20 రోజుల్లో రెండో సారి హస్తినకు కేసీఆర్: ముందస్తుపై పుకార్ల జోరు

By narsimha lodeFirst Published Aug 24, 2018, 2:54 PM IST
Highlights

తెలంగాణలో టీఆర్ఎస్ నేతలు రెండు రోజులుగా వేస్తున్న అడుగులు రాజకీయ పార్టీల్లో వేడిని పుట్టించింది. టీఆర్ఎస్ శాసనసభపక్షంతో, పార్లమెంటరీ పక్ష నేతలతో  కేసీఆర్ శుక్రవారం నాడు సమావేశం కానున్నారు


హైదరాబాద్: తెలంగాణలో టీఆర్ఎస్ నేతలు రెండు రోజులుగా వేస్తున్న అడుగులు రాజకీయ పార్టీల్లో వేడిని పుట్టించింది. టీఆర్ఎస్ శాసనసభపక్షంతో, పార్లమెంటరీ పక్ష నేతలతో  కేసీఆర్ శుక్రవారం నాడు సమావేశం కానున్నారు. శుక్రవారం సాయంత్రం కేసీఆర్ న్యూఢిల్లీకి వెళ్లనున్నారు. సుమారు మూడు రోజుల పాటు కేసీఆర్ న్యూఢిల్లీలో గడపనున్నారు.  దీంతో రాజకీయవర్గాల్లో కేసీఆర్ వేస్తున్న అడుగుల వైపు ఆసక్తి నెలకొంది.

రెండు రోజుల క్రితం తెలంగాణ సీఎం కేసీఆర్ మంత్రులతో సుమారు ఐదు గంటలకు పైగా సమావేశమయ్యారు.ఈ సమావేశంలో  ముందస్తు ఎన్నికలకు సంబంధించిన ప్రధానంగా చర్చించినట్టు సమాచారం.  అయితే  ముందస్తు ఎన్నికలకు  వెళ్లొద్దని మంత్రులు కేసీఆర్ ను కోరారు. ఈ మేరకు కేసీఆర్ కూడ సానుకూలంగా స్పందిచినట్టు సమాచారం.

అయితే  గురువారం నాడు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన సలహాదారు రాజీవ్ శర్మ ఎన్నికల  కమిషనర్‌తో సమావేశమయ్యారు. ముందస్తు ఎన్నికల గురించి రాజీవ్ శర్మ ఆరా తీశారు. అయితే  సుదీర్ఘకాలం పాటు తాను  కేంద్ర సర్వీసుల్లో కొనసాగినందున  ఎన్నికల కమిషనర్‌తో సమావేశమైనట్టు  రాజీవ్ శర్మ మీడియాకు చెప్పారు.

ఇదిలా ఉంటే సెప్టెంబర్ రెండో తేదీన  టీఆర్ఎస్ భారీ బహిరంగ సభను రంగారెడ్డి జిల్లాలోని కొంగర కలాన్ లో నిర్వహించనుంది. ఈ సభకు సుమారు 25 లక్షల మందిని సమీకరించాలని ఆ పార్టీ భావిస్తోంది.

ఈ సభక స్థలం వద్ద మంత్రులు  గురువారం సాయంత్రం భూమి పూజ చేశారు. శుక్రవారం నాడు సీఎం కేసీఆర్ సభ స్థలాన్ని పరిశీలించారు.  సభ కోసం తీసుకోవాల్సిన చర్యలను మంత్రులు, పార్టీ నేతలకు సూచించారు.

మరోవైపు శుక్రవారం మధ్యాహ్నం తెలంగాణ సీఎం కేసీఆర్ టీఆర్ఎస్ పార్లమెంటరీ పార్టీతో, శాసనసభపక్షంతో ఉమ్మడిగా సమావేశం కానున్నారు. ఈ సమావేశంలో  కేసీఆర్  సెప్టెంబర్ రెండో తేదీన సభ ఏర్పాట్ల గురించి చర్చించనున్నారు. మరో వైపు ముందస్తు ఎన్నికలకు సంబంధించిన విషయమై పార్టీ నేతలతో చర్చించే అవకాశం కూడ లేకపోలేదు.

మరో వైపు  సెప్టెంబర్ రెండో తేదీన  ప్రగతి నివేదన సభలో టీఆర్ఎస్ సర్కార్  ఇప్పటివరకు అమలు చేసిన పథకాలను వివరించనున్నారు. అంతేకాదు అవసరమైతే ముందస్తు ఎన్నికలకు సంబంధించిన విషయమై కేసీఆర్ ఈ సభా వేదికపై నుండే కీలకమైన ప్రకటన చేసే అవకాశం కూడ లేకపోలేదని అంటున్నారు. 

ఇవాళ జరిగే టీఆర్ఎస్ శాసనసభ, పార్లమెంటరీ పార్టీ సమావేశాల సంయుక్త సమావేశంలోనే  పార్టీ ప్రజా ప్రతినిధులకు  కేసీఆర్  ముందస్తు ఎన్నికలకు సంబంధించిన విషయమై  ప్రకటన చేసే అవకాశం లేకపోలేదని పార్టీ నేతలు  చెబుతున్నారు.

ఇదిలా ఉంటే మూడు రోజుల పాటు కేసీఆర్ ఢిల్లీ పర్యటనకు సంబంధించి కూడ రాజకీయ వర్గాల్లో సర్వత్రా ఆసక్తి నెలకొంది. పెండింగ్ పనుల విషయమై  కేంద్ర మంత్రులతో కేసీఆర్ సమావేశం కానున్నారని టీఆర్ఎస్ వర్గాలు చెబుతున్నాయి. మొత్తంగా  రెండు, మూడు రోజులుగా టీఆర్ఎస్ చీఫ్ కేసీఆర్ వేస్తున్న అడుగులు రాజకీయ వర్గాల్లో ఆసక్తిని పెంచుతున్నాయి. 

ఈ వార్తలు చదవండి

సెప్టెంబర్ 2న ప్రగతి నివేదన సభ: కొంగరలో ఏర్పాట్లను పరిశీలించిన కేసీఆర్

కేసీఆర్ ముందస్తు ప్లాన్: కేంద్ర ఎన్నికల కమిషనర్‌తో రాజీవ్ శర్మ భేటీ


 

click me!