
జీడిమెట్లకు చెందిన తేజశ్రీ అనే అమ్మాయికి నల్గొండకు చెందిన డీజే నిర్వాహకుడు శివతో ఇన్‌స్టాగ్రామ్‌లో పరిచయం ఏర్పడింది. ఇది క్రమంగా ప్రేమగా మారింది. ఈ ప్రేమ వ్యవహారాన్ని తల్లి అంజలి వ్యతిరేకించడంతో, తేజశ్రీ కోపం పెంచుకుంది. తల్లిని శాశ్వతంగా తన జీవితానికి అడ్డుగా భావించి, ప్రియుడితో కలిసి హత్యకు ప్లాన్ వేసింది.
జూన్ 23న అంజలిని చంపేందుకు తేజశ్రీ తన ప్రియుడు శివను, అతని సోదరుడు యశ్వంత్‌ను ఇంటికి రప్పించింది. తల్లి పూజలో ఉండగా, చెల్లిని బయటకు పంపించి, హత్యకు అవసరమైన ఏర్పాట్లు చేసింది. మొదట చున్నీతో గొంతు బిగించి, సుత్తితో తలపై కొట్టి, తర్వాత కత్తితో దాడి చేశారు.
మొదటిసారి దాడి చేసిన సమయంలో అంజలి చనిపోలేదన్న విషయాన్ని తెలుసుకొని నిందితురాలు మళ్లీ శివకు ఫోన్ చేసి “ఇంకా బతికే ఉంది, వచ్చి చంపేయ్” అంటూ చెప్పినట్లు పోలీసులు వెల్లడించారు. శివ, అతని సోదరుడు తిరిగి వచ్చి రెండోసారి హత్యను ఖచితంగా అమలు చేశారు.
హత్య అనంతరం, తల్లి ఉరివేసుకుని చనిపోయిందని కుటుంబ సభ్యులకు నిందితురాలు చెప్పింది. అయితే సంఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు అనుమానంతో బాలికను తీవ్రంగా విచారించగా.. చివరకు ఆమె హత్యకు పాల్పడ్డట్లు ఒప్పుకుంది.
ఈ కేసులో నిందితులుగా తేజశ్రీ, ఆమె ప్రియుడు శివ (19), అతని మైనర్ సోదరుడు ఉన్నారు. ముగ్గుర్నీ పోలీసులు అరెస్ట్ చేశారు. జీడిమెట్ల పోలీసులు కేసును విచారిస్తున్నారు. బాలానగర్ డీసీపీ సురేష్ కుమార్, ఏసీపీ నరేష్ రెడ్డి సంఘటన స్థలాన్ని పరిశీలించారు.
హత్యకు గురైన అంజలి.. తెలంగాణ ఉద్యమకారిణి వీరవనిత, తొలి భూ పోరాటానికి నాంది పలికిన చాకలి ఐలమ్మ మునిమనవరాలు. అంజలి మహబూబాబాద్ జిల్లా ఇనగుర్తి మండలానికి చెందినవారు. తెలంగాణ సాంస్కృతిక కళాకారిణిగా పనిచేశారు.
మొదటి భర్తతో కుమార్తనే తేజశ్రీ. తర్వాత రెండో పెళ్లి చేసుకున్న అంజలికి మరో కుమార్తె ఉంది. రెండో భర్త కూడా ఇటీవల రోడ్డు ప్రమాదంలో మరణించాడు. అంజలి తన కుమార్తెలతో షాపూర్ నగర్‌లో అద్దె ఇంట్లో జీవనాన్ని కొనసాగిస్తూ వచ్చారు.
ఈ సంఘటన మానవ సంబంధాలపై ఎన్నో ప్రశ్నలను సంధిస్తున్నాయి. తెలిసి తెలియని వయసులో మొదలైన ప్రేమ వ్యవహారం కన్న తల్లిని హత్య చేయించేంత తీవ్రతకు ఎలా చేరింది? ఒక పదో తరగతి విద్యార్థిని ఇలాంటి నిర్ణయం తీసుకోవడానికి దారి తీసిన కారణాలు ఏంటి.? అన్న ప్రశ్నలు ముందుకొస్తున్నాయి. కుటుంబ నేపథ్యం, మానసిక ఆరోగ్యం, సంబంధాల మధ్య పెరిగిన అగాధాలు ఇలా ఎన్నో జవాబులేని ప్రశ్నలు సమాజాన్ని తొలుస్తూనే ఉన్నాయి.
చిన్న తనంలో ప్రేమ వ్యవహారం, సోషల్ మీడియా ప్రభావం, కుటుంబ సమస్యలు.. ఇలా ఎన్నో కారణాలు ఇలాంటి దారుణాలకు దారి తీస్తున్నాయని మానసిక నిపుణులు అభిప్రాయపడుతున్నారు. ఇలాంటి సంఘటనలు సమాజానికి హెచ్చరిక కావాలి. కుటుంబాల్లో మానసిక ఆరోగ్యం, భావోద్వేగ సంబంధాలపై అవగాహన పెరగాల్సిన అవసరాన్ని గుర్తు చేస్తున్నాయి.