
KIMS Hospital: రక్త సంబంధిత వ్యాధులు ముఖ్యంగా రక్త క్యాన్సర్, సికిల్ సెల్ అనీమియా, థాలసీమియా, అప్లాస్టిక్ అనీమియాలు ప్రాణాంతకంగా మారుతున్నాయి. వీటికి సమర్థవంతమైన చికిత్సల్లో బోన్ మ్యారో ట్రాన్స్‌ప్లాంట్ ప్రధానమైనది. అయితే సరైన డోనర్ కనుగొనడం క్రమంగా కష్టతరమవుతోంది. ఒకప్పుడు పెద్ద కుటుంబాలు ఎక్కువగా ఉండడం వల్ల మ్యాచ్ అయ్యే డోనర్లు దొరకేవారు. కానీ నేడు చిన్న కుటుంబాల పెరుగుదల వల్ల ఇది సవాలుగా మారింది.
అయినా వైద్యరంగంలో పురోగతితో కేవలం 50 శాతం మ్యాచ్ ఉన్నా ట్రాన్స్‌ప్లాంట్ విజయవంతమవుతోంది. కిమ్స్ ఆసుపత్రి ఇలాంటి ఆధునిక పద్ధతులతో విజయవంతంగా అనేక కేసులను పూర్తి చేసిందని KIMS హాస్పిటల్స్ హెమటో-ఆంకాలజీ, స్టెమ్ సెల్, బోన్ మ్యారో ట్రాన్స్‌ప్లాంట్ డిపార్ట్‌మెంట్ హెడ్ డాక్టర్ నరేంద్ర కుమార్ తోట వివరించారు.
కిమ్స్ ఆసుపత్రి బోన్ మ్యారో ట్రాన్స్‌ప్లాంట్ విభాగం 10 ఏళ్లు పూర్తి చేసుకుంది. ఈ సందర్భంగా 10వ వార్షికోత్సవ వేడుకల్లో హైదరాబాద్ కలెక్టర్ హరిచందన్ దాసరి, దాతృత్వవేత్తలు సుధా రెడ్డి, పింకీ రెడ్డి, కిమ్స్ గ్రూప్ చైర్మన్ డాక్టర్ భాస్కర్ రావు, సీఈఓ డాక్టర్ అభినయ్, మెడికల్ డైరెక్టర్ డాక్టర్ సంబిత్ సాహు తదితరులు పాల్గొన్నారు.
డాక్టర్ నరేంద్ర కుమార్ తోట మాట్లాడుతూ.. “కిమ్స్ ఆసుపత్రి బోన్ మ్యారో ట్రాన్స్‌ప్లాంట్ రంగంలో విశేష పురోగతి సాధించింది. హైదరాబాదులో ఇలాంటి చికిత్సలు మొదలుపెట్టిన తొలి ఆసుపత్రులలో మేము ఒకరం. ట్రాన్స్‌ప్లాంట్ పూర్తవడం మాత్రమే కాదు, తరువాతి రోజుల్లో రోగి కోలుకోవడం, ఇన్‌ఫెక్షన్ల నుండి రక్షించడం ముఖ్యమైన సవాలు. అయినప్పటికీ మా సక్సెస్ రేటు జాతీయ సగటు కంటే ఎక్కువ” అని తెలిపారు.
“గతంలో రక్త క్యాన్సర్ వంటి రోగాల కోసం రోగులు వెల్లూర్ సిఎంసి లేదా ముంబై టాటా మెమోరియల్ ఆసుపత్రులకు వెళ్లాల్సి వచ్చేది. ఇప్పుడు హైదరాబాద్‌లోనే ప్రపంచ స్థాయి చికిత్స అందుబాటులో ఉంది. గత దశాబ్దంలో 150 మందికి పైగా బోన్ మ్యారో ట్రాన్స్‌ప్లాంట్ విజయవంతంగా నిర్వహించాం” అని చెప్పారు.
“క్యాన్సర్ కేసుల్లో 50 శాతం మ్యాచ్ సరిపోతుంది. కానీ సికిల్ సెల్ అనీమియా, థాలసీమియా, అప్లాస్టిక్ అనీమియా కేసుల్లో క్లిష్టత ఎక్కువ. అయినప్పటికీ చిన్నపిల్లలకైనా విజయవంతంగా ట్రాన్స్‌ప్లాంట్ చేసిన సందర్భాలు ఉన్నాయి. ఇండియా మాత్రమే కాకుండా ఆఫ్రికా, గల్ఫ్ దేశాల రోగులను కూడా మేము చికిత్స చేసాం” అని ఆయన వివరించారు.
అలాగే, “ట్రాన్స్‌ప్లాంట్ పద్ధతులు అభివృద్ధి చెందిన దేశాల స్థాయిలో ఉన్నా, ఆపరేషన్ తరువాత వచ్చే ఇన్‌ఫెక్షన్లు ప్రధాన సమస్య. వాటిని అరికట్టడం కోలుకునే ప్రక్రియలో కీలకం” అని పేర్కొన్నారు. ఆయన ఈ వేడుకలో పాల్గొన్న గతంలోని రోగులు, డోనర్లకు కృతజ్ఞతలు తెలిపారు. “డోనర్లు, రిసిపియెంట్స్ ఒకే వేదికపై ఉండటం ఆనందంగా ఉంది. మరింత మంది బోన్ మారో డోనర్లు ముందుకు రావాలి. ఒకరి దానం మరొకరి ప్రాణాన్ని కాపాడుతుంది” అని డాక్టర్ నరేంద్ర కుమార్ తోట అన్నారు.