
హైదరాబాద్ పోలీసు కమిషనర్‌గా (Hyderabad Police commissioner) సీవీ ఆనంద్ (CV Anand) శనివారం బాధ్యతలు చేపట్టారు. ప్రస్తుత సీపీ అంజనీ కుమార్ నుంచి ఆయన బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా సీవీ ఆనంద్‌కు అంజనీ కుమార్ శుభకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా సీవీ ఆనంద్ మాట్లాడుతూ.. తనను హైదరాబాద్ సీపీగా నియమించిన ముఖ్యమంత్రి కేసీఆర్‌కు కృతజ్ఞతలు తెలిపారు. హైదరాబాద్ (Hyderabad) దేశంలోనే వేగంగా అభివృది చెందుతుంది అని అన్నారు. పెద్ద నగరానికి సీపీగా బాధ్యతలు చేపట్టడం గర్వంగా ఉందన్నారు. భిన్న మతాల సమ్మేళనం హైదరాబాద్ సొంతం అని చెప్పారు. పోలీసు శాఖలో ఎన్నో సంస్కరణ వచ్చాయని అన్నారు. హైదరాబాద్ కమిషనరేట్‌లో ఎన్నో ఏళ్లు పనిచేశానని గుర్తు చేసుకున్నారు. తాను అడిషినల్ సీపీ ట్రాఫిక్‌గా ఉన్నప్పుడు డ్రంక్ అండ్ డ్రైవ్ చేపట్టామని చెప్పుకొచ్చారు.
Also Read: హైదరాబాద్ నగర కమిషనర్ గా సీవీ ఆనంద్.. 30 మంది ఐపీఎస్ ల బదిలీలు..
‘మెట్రోపాలిటన్ సిటీలో శాంతి భద్రతలు చాలా ముఖ్యం. నగరంలో శాంతిభద్రతలకు పెద్దపీట వేస్తాను. ఇటీవలి కాలంలో సైబర్ క్రైమ్ నేరాలు పెరుగుతున్నాయి. సైబర్ క్రైమ్ నేరాలను అరికట్టేందుకు చర్యలు తీసుకుంటాం. వీటిపై ప్రత్యేక దృష్టి సారిస్తాము. డ్రగ్స్ కట్టడికి ఇప్పటికే డ్రైవ్ నడుస్తోంది. మహిళల భద్రతకు ప్రత్యేక ప్రాధాన్యం ఇస్తున్నాం. గత నాలుగు సంవత్సరాల నుంచి సెంట్రల్ డిప్యుటేషన్‌లో వెళ్లి వచ్చాను. ప్రభుత్వ ఆదేశాలకు అనుగుణంగా నూతన సంవత్సర వేడుకలు నిర్వహిస్తాం’ అని సీవీ ఆనంద్ తెలిపారు.
తెలంగాణలో భారీ ఎత్తున IPS అధికారులను బదిలీలు చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం శుక్రవారం రాత్రి ఉత్తర్వులు జారీ చేసిన సంగతి తెలిసిందే. మొత్తం 30 మందికి స్థానచలనం అయ్యింది. హైదరాబాద్ కమిషనర్, సీనియర్ ఐపీఎస్ లతో పాటు పోలీసు కమిషనర్లు, జిల్లా ఎస్పీల బదిలీలు సైతం జరిగాయి. సీనియర్ ఐపీఎస్ లతో పాటు సిద్దిపేట, నిజమాబాద్ పోలీస్ కమిషనర్లు, 11 జిల్లాల ఎస్పీల బదిలీలను ప్రభుత్వం చేపట్టింది. నారాయణపేట ఎస్పీ చేతనకు పోస్టింగు ఇవ్వలేదు. ఒకటి రెండు రోజుల్లో మరిన్ని బదిలీలు జరిగే అవకాశం ఉంది.
మూడేళ్ల క్రితం భారీ సంఖ్యలో బదిలీలు జరిగిన తరువాత ఇప్పటివరకు మళ్లీ ఈ స్థాయిలో బదిలీలు చేపట్టలేదు. తాజా బదిలీల్లో నగర పోలీస్ కమిషనర్ గా నియమితులైన సీవీ ఆనంద్ 2018 ఏప్రిల్ లో కేంద్ర సర్వీసులకు వెళ్లారు. ఆయన మూడున్నరేళ్ల కిందట తెలంగాణ కేడర్ కు బదిలీపై వచ్చారు. సుదీర్ఘకాలంగా రాచకొండ కమిషనర్ గా ఉన్న మహేష్ భగవత్ కు స్థానచలనం కలగకపోవడం గమనార్హం.