
తెలంగాణలో గ్రామ పంచాయతీ ఎన్నికల నిర్వహణలో జాప్యం కారణంగా హైకోర్టు కీలక తీర్పును వెల్లడించింది. బుధవారం న్యాయమూర్తి జస్టిస్ టీ. మాధవీదేవి ఇచ్చిన తీర్పు మేరకు, మూడు నెలలలోగా గ్రామ పంచాయతీ ఎన్నికలు నిర్వహించాలని, అలాగే 30 రోజుల్లో వార్డుల విభజన ప్రక్రియ పూర్తిచేయాలని స్పష్టం చేశారు.
2024 జనవరి 30తో స్థానిక సంస్థల పాలకవర్గాల పదవీకాలం ముగిసినా ఇప్పటిదాకా ఎన్నికలు జరగకపోవడంపై హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. ఈ జాప్యంపై పలు మాజీ సర్పంచులు దాఖలు చేసిన పిటిషన్‌ను సోమవారం విచారించిన హైకోర్టు, బుధవారం తుది తీర్పును ప్రకటించింది.
పిటిషనర్ల తరఫున న్యాయవాదులు వాదిస్తూ, ప్రభుత్వం రాజ్యాంగ ప్రమాణాలను పాటించకుండా ప్రత్యేక అధికారులను నియమించిందని, ఇది ప్రజాప్రతినిధిత్వ విలువలకు విరుద్ధమని అన్నారు. గతంలో ప్రభుత్వం ఇచ్చిన హామీల ఆధారంగా అభివృద్ధి పనులకు సొంతంగా ఖర్చు చేసిన సర్పంచులు ఇప్పుడు నిధుల కోసం ఎదురుచూస్తున్నారని పేర్కొన్నారు.
ప్రభుత్వ తరఫున అదనపు అడ్వకేట్ జనరల్ ఇమ్రాన్ ఖాన్ వాదిస్తూ, బీసీ రిజర్వేషన్ల ఖరారుపై సుప్రీంకోర్టు ఆదేశాల ప్రకారం ముందుగా చర్యలు తీసుకోవాల్సి ఉందని తెలిపారు. ఈ ప్రక్రియ పూర్తవడానికి కనీసం ఒక నెల గడువు కావాలని విన్నవించారు.
ఎన్నికల సంఘం తరఫున సీనియర్ న్యాయవాది విద్యాసాగర్ వాదిస్తూ, రిజర్వేషన్ల ఖరారుపై పూర్తి బాధ్యత ప్రభుత్వానిదేనని పేర్కొన్నారు. ప్రభుత్వం ఆమోదం తెలపగానే ఎన్నికల ప్రక్రియ ప్రారంభిస్తామని తెలిపారు. అయితే, న్యాయమూర్తి జోక్యం చేసుకుని, గతంలో హామీ ఇచ్చి నేటివరకు ఎందుకు చర్యలు తీసుకోలేదని ప్రశ్నించారు. ఎన్నికల నిర్వహణలో జాప్యం జరిగితే ఎన్నికల సంఘం స్వయంగా ముందుకు రావాలని సుప్రీంకోర్టు సూచించిన విషయాన్ని గుర్తు చేశారు.