కేటీఆర్‌ కుమారుడిపై తీన్మార్ మల్లన్న పోల్: బంజారాహిల్స్ పోలీసులకు ఫిర్యాదు..

By Sumanth KanukulaFirst Published Dec 25, 2021, 12:54 PM IST
Highlights

తెలంగాణ మంత్రి కేటీఆర్ కుమారుడిపై (KTR son) ట్విట్టర్‌లో పోల్ నిర్వహించడం ఇప్పుడు చర్చనీయాంశంగా మరింది. సోషల్ మీడియాలో (Social Media) తన కుటుంబంపై  అనుచిత వ్యాఖ్యలు చేయడంపై కేటీఆర్ తీవ్రంగా స్పందించిన సంగతి తెలిసిందే. తాజాగా కేటీఆర్ కుమారుడిపై అనుచిత వ్యాఖ్యలకు సంబంధించి టీఆర్‌ఎస్ సోషల్ మీడియా విభాగం పోలీసులను ఆశ్రయించింది. 
 

తెలంగాణ మంత్రి కేటీఆర్ కుమారుడిపై (KTR son) ట్విట్టర్‌లో పోల్ నిర్వహించడం ఇప్పుడు చర్చనీయాంశంగా మరింది. సోషల్ మీడియాలో తన కుటుంబంపై  అనుచిత వ్యాఖ్యలు చేయడంపై కేటీఆర్ తీవ్రంగా స్పందించిన సంగతి తెలిసిందే. ‘‘ అభివృద్ధి ఎక్కడ జరిగింది.. భద్రాచలం గుడిలోనా..? హిమాన్షు (himanshu ) శరీరంలోనా..? అంటూ ’’ తీన్మార్‌ మల్లన్న (teenmar mallanna) పోల్‌ నిర్వహించడంపై బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డాకు (jp nadda) ఫిర్యాదు చేశారు. మరోవైపు సోషల్ మీడియాలో వేదికగా టీఆర్‌ఎస్ శ్రేణులు తీన్మార్ మల్లన్నపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చస్తున్నారు. ఈ క్రమంలోనే ఇందుకు సంబంధించి టీఆర్‌ఎస్ సోషల్ మీడియా విభాగం పోలీసులను ఆశ్రయించింది. కేటీఆర్ కుమారుడిపై పోల్ నిర్వహించిన వారిపై చర్యలు తీసుకోవాల్సిందిగా బంజారాహిల్స్ పోలీసులకు ఫిర్యాదు చేసింది. 

కుటుంబ సభ్యుల జోలికి వెళ్లడం సరికాదు..  ఆర్‌ఎస్ ప్రవీణ్ కుమార్
కేటీఆర్ కుమారుడిపై ట్విట్టర్‌లో పోల్‌ నిర్వహించడంపై మాజీ ఐపీఎస్ అధికారి, బీఎస్పీ నేత ఆర్‌ఎస్ ప్రవీణ్ కుమార్ స్పందించారు. దీనిని మర్యాద లేని బాధ్యతారహితమైన చర్యగా విమర్శించారు. విధానపరమైన అంశాల్లో మాత్రమే ప్రత్యర్థులను ఎదుర్కోవాలని అన్ని పార్టీలను కోరుతున్నట్టుగా చెప్పారు. కుటుంబ సభ్యుల జోలికి వెళ్లడం సరికాదని అన్నారు. అయితే తెలంగాణ రాజకీయాల్లో ఇలాంటి అసభ్యతను తీసుకురావడంలో టీఆర్‌ఎస్‌ పాత్ర కూడా అంతే ఉందని ఆరోపించారు. 

మద్దతుగా నిలిచిన షర్మిల.. 
‘ఒక తల్లిగా, ఒక రాజకీయ పార్టీ నాయకురాలిగా.. పిల్లలను వేధించడం, కుటుంబ సభ్యులపై ఇలాంటి కించపరిచే ప్రకటనలు చేయడాన్ని నేను ఖండిస్తున్నాను. మహిళలను కించపరచడం, పిల్లలను బాడీ షేమ్ చేయడం వంటి ప్రకటనలు చేయడాన్ని నేను ఖండిస్తున్నాను’ అని వైఎస్ షర్మిల ట్వీట్ చేశారు. 

ట్విట్టర్ వేదికగా జేపీ నడ్డాను ప్రశ్నించిన కేటీఆర్..
తన కుమారుడిపై పోల్ నిర్వహించడంపై బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డాకు (jp nadda) కేటీఆర్ ఫిర్యాదు చేశారు. మీరు తెలంగాణ బీజేపీ నేతలకు నేర్పించేది ఇదేనా అంటూ కేటీఆర్ ఫైర్‌ అయ్యారు. తన కుమారుడిని రాజకీయాల్లోకి లాగడం, అతడి శరీరాకృతిని అవమానించడం సంస్కారమేనా..? అంటూ ఆయన మండిపడ్డారు.ప్రధానమంత్రి నరేంద్ర మోదీ (narendra modi), కేంద్ర మంత్రి అమిత్‌ షా (amit shah) కుటుంబ సభ్యులనుద్దేశించి తామూ ఇదే తరహాలో స్పందిస్తామని ఎందుకు అనుకోరని కేటీఆర్‌ ప్రశ్నించారు. దిగజారుడు వ్యాఖ్యలు చేయకుండా అలాంటి నేతలను నియంత్రించాలని కోరిన మంత్రి ... న్యాయపరమైన చర్యలు తీసుకోవాల్సి వస్తుందని హెచ్చరించారు. బీజేపీ నేతల తరహాలోనే వ్యాఖ్యలు చేయించాల్సిన పరిస్థితి తమకు కల్పించవద్దని.. ఆ పరిస్థితి వస్తే తమను తప్పుపట్టవద్దని కేటీఆర్‌ వార్నింగ్ ఇచ్చారు. 

Also Read: కేటీఆర్‌కు మద్దతుగా వైఎస్ షర్మిల ట్వీట్.. అలాంటి వాటిని ఖండించాల్సిందేనని పోస్ట్..

దురదృష్టం కొద్దీ భావ ప్రకటనా స్వేచ్ఛ విమర్శించేందుకు, బురదజల్లేందుకు హక్కుగా మారిందని మంత్రి ఆవేదన వ్యక్తం చేశారు. సామాజిక మాధ్యమాలను జర్నలిజం ముసుగులో విషప్రచారం చేసేందుకు ఓ అవకాశంగా ఉపయోగించుకుంటున్నారని కేటీఆర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. అసాంఘిక ప్రవర్తనకు సామాజిక మాధ్యమాలు స్వర్గధామం అయ్యాయని మంత్రి వ్యాఖ్యానించారు. జర్నలిజం ముసుగులో యూట్యూబ్‌ ఛానెళ్ల ద్వారా అర్థంలేని విషయాలను ప్రచారం చేస్తున్నారని, చిన్న పిల్లలను కూడా ఈ వ్యవహారంలోకి లాగుతున్నారని కేటీఆర్‌ ఆవేదన వ్యక్తం చేశారు.  

click me!