తెలంగాణ రాష్ట్ర గవర్నర్ గా సౌందర్ రాజన్ ను నియమించడం వెనుక బీజేపీ నాయకత్వం వ్యూహత్మక అడుగులు వేస్తున్నట్టుగా రాజకీయ పరిశీలకులు భావిస్తున్నారు.
హైదరాబాద్: రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్ నియమించిన కొత్త గవర్నర్లలో తెలంగాణకు నియమింపబడ్డ తమిళిసై సౌందరరాజన్ ఒక ఆశర్యరమైన ఎంపికగా కనపడవచ్చు. ప్రస్తుత తమిళనాడు బీజేపీ అధ్యక్షురాలిగా కొనసాగుతున్న తనను ఉన్నట్టుండి తెలంగాణకు గవర్నర్ గా పంపడానికి కారణం లేకపోలేదు.
2019 పార్లమెంట్ ఎన్నికల్లో బీజేపీ తమిళనాడులో కనీసం కొన్ని సీట్లన్నా గెలవాలనుకుంది. ఏ కొత్త సీటును కూడా గెలవకపోగా, ఉన్న ఒక్క కన్యాకుమారి సీటును కూడా కోల్పోయింది. ఇలాంటి పరిస్థితుల్లో బీజేపీ అధిష్టానం ఒక నూతన నాయకత్వం కోసం వెదకడం ఆరంభించింది.
మరి ఎన్నికల్లో ఖాతా కూడా తెరవలేకపోయిన బీజేపీ పార్టీ అధ్యక్షురాలిని నేరుగా పక్కకు పెట్టకుండా ఇలా గవర్నర్ పోస్టును ఎందుకు కట్టబెట్టారనే సందేహం కలగకమానదు.
తనకు గవర్నర్ పదవిని కట్టబెట్టడానికి కారణం సౌందరరాజన్ పార్టీ బలోపేతానికి చేసిన కృషి. పార్టీ బోణీ కొట్టలేకపోయినప్పటికీ, గ్రామస్థాయిలో సైతం పార్టీ సంస్థాగత నిర్మాణానికి పాటుపడింది. తను తూత్తుకుడి నుండి కరుణానిధి కూతురు కనిమొళి చేతిలో ఓటమిపాలైనప్పటికీ, గట్టి పోటీని మాత్రం ఇచ్చింది.
ఇంతలా కష్టపడ్డ సౌందరరాజన్ కు మర్యాదపూర్వకమైన నిష్క్రమను కల్పించింది బీజేపీ. ఇక్కడొక ఆసక్తికరమైన విషయం ఏంటంటే, ఇంతకుమునుపు ఏ తమిళనాడు బీజేపీ అధ్యక్షులకు కూడా ఇలాంటి నిష్క్రమణ దొరకలేదు.
ఇంతకుమునుపు వారిని నేరుగా పక్కకు పెట్టేవారే తప్ప ఇలా ప్రమోషన్లు కల్పించిన దాఖలాలు మనకు కనపడవు. బీజేపీ గనుక కొన్ని గౌరవప్రదమైన సీట్ల సంఖ్యను సాధించివుండుంటే, సౌందరరాజన్ కు మంత్రిపదవిని కూడా కట్టబెట్టాలని కేంద్ర సర్కార్ భావించింది. తను ఎన్నికల్లో ఓటమి చెందినా కూడా రాజ్యసభకైనా తనను నామినేట్ చేయాలని భావించారు.కానీ బీజేపీ ఖాతా కూడా తెరవకపోవడంతో కొత్త మొఖం కోసం బీజేపీ అధినాయకత్వం వేటనారంభించింది.
మామూలుగా గవర్నర్ పోస్టానేది సీనియర్ నేతలకు రిటైర్మెంట్ తీసుకున్న నేతలకు ఇస్తుంటారు. మరి ఇలాంటి క్రియాశీలక రాజకీయనేతకు గవర్నర్ పోస్టును ఇవ్వడం సర్వత్రా చర్చనీయాంశంగా మారింది. ఇలాంటి ఆక్టివ్ పొలిటీషియన్ ని బీజేపీ కన్నేసిన తెలంగాణ రాష్ట్రానికి గవర్నర్ గా పంపుతూ ఉండడంతో, తెలంగాణాలో రాజకీయంగా తమ స్పీడును బీజేపీ పెంచనున్నట్టు తేటతెల్లమైపోయింది.
