తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల వేళ బీఆర్ఎస్ మేనిఫెస్టోను ఆ పార్టీ అధినేత, ముఖ్యమంత్రి కేసీఆర్ విడుదల చేశారు.
తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల వేళ బీఆర్ఎస్ మేనిఫెస్టోను ఆ పార్టీ అధినేత, ముఖ్యమంత్రి కేసీఆర్ విడుదల చేశారు. హైదరాబాద్‌లోని తెలంగాణ భవన్‌లో బీఆర్ఎస్ మేనిఫెస్టోను విడుదల చేసిన కేసీఆర్ మాట్లాడుతూ.. గతంలో మేనిఫెస్టోలో చెప్పని ఎన్నో అంశాలను అమలు చేశామని చెప్పారు. ఎన్నిలక ప్రణాళికలో లేనివాటిని అమలు చేసిన ఘనత తమకే దక్కుతుందని అన్నారు. దళిత బంధు పథకాన్ని కొనసాగిస్తామని చెప్పారు. గిరిజనులకు ఇచ్చిన హామీలను బీఆర్ఎస్ ప్రభుత్వం అమలు చేసిందని.. భవిష్యత్తులో వారి కోసం మరిన్ని పథకాలు తీసుకొచ్చామని చెప్పారు. మైనారిటీల సంక్షేమానికి పెద్దపీట వేశామని, బడ్జెట్‌ను పెంచినట్టుగా కేసీఆర్ చెప్పారు. బీసీలకు అమలు చేస్తున్న పథకాలు కొనసాగిస్తామని తెలిపారు.
కేసీఆర్ బీమా- ప్రతి ఇంటికి దీమా పేరుతో కొత్త పథకాన్ని తీసుకొస్తామని హామీ ఇచ్చారు. తెల్ల రేషన్ కార్డులు కలిగిన 93 లక్షల కుటుంబాలకు రూ. 5 లక్షల సాధారణ బీమా అందించనున్నట్టుగా తెలిపారు. రైతు బీమా తరహాలోనే దీనిని అమలు చేస్తామని చెప్పారు. ఈ బీమాకు సంబంధించిన ప్రీమియం ప్రభుత్వమే చెల్లిస్తుందని.. మరోసారి అధికారంలో వచ్చిన నాలుగైదు నెలల్లోనే ఈ ప్రక్రియను పూర్తి చేస్తామని చెప్పారు. ఎల్‌ఐసీ ద్వారా బీమా పథకం అమలు చేస్తామని అన్నారు.
undefined
తెలంగాణ అన్నపూర్ణ పథకం కింద రాష్ట్రంలో ప్రతి ఇంటికి సన్న బియ్యం ఇవ్వనున్నట్టుగా చెప్పారు. తెల్ల రేషన్ కార్డు లబ్దిదారులకు దీనిని వర్తింపచేయనున్నట్టుగా హామీ ఇచ్చారు. మరోసారి అధికారంలోకి వచ్చిన తర్వాత.. వచ్చే ఏప్రిల్- మే నుంచి దీనిని అమలు చేస్తామని చెప్పారు.
తెలంగాణలో సామాజిక పెన్షన్లు రూ. 5 వేలకు పెంచనున్నట్టుగా కేసీఆర్ హామీ ఇచ్చారు. వచ్చే ఏడాది మార్చి తర్వాత రూ. 3 వేలకు పెంచి.. ప్రతి ఏడాది 500 రూపాయలు పెంచుతూ.. ఐదో సంవత్సరం వరకు రూ. 5 వేలకు చేరుకుంటుందని అన్నారు. తద్వారా ప్రభుత్వంపై ఒకేసాని భారం పడే అవకాశం ఉండదని అన్నారు. ఏపీలో కూడా ఇదే విధంగా సీఎం జగన్ విజయవంతం చేశారని ప్రస్తావించారు. దివ్యాంగులకు పెన్షన్‌ను ఇటీవల రూ. 4 వేలకు పెంచామని.. దానిని రూ. 6 వేలకు పెంచుతామని చెప్పారు. వచ్చే మార్చి తర్వాత రూ. 5 వేలకు పెంచి.. ఆ తర్వాత పెంచుకుంటూ పోతామని చెప్పారు. ప్రతి ఏడాది రూ. 300 పెంచుకుంటూ.. ఆరు వేల రూపాయలకు తీసుకెళ్తామని తెలిపారు.
