
బీజేపీతో దోస్తీ కుదిరినా కూటమి కట్టే పరిస్థితి లేకుండా పోయింది. కేంద్రంలో మంత్రి పదవి దక్కే అవకాశమూ కనిపించడం లేదు. వచ్చే ఎన్నికల్లోనూ ఒంటరి పోరుకే గులాబీ పార్టీ సిద్ధమవుతోంది.
ఈ నేపథ్యంలో సీఎం కేసీఆర్ కుమార్తె , నిజమాబాద్ ఎంపీ కవిత వచ్చే ఎన్నికల్లో ఎటు వైపు వెళుతారు...? మళ్లీ ఢిల్లీ బాటే పడుతారా... లేక నాన్న దారిలో నడుస్తారా...? ఒక వేళ ఆమె పార్లమెంట్ లో అడుగుపెడితే పార్టీలో ఇంటిపోరు పెద్దగా ఉండదు. కానీ, అసెంబ్లీ వైపు అడుగు వేస్తే వారసత్వ పోరు మొదలైనట్లే.
ఇప్పటికే కవిత ఢిల్లీ ని వదిలి గల్లీ రాజకీయాలపై దృష్టి సారించినట్లుగా తెలుస్తోంది. వచ్చే ఎన్నికల్లో కవిత ఎమ్మెల్యేగా పోటీ చేసేందుకు ప్రయత్నిస్తున్నారని పార్టీ వర్గాలే గుసగుసలాడుతున్నాయి.
టీఆర్ఎస్ కు మంచి పట్టున్న జగిత్యాల నియోజకవర్గం నుంచి ఆమె పోటీ చేసే అవకాశం ఉందని అందుకే ఇప్పటి నుంచే అక్కడ రంగం సిద్ధం చేస్తున్నట్లు తెలుస్తోంది. సీఎం రేసులో తాను కూడా ఉన్నాననే సంకేతాలు ఇవ్వడానికే ఆమె అసెంబ్లీ వైపు అడుగులు వేస్తుండొచ్చని పార్టీ లో కొందరు ముఖ్య నేతలు భావిస్తున్నారు.
ఇటీవల వరకు కేసీఆర్ రాజకీయ వారసుడిగా కేటీఆర్ పేరే వినిపించింది. ఆయననే పార్టీలో నెంబర్ 2 గా అందరూ భావిస్తూ వస్తున్నారు. ఇటీవల ఓ సభలో కవితక్క కూడా అన్నను ఆశీర్వదించండి అని ప్రజలను కూడా కోరారు.
అయితే ఇటీవల ఆమె ఓ టీవీ చానెల్ తో మాట్లాడుతూ... తాను కేటీఆర్ ను ఆశీర్వదించమని ఎప్పుడూ అన లేదని పేర్కొనడం గమనార్హం. తమ పార్టీ కార్యకర్తలు అందరినీ ఆశీర్వదించాలని ప్రతీ సభలో ప్రజలను కోరుతున్నానని వివరణ ఇవ్వడం విశేషం. అలాగే, తమ పార్టీలో నెంబర్ 2 అంటూ ఎవరూ లేరని నెంబర్ 1 నుంచి నెంబర్ వెయ్యి వరకు అంతా కేసీఆర్ మాత్రమేనని తెలిపారు. అలా కేటీఆర్ పార్టీ లో నెంబర్ 2 అనే విషయాన్ని ఆమె ఒప్పుకోకుండా సమాధానం దాటేశారు.
ఇక వచ్చే ఎన్నికల్లో ఎంపీగా పోటీ చేయడం పై కూడా సరైన క్లారిటీ ఇవ్వలేదు. కేసీఆర్ ఎలా చెబితే అలా చేస్తానని ప్రకటించారు. జగిత్యాల నుంచి ఎమ్మెల్యేగా పోటీపై ప్రశ్నిస్తే సమాధానం చెప్పకుండా దాటవేశారు. ఈ క్లారిటీ లేని ప్రశ్నలకు సరైన సమాధానం రావాలంటే వచ్చే ఎన్నికల వరకు వేచి చూడాల్సిందే.