ప్రభుత్వ పాఠశాలలో పనిచేసే స్వీపర్లతో టీచర్లు అమానుషంగా ప్రవర్తించారు. వివస్త్రలను చేసి దారుణంగా ప్రవర్దించిన ఘటన పెద్దపల్లి జిల్లాలో చోటుచేసుకుంది.
కరీంనగర్ : విద్యలేని వాడు వింత పశువు అంటారు... కానీ పెద్దపెద్ద చదువులు చదివిన వారే పశువుల్లా ప్రవర్తించిన ఘటన పెద్దపల్లి జిల్లాలో వెలుగుచూసింది. విద్యార్థులకు విద్యాబుద్దులు నేర్పాల్సిప ఉపాధ్యాయులే బుద్దితక్కువ పని చేసారు. సమాజానికి ఆదర్శంగా వుండాల్సిన టీచర్లు సభ్యసమాజం తలదించుకునేలా వ్యవహరించారు. చదువున్నా సంస్కారం ఏమాత్రం లేని టీచర్లు మహిళా స్వీపర్ల పై దొంగతనం నేరం మోపారు. అంతేకాదు ఏ పాపం తెలియని ఆ అమాయకులను బట్టలు విప్పి వివస్త్రను చేసిమరీ తనిఖీలు చేసారట. తీవ్ర అవమానానికి గురయిన సదరు మహిళా స్వీపర్లు కుటుంబసభ్యులతో కలిసి ఆందోళనకు దిగడంతో విషయం బయటపడింది.
బాధిత మహిళ తెలిపిన వివరాలిలా ఉన్నాయి. పెద్దపల్లి జిల్లా గోదావరిఖని జ్యోతిరావు పూలే ప్రభుత్వ పాఠశాలలో సుశీల, పద్మ స్వీపర్లుగా పనిచేస్తున్నారు. రోజూ ఉదయమే స్కూల్ కు వచ్చి తరగతి గదులతో పాటు ప్రిన్సిపల్, టీచర్ల రూంలను కూడా శుభ్రం చేస్తుంటారు. ఇలా నిన్న(మంగళవారం) కూడా రోజూ మాదిరిగానే ఉదయం స్కూల్ కు వెళ్లి గదులన్నీ శుభ్రంచేసారు సుశీల, పద్మ.
వీడియో
అయితే ఈ స్కూల్లో గెస్ట్ టీచర్ గా పనిచేసే శ్రీలేఖ తన బ్యాగ్ ను టీచర్ల గదిలో పెట్టి విద్యార్థులకు క్లాస్ తీసుకునేందుకు వెళ్లింది. ఈ సమయంలో ఎవరో ఆ హ్యాండ్ బ్యాగ్ లోంచి రూ.4వేలు దొంగిలించారు. క్లాస్ తీసుకుని తిరిగివచ్చిన శ్రీలేఖ తన బ్యాగులో డబ్బులు పోయినట్లు గుర్తించింది. వెంటనే ఆమె ప్రిన్సిపల్ కు ఫిర్యాదు చేసింది. శ్రీలేఖతో పాటు మిగతా ఉపాధ్యాయులు, విద్యార్థులు ఎంత వెతికినా డబ్బులు దొరకలేదు.
Read More కామారెడ్డిలో గురుకుల విద్యార్థిని సూసైడ్.. తల్లిదండ్రులు, బంధువుల ఆందోళన..
ఉపాధ్యాయురాలి బ్యాగులోంచి డబ్బులు స్వీపర్లు పద్మ, సుశీల దొంగిలించి వుంటారని ప్రిన్సిపల్ అనుమానించారు. స్థానికంగా వుండే ఓ మాంత్రికుడితో పసుపు నీరు మంత్రించి విద్యార్థులతో పాటు స్వీపర్లిద్దరికీ తాగించారు. అయినా దొంగ ఎవరో బయటపడేలేదు. అప్పటికే సాయంత్రం కావడంతో విధులు ముగించుకుని ఇంటికి వెళుతున్న స్వీపర్లను ప్రిన్సిపల్ ఆదేశాలతో ఉపాధ్యాయులు ఆపారు. వారిద్దరి బట్టలు విప్పి వివస్త్రను చేసి తనిఖీలు చేపట్టారు. దీంతో దొంగతనం నేరం మోపడంతో పాటు అవమానకరంగా తనిఖీ చేయడంపై సుశీల, పద్మ తీవ్ర మనస్థాపానికి గురయ్యారు. వెంటనే స్కూల్ గేట్ వద్ద బైఠాయించి ఆందోళనకు దిగారు. డివో స్వరూప, గెస్ట్ టీచర్ శ్రీలేఖ తమను ఇబ్బందులకు గురిచేసినట్లు సదరు మహిళలు కన్నీటిపర్యంత అయ్యారు.
ఈ ఘటనపై స్పందించిన స్కూల్ ప్రిన్సిపల్ తమ తప్పేమీ లేదని అంటున్నారు. టీచర్ డబ్బులు పోయింది... తనిఖీలు చేసింది వాస్తవమే... కానీ బట్టలు విప్పిమరీ తనిఖీ చేయలేదని అంటున్నారు. డబ్బులు దొంగతనం జరిగాయంటున్న టీచర్ శ్రీలేఖ కూడా ఇదే మాట అంటున్నారు. కానీ స్వీపర్లు మాత్రం తమను వివస్త్రను చేసినట్లు చెబుతున్నారు.