బైక్ స్కీమ్‌, మనీ డిపాజిట్‌ స్కీమ్‌లతో బురిడీ కొట్టించిన నిందితుల అరెస్టు.. ఎలా మోసం చేశారంటే..?

By telugu teamFirst Published Nov 20, 2021, 5:19 PM IST
Highlights

సూపర్ ఇన్వెస్ట్‌మెంట్ స్కీమ్ అంటూ డబ్బులు పెట్టుబడి పెడితే 100 రోజుల్లో రెట్టింపు చేసి ఇస్తామని, మొత్తం పేమెంట్ చేస్తా అంటే బైక్‌ను కేవలం 60శాతం ధరకే డెలివరీ చేస్తామని మోసపూరిత స్కీమ్‌లతో ప్రజలను మోసం చేసిన ఇద్దరు నిందితులను పోలీసులు అరెస్టు చేశారు. వీరిని కోర్టు ముందు హాజరుపరిచారు. కేసును పోలీసులు విచారిస్తున్నారు.
 

హైదరాబాద్: సాధారణ ప్రజలున బైక్ స్కీమ్‌లు, మనీ డిపాజిట్ స్కీమ్‌లతో బురడీ కొట్టించిన ఇద్దరు నిందితులను పోలీసులు చాకచక్యంగా పట్టుకున్నారు. మల్టీ బ్రాండ్ టూ వీలర్ షోరూ‌మ్‌లు పెట్టిన వీరు.. అమాయకులను ఆకర్షించి బైక్‌లను 60శాతం ధరకే అమ్ముతామంటూ కుచ్చుటోపీ పెట్టారు. కాగా, ఇంకొందరి దగ్గర నుంచి డబ్బులు తీసుకుని వంద రోజుల్లో డబుల్ చేసి ఇస్తామని నమ్మించి చీట్ చేశారు. ఈ బైక్ స్కీమ్‌, మనీ స్కీమ్‌లు వేసి మోసం చేసిన వారిని గురువారం మధ్యాహ్నం అరెస్టు చేసినట్టు రాచకొండ పోలీసు కమిషనరేట్ ఓ ప్రకటనలో వెల్లడించింది. జవహర్ నగర్‌కు చెందిన బెలుమోని మహేశ్వరి చేసిన ఫిర్యాదుతో ఈ మోసం బయటపడింది.

కేసులో ఏ1 నిందితురాలు కంకుల పల్లవి పీర్జాదీగూడలోని పర్వత్ నగర్ నివాసి. ఈమె మోసాలకు సహాయకారిగా ఉన్న ఏ2 పోలోజు సంజయ్ జవహర్‌నగర్‌లోని మోహన్‌రావు నగర్‌ నివాసి. వీరు మల్టీబ్రాండ్ టూ వీలర్ షోరూమ్‌లు నడుపుతున్నారు. ఏఎస్ఆర్ రావు నగర్‌లో 2019లో శ్రీ సాయి నిత్య ట్రేడర్స్, 2020లో దమ్మాయిగూడలో నిత్య మోటార్స్‌లతోపాటు దోమడుగు, మాన్సాన్‌పల్లి ఎక్స్ రోడ్డు దగ్గ, మహేశ్వరం దగ్గర షోరూమ్‌లు నడుపుతున్నారు. ఈ షోరూమ్‌లలోకి వచ్చే కస్టమర్లకు ఇన్వెస్ట్‌మెంట్ స్కీమ్‌లు, ఇతర స్కీమ్‌లు చెప్పి మోసం చేసేవారు.

Also Read: మ్యాట్రిమోనియల్ ఫ్రాడ్ : ‘నోట్ల రద్దుతో డబ్బులు ఇరుక్కుపోయాయి...’ మెసేజ్ తో యువతికి రూ. 32 లక్షల టోకరా..

బైక్ స్కీమ్ కింద వీరు ఒక వెహికిల్‌ ధరలో 60 శాతం డబ్బు కడతామంటే ధరలో 40శాతం డిస్కౌంట్ ఇస్తామని చెప్పేవారు. 60శాతం డబ్బు కస్టమర్ నుంచి పొందగానే అందులో నుంచి 20శాతం డబ్బు బైక్‌కు డౌన్‌పేమెంట్ కట్టేవారు. తర్వాత కస్టమర్ పేరు మీద బ్యాంక్ నుంచి ఫైనాన్స్ అప్రూవ్ కాగానే ఆ వెహికిల్‌ను కస్టమర్‌కు డెలివరీ చేసేవారు. అందులో నుంచి మిగతా డబ్బును నిందితురాలు తన ఖాతాలోకి పంపుకునే వారు. ఆ బైక్ లోన్‌ను 12 ఈఎంఐలలో తీరుస్తానని హామీనిచ్చేవారు. కానీ, మరో నలుగురు కస్టమర్లను తేవాలనే కండీషన్ పెట్టేవారు.

మరో స్కీమ్‌లో 100 రోజులు బైక్ డెలివరీకి వెయిట్ చేస్తామంటే బైక్ ధరపై 50 శాతం డిస్కౌంట్ ఇస్తామని నమ్మించేవారు. బైక్‌పై 50శాతం డబ్బు తీసుకుని బండి డెలివరీ ఇవ్వకపోయేవారు. ఇన్వెస్ట్‌మెంట్ స్కీమ్ పేరిట అమాయకుల నుంచి డబ్బులు తీసుకుని 100 రోజుల్లో రెట్టింపు చేసి ఇస్తామని నమ్మబలికేవారు. కానీ, ఆ తర్వాత వారిని చీట్ చేసేవారని పోలీసులు తెలిపారు.

Also Read: వాట్సాప్‌లో గుడ్ మార్నింగ్ అంటూ మెసేజ్.. చివరకు రూ. 5 లక్షలు దోచేశారు..

ఇలాంటి స్కీమ్‌ల గురించి విని చాలా మంది నిందితురాలి దగ్గరకు వచ్చారు. సుమారు 300 మంది కస్టమర్లు నిందితురాలిని చేరారు. వారు సుమారు రూ. 2 కోట్ల డబ్బును కూడబెట్టినట్టు పోలీసులు అంచనా వేశారు. ఈ అన్ని పనుల్లో ఏ2 ఆమెకు సహాయంగా ఉండేవాడని తెలిపారు. వీరిద్దరిని వారి వారి నివాసాల్లో గురువారం మధ్యాహ్నం అరెస్టు చేశారు.

click me!