హైద్రాబాద్ నగరంలోని సినీ నిర్మాత అంజిరెడ్డి మృతి విషయంలో పోలీసులు సంచలన విషయాలను గుర్తించారు.
హైదరాబాద్: నగరంలోని గోపాలపురం పోలీస్ స్టేషన్ పరిధిలో సినీ నిర్మాత అంజిరెడ్డి మృతి విషయంలో పోలీసులు కీలక విషయాలు తేల్చారు. అంజిరెడ్డిని హత్య చేశారని పోలీసులు తమ దర్యాప్తులో గుర్తించారు.
ఈ ఏడాది సెప్టెంబర్ 29న గోపాలపురం పోలీస్ స్టేషన్ పరిధిలోని ఓ షాపింగ్ కాంప్లెక్స్ పార్కింగ్ స్థలంలో సినీ నిర్మాత అంజిరెడ్డి మృతి చెందాడు. పార్కింగ్ స్థలంలో వాహనం ఢీకొని అంజిరెడ్డి మృతి చెందినట్టుగా నిందితులు చిత్రీకరించే ప్రయత్నం చేశారు. ఈ ఘటనకు సంబంధించి పోలీసులు విచారణ నిర్వహించిన సమయంలో సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి. అంజిరెడ్డికి, కాట్రగడ్డ రవి మధ్య స్నేహం ఉంది. అంజిరెడ్డి తన పేరున ఉన్న ఆస్తులను విక్రయించి అమెరికాకు వెళ్లిపోవాలని భావించాడు.ఈ విషయమై రవికి చెప్పాడు. అయితే అంజిరెడ్డిని హత్య చేస్తే ఆస్తులన్నీ తనకు దక్కుతాయని రవి భావించాడని పోలీసులు చెప్పారు. అంజిరెడ్డి ఆస్తులను కొనుగోలు చేసేందుకు రాజేష్ అనే రియల్ ఏస్టేట్ వ్యాపారి సిద్దంగా ఉన్నాడని అంజిరెడ్డిని నమ్మించాడు. అంజిరెడ్డి ఆస్తులను తన పేరున రాయించుకుని హత్య చేశాడని పోలీసులు చెప్పారు.
అంజిరెడ్డిని హత్య చేసేందుకు ఇద్దరు బీహారీలకు కాట్రగడ్డ రవి సుఫారీ ఇచ్చాడని పోలీసులు గుర్తించారు. అంజిరెడ్డిని హత్యలో పాల్గొన్న ఇద్దరు బీహారీలతో పాటు కాట్రగడ్డ రవిని కూడ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.