రాజశ్యామల యాగం: కేసీఆర్ దంపతులతో యాగ సంకల్పం చేయించిన స్వరూపానందేంద్ర

By narsimha lode  |  First Published Nov 1, 2023, 1:43 PM IST

రాజశ్యామల సహిత సుబ్రమణ్యేశ్వర యాగాన్ని కేసీఆర్ దంపతులు  ఇవాళ ప్రారంభించారు.  విశాఖ శారదా పీఠాధిపతి  కేసీఆర్ దంపతులతో యాగ సంకల్పం చేయించారు.


హైదరాబాద్: మూడు రోజులపాటు రాజశ్యామల సహిత సుబ్రమణ్యేశ్వర యాగాన్ని తెలంగాణ సీఎం కేసీఆర్ దంపతులు  నిర్వహించారు.  బుధవారంనాడు ఉదయం కేసీఆర్‌ దంపతులతో యాగ సంకల్పం చేయించారు స్వరూపానందేంద్ర సరస్వతి.

తెలుగు రాష్ట్రాల సర్వతోముఖాభివృద్ధిని కాంక్షిస్తూ తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌ ప్రత్యేక యాగాన్ని తలపెట్టారు. విశాఖ శ్రీ శారదా పీఠాధిపతులు స్వరూపానందేంద్ర, స్వాత్మానందేంద్ర స్వాముల ఆధ్వర్యంలో బుధవారం యాగానికి అంకురార్పణ జరిగింది. రాజశ్యామలా సహిత సుబ్రహ్మణ్యేశ్వర యాగంగా దీనికి నామకరణం చేశారు.ఎర్రవల్లిలోని కేసీఆర్‌ ఫామ్‌హౌస్‌ ఇందుకు వేదికగా నిలిచింది. 

Latest Videos

తెలుగు రాష్ట్రాలతో పాటు తమిళనాడు, కర్నాటక రాష్ట్రాల నుండి ప్రత్యేకంగా విచ్చేసిన పండితుల ఆధ్వర్యంలో మూడు రోజులపాటు ఈ యాగం జరుగుతుంది. గోపూజ అనంతరం కేసీఆర్‌ దంపతులు యాగశాల ప్రవేశం చేశారు. గణపతి పూజ, పుణ్యాహవచనం, పంచగవ్య ప్రాసనతో యాగానికి అంకురార్పణ జరిగింది. కేసీఆర్‌ దంపతులు పీఠాధిపతులు స్వరూపానందేంద్ర స్వామికి సాష్టాంగ నమస్కారం చేసి యాగంలో ఆసీనులయ్యారు. గురు ఆజ్ఞ తీసుకుని యాగాన్ని ప్రారంభించారు. 

కేసీఆర్‌ దంపతులతో స్వరూపానందేంద్ర స్వామి యాగ సంకల్పం చెప్పించారు. విశాఖ శ్రీ శారదాపీఠ అధిష్టాన దైవం రాజశ్యామల అమ్మవారికి స్వరూపానందేంద్ర స్వామి ప్రత్యేక పూజలు నిర్వహించారు. 

ఈ సందర్భంగా రాజశ్యామల అమ్మవారిని వనదుర్గ అవతారంలో ప్రత్యేకంగా అలంకరించారు. ప్రతిష్టాత్మకంగా చేపట్టిన యాగం నిర్విఘ్నంగా కొనసాగాలని ముక్కోటి దేవతలను ప్రార్ధిస్తూ అస్త్ర రాజార్చన, కర్కరీయ స్థాపన చేశారు.యాగంలో పాల్గొనే పండితులు, రుత్విక్కులకు కేసీఆర్‌ దంపతులు దీక్షా వస్త్రాలను స్వయంగా అందించారు. అఖండ స్థాపన అనంతరం అగ్నిమధనం చేసి యాగశాలలో అగ్నిని ప్రతిష్టించారు.

also read:హ్యాట్రిక్ కోసం కేసీఆర్: ఫామ్‌హౌస్ లో రాజశ్యామల యాగం, సెంటిమెంట్ ఫలించేనా?

 తెలుగు రాష్ట్రాలు సర్వతోముఖాభివృద్ధి చెందాలని, సస్యశ్యామలంగా కళకళలాడాలని, ప్రజలంతా సుఖ సంతోషాలతో వర్ధిల్లాలని కోరుకుంటూ ముఖ్యమంత్రి కేసీఆర్‌ ఈ యాగాన్ని తలపెట్టారని పీఠాధిపతులు స్వరూపానందేంద్ర స్వామి తెలిపారు. రాజశ్యామల యాగం విశాఖ శ్రీ శారదాపీఠానికి ప్రత్యేకమని ఆయన తెలిపారు. 

ఈ యాగంలో రాజ్యసభ సభ్యులు జోగినపల్లి సంతోష్, ఎంపీ నామా నాగేశ్వర్ రావు, ఎమ్మెల్సీ మధుసూదనాచారి, మాజీ మంత్రి వేణుగోపాల చారి, ప్రభుత్వ సలహాదారు అనురాగ్ శర్మ తదితరులు పాల్గొన్నారు.

click me!