
Ganapati Laddu : హైదరాబాద్ లో వినాయక చవితి అనగానే ముందుగా గుర్తుకువచ్చేవి ఖైరతాబాద్, బాలాపూర్. వినాయక చవితి పండగపూట ఖైరతాబాద్ వినాయకుడి విగ్రహంపైన… నిమజ్జనం సమయంలో బాలాపూర్ లడ్డూ పైన అందరి దృష్టి ఉంటుంది. ప్రతిఏటా ఈ లడ్డూను వేలంపాటలో లక్షల డబ్బులిచ్చి కొంటారు. అయితే తాజాగా బాలాపూర్ లడ్డూ రికార్డును బద్దలుకొట్టేలా హైదరాబాద్ లో మరో గణపతి లడ్డూ వేలం జరిగింది. మైహోం భూజాలో ఏర్పాటుచేసిన గణనాథుడి చేతిలో పూజలందుకున్న లడ్డూను వేలం వేశారు. ఈ వేలంపాటు పోటాపోటీగా సాగింది. చివరకు కొండపల్లి గణేష్ రూ.51.77 లక్షలకు దీన్ని దక్కించుకున్నారు.
వినాయక చవితి సమయంలో బొజ్జ గణపయ్య చేతిలో ఉండి పూజలందుకునే లడ్డూను పరమపవిత్రంగా భావిస్తారు. అందుకే ఈ లడ్డూను దక్కించుకునేందుకు చాలామంది ప్రయత్నిస్తారు... లడ్డూ వేలంపాటలో ఎవరు ఎక్కువ డబ్బులు పాడితే వారికే ఈ ప్రసాదం దక్కుతుంది. దీన్ని కొందరు కుటుంబసభ్యులు, బంధువులు, స్నేహితులకు పంచుతారు.. ఇంకొందరు తమ పంటపొలాల్లో చల్లుతారు. ఈ లడ్డూను దక్కించుకుంటే గణనాథుడి ఆశీర్వాదం దక్కుతుందనేది నమ్మకం.
గతేడాది అంటే 2024 ఇదే మైహోం భూజాలో లడ్డూరూ.29.7 లక్షలు పలికింది. అయితే ఈ ఏడాది బాలాపూర్ లడ్డూ వేలంపాటలో రూ.30.01 లక్షలు పలికింది... కొలన్ శంకర్ రెడ్డి అనే వ్యక్తి కొనుగోలు చేశారు. మరీ ఈసారి మైహోం భూజాలో లడ్డూ ఏకంగా రూ.51 లక్షలకు పైగా పలికింది.. మరి బాలాపూర్ లడ్డూ ఎంత పలుకుతుందో చూడాలి.