జనగామ అసెంబ్లీ స్థానం నుండి పల్లా రాజేశ్వర్ రెడ్డికే బీఆర్ఎస్ టిక్కెట్టు కేటాయించింది. ఈ ఏడాది ఆగస్టులో ప్రకటించిన అభ్యర్థుల జాబితాలో జనగామ పేరు లేదు.
హైదరాబాద్: జనగామ అసెంబ్లీ స్థానం నుండి ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్ రెడ్డిని బీఆర్ఎస్ బరిలోకి దింపుతుంది. ఈ మేరకు పల్లా రాజేశ్వర్ రెడ్డికి బీఆర్ఎస్ చీఫ్ కేసీఆర్ ఆదివారం నాడు బీ ఫారం అందించారు. ఈ ఏడాది సెప్టెంబర్ 27న తెలంగాణ సీఎం కేసీఆర్ 115 మంది అభ్యర్థుల జాబితాను ప్రకటించారు.
గోషామహల్, నాంపల్లి, నర్సాపూర్, జనగామ అసెంబ్లీ స్థానాలకు అభ్యర్థులను ప్రకటించలేదు. జనగామ అసెంబ్లీ స్థానం నుండి సిట్టింగ్ ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరి రెడ్డికి బదులుగా ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్ రెడ్డికి కేసీఆర్ టిక్కెట్టు కేటాయించారు. జనగామ అసెంబ్లీ స్థానం నుండి రెండు దఫాలు విజయం సాధించిన ముత్తిరెడ్డి యాదగిరి రెడ్డిని మార్చాలని కేసీఆర్ నిర్ణయం తీసుకున్నారు.
undefined
ఈ దఫా తాను కచ్చితంగా పోటీ చేస్తానని ముత్తిరెడ్డి యాదగిరి రెడ్డి రెండు మాసాల క్రితం ప్రకటించారు. ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్ రెడ్డి నియోజకవర్గంలో బీఆర్ఎస్ నేతలతో సమావేశం కావడంపై ముత్తిరెడ్డి యాదగిరి రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ సమావేశాలకు పోటీగా ముత్తిరెడ్డి యాదగిరి రెడ్డి కూడ సమావేశాలు నిర్వహించారు. ముత్తిరెడ్డి యాదగిరి రెడ్డికి బీఆర్ఎస్ నాయకత్వం ఆర్టీసీ చైర్మెన్ పదవిని కేటాయించింది. పది రోజుల క్రితం ముత్తిరెడ్డి యాదగిరి రెడ్డి ఆర్టీసీ చైర్మెన్ బాధ్యతలు స్వీకరించారు.
గత వారంలో పల్లా రాజేశ్వర్ రెడ్డి, ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డితో మంత్రి కేటీఆర్ హైద్రాబాద్ లో సమావేశమయ్యారు. పల్లా రాజేశ్వర్ రెడ్డిని జనగామలో గెలిపించాలని ముత్తిరెడ్డి యాదగిరి రెడ్డికి సూచించారు. భవిష్యత్తులో ముత్తిరెడ్డి యాదగిరి రెడ్డికి పార్టీ పరంగా అన్ని అవకాశాలు కల్పిస్తామని కేటీఆర్ హామీ ఇచ్చారు. ఈ సమావేశం జరిగిన మరునాడే జనగామలో బీఆర్ఎస్ సమావేశం నిర్వహించారు.ఈ సమావేశంలో పల్లా రాజేశ్వర్ రెడ్డిని లక్ష మెజారిటీతో గెలిపిస్తామని ముత్తిరెడ్డి యాదగిరెడ్డి ప్రకటించారు. ఈ సమయంలో పల్లా రాజేశ్వర్ రెడ్డి, ముత్తి రెడ్డి యాదగిరి రెడ్డిలు ఆలింగనం చేసుకున్నారు. ఒకరికొకరు స్వీట్లు తినిపించుకున్నారు.
బీఆర్ఎస్ అభ్యర్థులకు తెలంగాణ సీఎం కేసీఆర్ ఇవాళ బీ ఫారాలు అందించారు. ప్రగతి భవన్ లోనే జనగామ అసెంబ్లీ స్థానానికి బరిలో దిగనున్న పల్లా రాజేశ్వర్ రెడ్డికి కేసీఆర్ బీ ఫారం అందించారు.
also read:బీ ఫారాలు అందుకున్న ఆ ఇద్దరు: 51 మందికే బీఆర్ఎస్ బీ ఫారాలు(వీడియో)
మాజీ మంత్రి పొన్నాల లక్ష్మయ్య రెండు రోజుల క్రితం కాంగ్రెస్ కు రాజీనామా చేశారు. బీఆర్ఎస్ లో చేరాలని పొన్నాల లక్ష్మయ్యను కేటీఆర్ నిన్న ఆహ్వానించారు. ఇవాళ కేసీఆర్ ను పొన్నాల లక్ష్మయ్య కలిసే అవకాశం ఉంది. పొన్నాల లక్ష్మయ్య బీఆర్ఎస్ లో చేరే అవకాశం ఉన్న నేపథ్యంలో జనగామ నుండి పొన్నాల లక్ష్మయ్యకు టిక్కెట్టును కేటాయిస్తారా అనే చర్చ కూడ ప్రారంభమైంది. అయితే ఈ ప్రచారంలో వాస్తవం లేదని పార్టీ వర్గాలు తేల్చి చెప్పాయి. ఇందుకు బలం చేకూరుస్తూ పల్లా రాజేశ్వర్ రెడ్డికి కేసీఆర్ బీ పారం అందించారు.