
ప్రధానమంత్రి నరేంద్రమోడిలో నియంత పోకడలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. గడచిన ఎన్నికల్లో దేశవ్యాప్తంగా ప్రచారం చేసిన మోడి సభల్లో మాట్లాడేటప్పుడు కాస్త భాజపాకు ఓటు వేయాలంటూ వేడుకోలు కనబడింది. తర్వాత అధికారంలోకి రాగానే మోడిలోని లోపల మనిషి బయటకు రావటం మొదలుపెట్టాడు మెల్లిగా. ముందుగా పార్టీలోనే సీనియర్లైన ఎల్ కె అద్వానీ, మురళీ మనోహర్ జోషి, జస్వంత్ సింగ్ లాంటి సీనియర్లను శంకరగిరి మాన్యాలు పట్టించారు.
ఇక, ఆ తర్వాత నుండి పార్టీలో సర్వ సహా తానే అన్నట్లుగా వ్యవహరిస్తున్నారు. పార్టీకి మించి వ్యక్తిగత హోదాలో ఇమేజి పెంచుకునేందుకు ప్రయత్నిస్తున్నారు. తాను లేకపోతే పార్టీ అధికారంలోకి వచ్చే అవకాశం లేదన్నట్లు వ్యవహరిస్తున్నారు. పార్టీలో ఎవరు కూడా ఏ విషయంలోనూ తనకు ఎదురు చెప్పే అవకాశం లేకుండా చేసుకున్నారు. దాంతో మోడి అంటే ఇష్టం ఉన్నా లేకున్నా ఎదురుచెప్పే సాహసం కూడా ఎవరూ చేయటం లేదు. ఏ విషయంలో కూడా మిత్రపక్షాలను సంప్రదించటం లేదు.
అదేవిధంగా, ఆంధ్రప్రదేశ్ అభివృద్ధితో ఓ రేంజిలో ఆటలాడుకుంటున్నారు. ఎన్నికల సమయంలో ఏపికి తానిచ్చిన హామీలను తుంగలో తొక్కారు. మన ధౌర్భాగ్యం వల్ల మోడిని ముఖ్యమంత్రి చంద్రబాబునాయడు ఏ విషయంలో కూడా డిమాండ్ చేసే పరిస్ధితి లేకుండా పోయింది. దాంతో మోడి ఏపిని పూర్తిగా నిర్లక్ష్యం చేస్తున్నారు. మంత్రివర్గంలోని పలువురిపై అనేక ఆరోపణలు వస్తున్న ఏమాత్రం ఖాతరు చేయటం లేదు. తాజాగా పెద్ద నోట్ల రద్దు విషయంలో కూడా ఏకపక్షంగా వ్యవహరించటంతో మోడిలో నియంతృత్వ ఛాయలు స్పష్టంగా కనబడుతోంది. రద్దు చేసారు సరే దానిపై చర్చించేందుకు పార్లమెంట్ కు కూడా హాజరవ్వటం లేదు.
ఆ మధ్య జరిగిన సమావేశాల్లో కూడా దాదాపు నెలరోజులు అసలు సమావేశాలకే హాజరుకాలేదు. ప్రస్తుత సమావేశాల్లో కూడా పార్లమెంట్ కు వచ్చి పెద్ద నోట్ల రద్దుపై తన ఆలోచనను విపక్షాలతో పంచుకోవటానికి ఏమాత్రం ఇష్ట పడటం లేదు. తనిష్టం వచ్చినట్లు చేస్తా మీ ఇష్టం వచ్చినట్లు చేసుకోండన్న ధోరణే మోడిలో కనబడుతోంది. పెద్ద నోట్ల రద్దుతో యావత్ దేశం 16 రోజులుగా నరకయాతన అనుభవిస్తున్నా మోడికి ఏమాత్రం పట్టలేదు.
దేశప్రజలు చేతిలో సరిపడా డబ్బులు లేక అవస్తలు పడుతుంటే బడా పారిశ్రామిక వేత్తలకు మాత్రం వేల కోట్ల రూపాయల మినహాయింపులు ఇస్తుండటం గమనార్హం. మొన్నటి ఎన్నికల్లో సంపూర్ణ మెజారిటీతో భాజపా అధికారంలోకి రావటమే మోడి ఆలోచనా విధానంలో మార్పు తెచ్చిందేమో. ప్రతిపక్షాలంటే లెక్కలేదు. పార్లమెంట్ అంటే ఏమాత్రం గరవం లేదు. తానేమి చేయదలుచుకుంటే అదే చేస్తున్నారు మోడి. బహుశా మరో రెండున్నరేళ్ళు భరించక తప్పదేమో.