కేసీఆర్ 'ముందస్తు' ప్లాన్: అమిత్ షా విరుగుడు వ్యూహం

By Pratap Reddy KasulaFirst Published Dec 25, 2021, 12:27 PM IST
Highlights

తెలంగాణ సీఎం కేసీఆర్ ముందస్తు ఎన్నికలకు వెళ్లే అవకాశం ఉన్నట్లు ప్రచారం సాగుతోంది. ఈ విషయాన్ని తెలంగాణ బిజెపి నేతలు అమిత్ షా వద్ద ప్రస్తావించారు. కేసీఆర్ ప్లాన్ కు తన వద్ద విరుగుడు ఉందని అమిత్ షా చెప్పినట్లు తెలుస్తోంది.

వరిధాన్యం కొనుగోలు విషయంలో తెలంగాణ రాష్ట్ర సమితి (టీఆర్ఎస్)కు, బిజెపికి మధ్య సమరం సాగుతోంది. బిజెపి, టీఆర్ఎస్ పరస్పరం విమర్శలు చేసుకుంటూ వీధికెక్కాయి. తెలంగాణ మంత్రులు ఢిల్లీలో మకాం వేసి కేంద్ర మంత్రి పియూష్ గోయల్ తో భేటీకి నిరీక్షిస్తున్న సమయంలోనే బిజెపి తెలంగాణ నేతలు ఢిల్లీ చేరుకున్నారు. పియూష్ గోయల్ తెలంగాణ మంత్రులను పక్కన పెట్టి, బిజెపి నేతలతో భేటీ అయ్యారు. దీనిపై టీఆర్ఎస్ నేతలు తీవ్రంగా మండిపడ్డారు. 

ఈ వివాదం కొనసాగుతున్న సందర్భంలోనే తెలంగాణ శాసనసభకు ముందస్తు ఎన్నికల విషయం చర్చకు వచ్చింది. తెలంగాణ ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర రావు శాసనసభ ముందస్తు ఎన్నికలకు వెళ్లే అవకాశం ఉన్నట్లు కేంద్ర హోం మంత్రి అమిత్ షా Telangana BJP నేతలతో అన్నట్లు వార్తలు వచ్చాయి. కేంద్ర హోం మంత్రి హోదాలో ఉన్న Amit Shah చెప్పిన ఆ మాటకు రాజకీయ ప్రాధాన్యం చేకూరింది. నిఘా విభాగాల సమాచారం కేంద్ర మంత్రిగా ఉన్న అమిత్ షాకు అందుతుంది. ఆ సమాచారం మేరకే అమిత్ షా ఆ వ్యాఖ్యలు చేసినట్లు భావిస్తున్నారు. 

KCR ముందస్తు ఎన్నికలకు వెళ్తారనే ప్రచారం చాలా కాలం నుంచే సాగుతోంది. ప్రతిపక్ష కాంగ్రెసు, బిజెపిలు కుదురుకోక ముందే, ఆ పార్టీలు వ్యూహరనచ చేసుకోవడానికి తగిన సమయం దొరకకుండా చూసి విజయం సాధించాలనే వ్యూహంతో ఆయన ముందస్తు ఎన్నికలకు సిద్ధపడుతున్నట్లు భావిస్తున్నారు. టీఆర్ఎస్ మీద రాష్ట్రవ్యాప్తంగా అసంతృప్తి పెరుగుతోందనే సంకేతాలు కూడా ఉన్నాయి. ఈ స్థితిలో ముందుగా ఎన్నికలకు వెళ్లి మళ్లీ అధికారం చేజిక్కుంచుకునేందుకు కేసీఆర్ ప్రయత్నిస్తారని అంటున్నారు. 

కేసీఆర్ తన ప్రణాళికలో భాగంగా వచ్చే ఒకటి రెండు నెలల్లో తగిన ఏర్పాట్లు చేసుకుంటారని అంటున్నారు. ఈటల రాజేందర్ వల్ల మంత్రివర్గంలో ఏర్పడిన ఖాళీ అలాగే ఉంది. కడియం శ్రీహరి, గుత్తా సుఖేందర్ రెడ్డి, మధుసూదనాచారి వంటి సీనియర్ నేతలను కేసీఆర్ శాసన మండలికి పంపించారు. వారికి తగిన పదవులు ఇవ్వాల్సి ఉంది. ఇందుకు గాను కేసీఆర్ మంత్రివర్గ పునర్వ్యస్తీకరణ చేస్తారని భావిస్తున్నారు. ఫిబ్రవరి మొదటివారంలో మంత్రివర్గ పునర్వ్యూస్థీకరణ ఉంటుందని ప్రచారం సాగుతోంది. 

కేసీఆర్ ముందస్తు ఎన్నికలకు వెళ్లే విషయంపై తెలంగాణ బిజెపి నేతలు అమిత్ షా వద్ద ప్రస్తావించినట్లు చెబుతున్నారు. భయపడాల్సిన అవసరం లేదని, పార్టీ కార్యక్రమాలు విస్తృతం చేయాలని అమిత్ షా చెప్పినట్లు సమాచారం. అంతేకాకుండా తాను తెలంగాణలో పర్యటిస్తానని, రెండు రోజుల పాటు ఉంటానని ఆయన హామీ ఇచ్చినట్లు చెబుతున్నారు అంతేకాకుండా కేసీఆర్ ముందస్తు వ్యూహానికి విరుగుడు మంత్రం తన వద్ద ఉన్నట్లు ఆయన చెప్పారని అంటున్నారు. 

కేసీఆర్ ముందస్తు వ్యూహాన్ని తాము అడ్డుకుంటామని ఆయన చెప్పారని ప్రచారం జరగుతోంది. క్రితంసారి ముందస్తుకు తాము కేసీఆర్ కు సహకరించామని, ఈసారి సహకరించబోమని ఆయన చెప్పారని అంటున్నారు. వీలైతే లోకసభ ఎన్నికలతో పాటు తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలు జరిగేలా చూస్తామని కూడా అమిత్ షా చెప్పారని అంటున్నారు. 

click me!