
Kalvakuntla Kavitha : బిఆర్ఎస్ పార్టీలోంచి సస్పెండ్ చేసినతర్వాత మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ కూతురు, బిఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత మొదటిసారి రియాక్ట్ అయ్యారు. గతంలో చేసిన ఆరోపణలకు కట్టుబడిఉన్న ఆమె మరోసారి మాజీ మంత్రి హరీష్ రావు, ఎంపీ సంతోష్ రావుపై సీరియస్ కామెంట్స్ చేశారు. బిఆర్ఎస్ పార్టీ, కేసీఆర్ వల్ల దక్కిన పదవికి అడ్డు పెట్టుకుని భారీ అవినీతికి పాల్పడటమే కాదు తమ కుంటుంబాన్ని విచ్చిన్నం చేయాలని హరీష్ రావు ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు. తన సస్పెన్షన్ తో హరీష్ కుట్రలు ఆగవు.. మీ చుట్టూ ఏం జరుగుతుందో చూడండి నాన్న అని కేసీఆర్ ను కోరారు కవిత.
కేసీఆర్, కేటీఆర్ తో తనది రక్తసంబంధం... రాజకీయాల కోసం వారిని దూరం చేసుకోలేనని అన్నారు. కానీ కొందరు తమను విడదీసి రాజకీయ లబ్ది పొందాలను చూస్తున్నారని కవిత ఆందోళన వ్యక్తం చేశారు. ఇప్పుడు తనపై జరిగిన కుట్రలే రేపు మీపైనా జరగుతాయి... ఈ ప్రమాదాన్ని గుర్తించాలని తండ్రి, సోదరుడికి సూచించారు కవిత. బిఆర్ఎస్ ను హస్తగతం చేసుకునేందుకు హరీష్ రావు కుట్రలు చేస్తున్నారనేది కవిత ప్రధాన ఆరోపణ.
హరీష్, రేవంత్ ఒకే ప్లైట్ లో ప్రయాణించిన తర్వాతే తనపై కుట్రలు ప్రారంభమయ్యాయని కవిత ఆరోపించారు. హరీష్, సంతోష్ మేకవన్నె పులులు నాన్నా... వాళ్లను పార్టీలో ఉంచుకుంటే పరిస్థితి ఎలా ఉంటుందో అర్థం చేసుకొండని తండ్రికి సూచించారు. కలికాలం కాబట్టి వాళ్లది నడుస్తోంది... కర్మ సిద్దాంతాన్ని నమ్ముతున్నా... ఇంతకు ఇంత అనుభవిస్తారంటూ హరీష్ సంతోష్ రావులపై కవిత సంచలన వ్యాఖ్యలు చేశారు.