తెలంగాణ రాష్ట్రంలో జరుగుతున్ని స్వాతంత్ర్య భారత వజ్రోత్సవ వేడుకల ముగింపు సభ ఈ రోజు హైదరాబాద్ లోని ఎల్బీ స్టేడియంలో జరగనున్నాయి. ఈ నేపథ్యంలో హైదరాబాద్ లో ట్రాఫిక్ ఆంక్షలు విధించారు.
హైదరాబాద్ : తెలంగాణ ప్రభుత్వం ఆధ్వర్యంలో నిర్వహించిన భారత స్వాతంత్ర వజ్రోత్సవాలు నేటితో ముగియనున్నాయి. ఈ నేపథ్యంలో సోమవారం సాయంత్రం హైదరాబాద్ ఎల్బీ స్టేడియంలో ముగింపు సభ జరగనుంది. దీంతో ఆ మార్గంలో మధ్యాహ్నం 2 గంటల నుంచి రాత్రి 9 గంటల వరకు ట్రాఫిక్ ఆంక్షలు అమలు చేయనున్నట్లు పోలీసు వర్గాలు వెల్లడించాయి. ఆంక్షల నేపథ్యంలో వాహనదారులు ప్రత్యామ్నాయ మార్గాలను ఎంచుకోవాలని సూచించారు.
ఆంక్షలు ఇవి…
- చాపల్ రోడ్డు, నాంపల్లి నుంచి బీజేఆర్ విగ్రహం వైపు వచ్చే వాహనాలను పెట్రోల్ బంకు వద్ద దారి మళ్ళించి పోలీస్ కంట్రోల్ రూమ్ మీదుగా అనుమతించనున్నారు. గన్ ఫౌండ్రీ ఎస్బిఐ నుంచి ప్రెస్ క్లబ్, బషీర్బాగ్ ఫ్లైఓవర్ వైపు నుంచి వచ్చే వాహనాలను ఎస్బిఐ వద్ద దారి మళ్లించి, చాపల్ రోడ్డు మీదుగా అనుమతిస్తారు.
undefined
- రవీంద్ర భారతి, హిల్ ఫోర్ట్ రోడ్ నుంచి బీజేఆర్ విగ్రహం వైపు వచ్చే వాహనాలను నాంపల్లి మీదుగా దారి మళ్లించనున్నారు.
- బషీర్బాగ్ ఫ్లై ఓవర్ నుంచి వచ్చే వాహనాలను బీజేఆర్ విగ్రహం వద్ద కుడివైపుకు అనుమతించకుండా.. గన్ ఫౌండ్రీ ఎస్బిఐ వద్ద కుడివైపు దారి మళ్లించి చాపెల్ రోడ్డు మీదుగా పంపిస్తారు.
నేటీతో ముగియనున్న వజ్రోత్సవ వేడుకలు.. ముఖ్య అథితిగా సీఎం కేసీఆర్
- నారాయణగూడ సిమెట్రీ నుంచి బషీర్బాగ్ వైపు వెళ్లే వాహనాలను ఓల్డ్ ఎమ్మెల్యే క్వార్టర్స్ వద్ద దారి మళ్లించి హిమాయత్ నగర్ వై జంక్షన్ మీదుగా అనుమతిస్తారు.
- కింగ్ కోటి, బొగ్గులకుంట నుంచి బషీర్బాగ్, భారతీయ విద్యా భవన్ మీదుగా వెళ్లే వాహనాలను కింగ్ కోటి క్రాస్రోడ్డు వద్ద దారి మళ్ళించి తాజ్ మహల్ హోటల్, ఈడెన్ గార్డెన్ మీదుగా అనుమతిస్తారు.
- బషీర్బాగ్ నుంచి పోలీస్ కంట్రోల్ రూమ్ వైపు వచ్చే వాహనాలను దారి మళ్ళించి లిబర్టీ మీదుగా అనుమతిస్తారు.
- హిమాయత్ నగర్ వై జంక్షన్ నుంచి బషీర్బాగ్ వైపు వచ్చే వాహనాలను హిమాయత్నగర్ వై జంక్షన్ వద్ద దారి మళ్లించారు.
ఇదిలా ఉండగా, స్వాతంత్ర వజ్రోత్సవాల ముగింపు వేడుకల కోసం ఎల్బీ స్టేడియాన్ని సర్వాంగ సుందరంగా ముస్తాబు చేశారు. ఈ వేడుకలకు సీఎం కేసీఆర్ హాజరుకానున్నారు. ఈ నేపథ్యంలో ఈ వేడుకల ఏర్పాట్లను ఆదివారం సాయంత్రం సీఎస్ సోమేశ్‌కుమార్, డీజీపీ మహేందర్‌రెడ్డి, ఇతర ఉన్నతాధికారులు దగ్గరుండి పరిశీలించారు. ఈ కార్యక్రమానికి రాష్ట్రవ్యాప్తంగా అన్ని జిల్లాల నుంచి ఎంపీపీలు, జడ్పీటీసీలు, డీసీసీబీ చైర్మన్లు, దేవస్థానం కమిటీ చైర్మన్లు, మున్సిపల్ కమిషనర్లు, మేయర్లు, జిల్లా కలెక్టర్లు సహా జిల్లా స్థాయి అధికారులు, తదితర ప్రజాప్రతినిధులు హాజరుకానున్నారు.
వీరితో పాటు హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్-మల్కాజిగిరి, సంగారెడ్డి జిల్లాల నుంచి సెల్ఫ్‌హెల్ప్ గ్రూప్‌ల మహిళలు కూడా రానున్నారు. దీంతో మొత్తంగా 30 వేల మంది ఈ ముగింపు వేడుకలకు హాజరయ్యే అవకాశముంది. ఈ రోజు సాయంత్రం 4 గంటలకు ప్రారంభమయ్యే ఈ వేడుకల్లో ముందుగా సీఎం కేసీఆర్ జాతిపిత మహాత్మా గాంధీకి నివాళాలర్పిస్తారు. ఆ తరువాత జాతీయ గీతాలాపనతో ఈ వేడుకలు ప్రారంభం కానున్నాయి.