Huzurabad Bypoll:ఎవరిది తప్పయితే వారు ముక్కు నేలకు రాద్దాం... సిద్దమేనా హరీష్: ఈటల సవాల్

By Arun Kumar PFirst Published Aug 12, 2021, 2:22 PM IST
Highlights

తెలంగాణ ఆర్థిక మంత్రి హరీష్ రావుకు మాజీ మంత్రి, బిజెపి నాయకులు ఈటల రాజేందర్ సవాల్ విసిరారు. హుజురాబాద్ లో హరీష్ చెప్పిన మాటలన్నీ పచ్చి అబద్దాలని... దమ్ముంటే నిరూపించాలని అన్నారు. 

కరీంనగర్: బుధవారం ఆర్థిక మంత్రి హరీష్ రావు హుజురాబాద్ నియోజకవర్గానికి వచ్చి పచ్చి అబద్ధాలు చెప్పి ప్రజలను నమ్మించే ప్రయత్నం చేశారని మాజీ మంత్రి ఈటల రాజేందర్ అన్నారు. నువ్వు చేసిన విమర్శల మీద హైదరాబాద్ నడిబొడ్డున గల అబిడ్స్ లో చర్చ పెడుదాం...ఎవరిది తప్పయితే వాళ్ళు అక్కడే ముక్కు నేలకు రాద్దాం... సిద్దమేనా అంటూ హరీష్ రావుకు సవాల్ విసిరారు ఈటల. 

''ఇంతకాలం ఓపిక పట్టి వ్యక్తిగత విమర్శలు చేయలేదు. కానీ మీరు గోబెల్ ప్రచారం చేస్తే చూస్తూ ఊరుకోను. నాది రాజకీయ కుటుంబం కాకపోయినా ప్రజల మన్ననలు పొంది అరు సార్లు గెలిచాను. నేను డైరెక్ట్ ఎమ్మెల్యే అయితే నువ్వు డైరెక్ట్ గా మంత్రివే అయ్యావు.  గతాన్ని మరిచి మామ దగ్గర మార్కులు కొట్టేద్దామని చూసి అభాసుపాలు కాకండి. నువ్వు ఎంత చేసిన మీ మామ నిన్ను నమ్మే పరిస్థితి లేదు'' అని మంత్రి హరీష్  ను హెచ్చరించారు ఈటల

''2002 లో నాకున్న ఆస్తులు, ప్రస్తుతం ఉన్న అస్తులను... ఇదే విధంగా అప్పుడు మీకున్న ఆస్తులు, ఇప్పుడున్న ఆస్తులపై సిట్టింగ్ జడ్జితో విచారణ చేయండి. అప్పుడు ఎవరేంటో తెలిసిపోతుంది'' అని ఈటల అన్నారు. 

''హుజురాబాద్ నియోజకవర్గంలోని మహిళ సంఘాలకు నిధులు మంజూరు చేస్తున్నది ఓట్ల మీద ఉన్న ప్రేమతోనే. నన్ను ఓడించడానికే మహిళ సంఘాలతో మీటింగ్ లె పెడుతున్నారు. గతంలో డబుల్ బెడ్ రూం ఇళ్ల నిర్మాణంపై కమిటీ వేసి మా సలహలు సూచనలు తీసుకోలేదు. హుజూరాబాద్ లో ఇప్పటి వరకు రెండు వెల డబుల్ రూం ఇళ్లు పూర్తయ్యే దశలో ఉన్నాయి'' అని తెలిపారు.

''గజ్వేల్,  సిద్దిపేట, సిరిసిల్ల లో తప్ప ఎక్కడా డబుల్ బెడ్ రూం ఇళ్ల నిర్మాణం పూర్తి కాలేదు. కాళేశ్వరం ప్రాజెక్ట్ ను కట్టిన కాంట్రాక్టర్లే డబ్బులు దండుకుని ఈ మూడు నియోజకవర్గాల్లో డబుల్ బెడ్ రూం ఇళ్లు కట్టారు. ఆర్థిక శాఖ మంత్రి నియోజకవర్గంలో గత ఏడు సంవత్సరాలలో ఎంత ఖర్చు చేశారు... హుజూరాబాద్ లో ఎంత ఖర్చు చేశారు లెక్కతీద్దాం'' అని ఈటల అన్నారు. 

read more  Huzurabad Bypoll: ఈటలా... కేసీఆర్ ను పట్టుకుని అరే అంటావా...: మంత్రి కొప్పుల సీరియస్

''నేను ఎక్కడ సంక్షేమ పథకాలను విమర్శించలేదు. గతంలో సర్పంచ్ కు పెన్షన్ ఇచ్చే అధికారం ఉండేది కానీ ఇప్పుడు పంచాయితీ శాఖ మంత్రికి కూడా ఆ అధికారం లేదు. నా రాజీనామ వల్ల హుజూరాబాద్ నియోజకవర్గంలో అగిన సంక్షేమ పథకాలు ఇవ్వడం సంతోషం.  సంక్షేమ పథకాలు పేదవారికి అందాలే కానీ ఉన్నవాళ్లకు కాదు. సంక్షేమ పథకాలకు ఈటల రాజేందర్ వ్యతిరేకమని చిల్లర ప్రచారం చేయకండి'' అని టీఆర్ఎస్ నాయకులను హెచ్చరించారు. 

''గతంలో నేను హుజూరాబాద్ మున్సిపల్ అభివృద్ది కోసం నిధులు ఇస్తే మంత్రి కేటీఆర్ అపిండు. అప్పుడు నిధులను మంజూరు చేయకుండా ఇప్పుడు అదే జీఓ నిధులు మంజూరు చేసి అభివృద్ది అంటున్నారు. ఇప్పటికీ 192 కోట్లు నిధులు మంజూరు చేసి వేల కోట్ల జీవో లు ఇచ్చారు. అయినా సర్వేల్లో టీఆర్ఎస్ కు ఇరవై శాతం ఓట్లు కూడా పడేలా లేవని తేలుతోంది'' అన్నారు. 
 
''గత ఎన్నికల్లో నన్ను ఒక్కడినే కాదు మరో పదకొండు మందిని ఓడించడానికి ప్రత్యర్థులకు డబ్బులు ఇచ్చింది వాస్తవం కాదా? మంత్రుల ఫోన్ లు ట్యాప్ చేస్తున్న మాట వాస్తవమో కాదో మంత్రులు సమాధానం చెప్పాలి. 2016లో నాతో పాటు మంత్రులు గంగుల కమలాకర్, కొప్పుల ఈశ్వర్ ను అపాయింట్మెంట్ ఇవ్వకుండా ప్రగతి భవన్ గేట్ దగ్గర ఆపింది వాస్తవమా కాదా? గోలీలు ఇచ్చే ఎంపీ చెపితేనే కేసీఆర్ అపాయింట్మెంట్ దొరుకుతుంది'' అని అన్నారు. 

''హుజూరాబాద్ లో దళిత బందు అమలుకు భూములు అమ్మితే రాష్ట్రమంతా ఇవ్వడానికి ఏం అమ్ముతారు? నా ముఖం అసెంబ్లీలో కనబడొద్దని ముఖ్యమంత్రి సర్వశక్తులు ఒడ్డుతున్నారు. నా ఆస్తులు అమ్ముకోకుండా చేసిండు. రాబోయే రోజుల్లో నాకు అపద ఉన్నదని ఇంటికొక్క వెయ్యి రూపాయలు అడిగి తీసుకుంట'' అన్నారు ఈటల రాజేందర్. 


 

click me!