నరసింహన్ విషయానికి వస్తే, అధినాయకత్వం ఊహించినంత వేగంతో తెరాస ను అతను ఇబ్బంది పెట్టలేకపోతున్నాడని వారు భావిస్తున్నారు. ముఖ్యంగా ఇంటర్ విద్యార్థుల మరణంపైన నివేదికనైతే కోరాడు కానీ, వేగంగా దాన్ని అందించలేకపోయాడని వారు భావిస్తున్నారు.
ఎప్పటినుండో గవర్నర్ గా ఉండడంతో కెసిఆర్ పట్ల కొంత సాఫ్ట్ కార్నర్ నరసింహన్ ప్రదర్శిస్తున్నాడని కూడా వారు భావించి ఉండవచ్చు. నూతన గవర్నర్ పేరును ప్రకటించగానే, నరసింహన్ ను తెలంగాణ ప్రభుత్వ గౌరవ సలహాదారుగా వ్యవహరించమని కెసిఆర్ కోరడంతో, ఇలాంటి ఊహాగానాలకు మరింత బలం చేకూరుతుంది.
ఏదిఏమైనప్పటికీ, గత పర్యాయం తెరాస, బీజేపీల మధ్య కొంత అప్రకటిత స్నేహం ఉందన్నమాట వాస్తవం. ఈ దఫాలో గనుక చూసుకుంటే, బీజేపీ 4 పార్లమెంట్ సీట్లను గెలవడం, అవికూడా తెలంగాణ ఉద్యమానికి ఆయువుపట్టులైన ఉత్తర తెలంగాణాలో గెలవడం, స్వయానా కెసిఆర్ కూతురు ఓడిపోవడం ఇత్యాది అన్ని కారణాల వల్ల బీజేపీ ఇక్కడ నేరుగా తెరాస ను ఎదుర్కొనేందుకు సిద్ధపడింది.
అందులో భాగంగానే, అమిత్ షా ఇక్కడికి తరచూ వచ్చి వెళుతూ ఉండడం, ప్రతి నెలా ఎవరో ఒక జాతీయ నాయకుడో, కేంద్ర మంత్రో పర్యటిస్తుండడం మనం చూస్తున్నాం. అన్నింటికంటే ముఖ్యంగా కిషన్ రెడ్డికి కేంద్ర మంత్రి పదవిని కట్టబెట్టడం వారి ఆలోచనను మనకు కళ్ళకు కట్టినట్టుగా చూపెడుతుంది.
ఇలాంటి పరిస్థితుల్లో బీజేపీకి తెరాస ను ఇబ్బందిపెట్టగలిగే ఒక ఆక్టివ్ పొలిటీషియన్ గవర్నర్ గా అవసరం. అంతే కాకుండా, కెసిఆర్ గతపర్యాయం కూడా మంత్రిమండలిలో మహిళకు స్థానం కల్పించలేదు.
ఈ పర్యాయం కూడా ఇంతవరకు మహిళను తీసుకోలేదు. ఇలాంటి పరిస్థితుల్లో మహిళా గవర్నరును నియమిస్తే గవర్నర్ ప్రసంగించిన ప్రతిసారి కూడా బీజేపీ నాయకత్వం మహిళా శక్తి గురించి, వారు అన్నింటా సమానులే అని తెరాస ను ఇబ్బంది పెట్టవచ్చు. మునిసిపల్ ఎన్నికలు కూడా దెగ్గరలోనే ఉండడంతో, ఇలాంటి సమయంలో గవర్నర్ మార్పు కొద్దిగా తెరాస ను కలవరపెట్టే అంశమే.
సంబంధిత వార్తలు
నరసింహన్‌తో రెండు గంటల చర్చలు: కేసీఆర్ ప్లాన్ ఇదీ
హిమాచల్‌ప్రదేశ్ గవర్నర్‌గా నియామకం: స్పందించిన దత్తాత్రేయ
విలువలు, క్రమశిక్షణ, విధేయత: దత్తన్న రాజకీయ ప్రస్థానం
తెలంగాణ గవర్నర్ నరసింహాన్ బదిలీ?
నరసింహన్ బదిలీ: తెలంగాణకు సౌందర రాజన్, హిమాచల్‌కు దత్తన్న
ప్రత్యక్ష ఎన్నికల్లో కలిసిరాని విజయం... వరించిన గవర్నర్ గిరి
దత్తాత్రేయకు బీజేపీ కార్యకర్తల అభినందనలు (ఫోటోలు)