10 రోజులు టైమిస్తున్నా.. పద్ధతి మార్చుకోండి, 20 నుంచి ఆకస్మిక తనిఖీలు: కేసీఆర్ హెచ్చరికలు

By Siva KodatiFirst Published Jun 13, 2021, 7:11 PM IST
Highlights

ఈ నెల 20న సిద్ధిపేట, కామారెడ్డి జిల్లాల్లో ఆకస్మిక తనిఖీలు నిర్వహిస్తానని చెప్పారు తెలంగాణ సీఎం కేసీఆర్. ఆదివారం పల్లెప్రగతి, పట్టణ ప్రగతి పథకాలపై అడిషనల్ కలెక్టర్లు, ఇతర ఉన్నతాధికారులతో ఆయన సమీక్ష నిర్వహించారు

ఈ నెల 20న సిద్ధిపేట, కామారెడ్డి జిల్లాల్లో ఆకస్మిక తనిఖీలు నిర్వహిస్తానని చెప్పారు తెలంగాణ సీఎం కేసీఆర్. ఆదివారం పల్లెప్రగతి, పట్టణ ప్రగతి పథకాలపై అడిషనల్ కలెక్టర్లు, ఇతర ఉన్నతాధికారులతో ఆయన సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా కేసీఆర్ మాట్లాడుతూ.. జూన్ 21న వరంగల్ జిల్లాలో ఆకస్మిక తనిఖీలు నిర్వహిస్తానని చెప్పారు. పల్లెప్రగతి, పట్టణ ప్రగతి పనులపై తనిఖీలు నిర్వహిస్తానన్నారు.

అదనపు కలెక్టర్లు, డీపీవోలు కష్టపడుతున్నారని.. కానీ ఆశించినంత మేర పనులు జరగట్లేదని కేసీఆర్ అసహనం వ్యక్తం చేశారు. అధికారుల పనితీరుపై నివేదికలు తెప్పించుకుంటున్నా అని సీఎం తెలిపారు. పదే పదే పనితీరు మార్చుకోవాలని చెబుతున్నానని.. పది రోజుల సమయం ఇచ్చి ఆకస్మిక తనిఖీలకు వస్తానని కేసీఆర్ హెచ్చరించారు. చెప్పినా కూడా పనితీరు మెరుగుపడకుంటే క్షమించేది లేదని కేసీఆర్ స్పష్టం చేశారు.

Also Read:రెండేళ్లు టైమిచ్చా.. ఇక ఏ అధికారిని ఉపేక్షించను, త్వరలోనే తనిఖీలకు వస్తున్నా: కేసీఆర్

అలసత్వం, నిర్లక్ష్యం వుంటే ఎవరు చెప్పినా విననని ఆయన అన్నారు. గ్రామ సభలు నిర్వహించకుంటే సర్పంచ్‌లు, కార్యదర్శులను సస్పెండ్ చేయాలని కేసీఆర్ అన్నారు. ఏమైనా తప్పులుంటే 10 రోజుల్లోగా సరిదిద్దుకోవాలని ముఖ్యమంత్రి సూచించారు. స్థానిక సమస్యల పరిష్కారానికి ప్రతి అడిషనల్ కలెక్టర్‌కు రూ. 25 లక్షలు కేటాయిస్తున్నట్లు సీఎం తెలిపారు. వైద్య, ఆరోగ్య వ్యవస్థను బలోపేతం చేస్తామని.. ఆసుపత్రి భవనంపైనే హెలికాఫ్టర్ దిగేలా హెలిప్యాడ్‌లు ఏర్పాటు చేయాలని సీఎం అధికారులను ఆదేశించారు.

పల్లెప్రగతి వనాల కోసం ప్రభుత్వ భూమి లేకుంటే... ప్రైవేట్ భూములు తీసుకోవాలని కేసీఆర్ సూచించారు. పల్లెలు, పట్టణాలు వందశాతం అభివృద్ధి జరగాలని ముఖ్యమంత్రి సూచించారు. అభివృద్ధి కోసం అందరి భాగస్వామ్యం అవసరమని.. తాను కూడా ఒక జిల్లాను దత్తత తీసుకుంటానని కేసీఆర్ స్పష్టం చేశారు. వర్షాలు పడుతున్నాయని.. హారితహారం కార్యక్రమాన్ని చేపట్టాలని సీఎం వ్యాఖ్యానించారు. 

click me!