-రైతు బంధును రూ. 16, 000లకు పెంచుతామని కేసీఆర్ హామీ ఇచ్చారు. మొదటి ఏడాది రూ. 12 వేలకు పెంచి.. ప్రతి ఏడాది కొంత పెరుగుతూ ఐదో ఏడాదికి రూ. 16 వేలకు పెంచనున్నాం.
-సౌభౌగ్య లక్ష్మీ పథకం కింద అర్హులైన పేద మహిళలకు రూ. 3 వేల గౌరవ భృతి ఇవ్వనున్నట్టుగా చెప్పారు. దానికి సంబంధించి మార్గదర్శకాలు ఉన్నాయని చెప్పారు.
-అర్హత కలిగిన లబ్దిదారులకు రూ. 400కే గ్యాస్ సిలిండర్ అందిస్తాం.
-అక్రిడేషన్ కలిగిన జర్నలిస్టులకు ఆదాయంతో సంబంధం లేకుండా రూ. 400కే సిలిండర్ అందజేస్తాం.
-ఆరోగ్య శ్రీ గరిష్ట ఇన్యూరెన్స్ రూ. 15 లక్షలకు పెంచుతాం.
-జర్నలిస్టులకు, వారి కుటుంబ సభ్యులకు రూ. 15 లక్షల వరకు ఎటువంటి డబ్బులు అడగకుండా ట్రీట్‌మెంట్. కేసీఆర్ ఆరోగ్య రక్ష అని పేరు పెట్టడం జరిగింది.
-డబుల్ బెడ్ రూమ్ ఇళ్లతో పాటు.. గృహాలక్ష్మీ పథకాన్ని తీసుకొచ్చాం. రాబోయే రోజుల్లో ప్రతి ఒక్కరికి ఇళ్లు ఉండాలని.. హైదరాబాద్‌లో మరో లక్ష డబుల్ బెడ్ రూమ్ ఇళ్లు కడతామని హామీ ఇస్తున్నాం. ఇళ్ల స్థలాలు ఉన్నవారికి గృహాలక్ష్మీ పథకాన్ని కొనసాగిస్తూనే.. ఇళ్ల స్థలాలు లేనివారికి కూడా ఇళ్ల జాగాలు కూడా ఇచ్చే కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్తాం.
-అగ్రవర్ణాల పేదలకు 119 గురుకులాలు ఏర్పాటు చేయనున్నాం.
-రెసిడెన్షియల్ విద్యా విధానాన్ని కొనసాగిస్తూ.. మంచి మార్పులు తీసుకొస్తాం.
- అన్ని గ్రామాలు, పట్టణాలలో స్వశక్తి మహిళా గ్రూప్‌లకు భవనాలను దశల వారీగా కట్టిస్తాం.
-ఆర్ఫన్ పాలసీని అమలు చేస్తాం.
-అసైండ్ ల్యాండ్స్‌పై దళిత ప్రజాప్రతినిధులతో చర్చలు జరిపి.. ఒక పాలసీ రూపొందించి.. ఆంక్షలు ఎత్తివేసి, మాములు పట్టదారుల మాదిరిగా హక్కులు కల్పించే ప్రయత్నం చేస్తామనే హామీ ఇస్తున్నాం.
-ఓల్డ్ పెన్షన్ స్కీమ్ కావాలని ప్రభుత్వ ఉద్యోగులు కోరుతున్నారని.. వాటిపై పూర్తి సాధ్యాసాధ్యాలను స్టడీ చేయడానికి ఉన్నతాధికారుల కమిటీ ఏర్పాటు చేస్తాం. ఆ రిపోర్టు ఆధారంగా నిర్ణయం తీసుకుంటాం.