేటీఆర్ సమావేశం నిర్వహించి తమ మధ్య విభేదాలు లేవని ప్రకటించి తాత్కాలికంగా సయోధ్యను కుదుర్చుకున్నట్లు అర్థమవుతోంది. ఎన్నికల్లో అభ్యర్థుల ఎంపిక బాధ్యతను, రాష్ట్రవ్యాప్తంగా పార్టీని గెలిపించే బాధ్యతను కేసిఆర్ ముందుగానే కేటీఆర్ కు అప్పగించారు. 

అసమ్మతివాదులను బుజ్జగించడం, నియోజకవర్గాల్లో పరిస్థితిని సమీక్షించడం వంటి రాష్ట్రవ్యాప్త బాధ్యతలను కేటీఆర్ చూసుకున్నారు. హరీష్ రావుకు క్లిష్టమైన నియోజకవర్గాల బాధ్యతలను అప్పగించారు. హరీష్ రావు తన లక్ష్యాన్ని నెరవేర్చడానికి చెమటోడ్చి, కొడంగల్ వంటి సీట్లను టీఆర్ఎస్ ఖాతాలో జమ చేశారు. అది కూడా కేటీఆర్ కు అనుకూలంగా మారింది. 

శాసనసభ ఎన్నికల్లో లభించిన మెజారిటీ ద్వారా తన మాటకు ఎదురు లేకుండా కేసీఆర్ చేసుకోగలిగారు. ఆ మెజారిటీ వల్ల హరీష్ రావు కూడా నోరు మెదిపలేని పరిస్థితిని కల్పించారని అంటున్నారు. ఎన్నికలకు ముందు నుంచి హరీష్ రావుకు సన్నిహితులైనవారిని దూరం పెడుతూ, కేటీఆర్ కు అనుకూలమైన వారికి టికెట్లు ఇచ్చారు. ఆ రకంగా శాసనసభలో కేటీఆర్ బలాన్ని కేసిఆర్ పెంచగలిగారు. 

మొత్తం మీద, టీఆర్ఎస్ కు లభించిన భారీ మెజారిటీ హరీష్ రావుకు ఆటంకంగా మారిందని అంటున్నారు. కేటీఆర్ నాయకత్వంలో హరీష్ రావు పనిచేయాల్సిన పరిస్థితిని కేసిఆర్ కల్పించారు. 

సంబంధిత వార్తలు

కొడుకును సీఎం చేసే దిశగా: టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్‌గా కేటీఆర్

వర్కింగ్ ప్రెసిడెంట్‌గా కేటీఆర్.. హరీశ్ పరిస్థితేంటీ..

click me!
Last Updated Dec 14, 2018, 10:48 AM IST
click me!