
హైదరాబాద్: అన్నదాత కష్టాలను కళ్లకుకట్టినట్లు చూపించిన రైతన్న సినిమాను ప్రతిఒక్కరూ ఆదరించాలని... రైతులు, ప్రజలు, మీడియాతో పాటు సమాజంలోని అందరూ ఈ సినిమాను చూడాలని రాష్ట్ర వ్యవసాయ శాఖా మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి సూచించారు. ప్రజల హితాన్ని కోరే సినిమాలు చాలా అరుదుగా వస్తుంటాయని... అలాంటిదే ఈ రైతన్న సినిమా అన్నారు. వ్యాపార విలువలే ప్రధానంగా ఉన్న పరిస్థితులలో ప్రజల కోసం, రైతుల హితాన్ని కాంక్షిస్తూ వస్తున్న ప్రభోధాత్మక సినిమా రైతన్న అని మంత్రి కొనియాడారు.
మంత్రుల నివాస సముదాయంలో రైతన్న సినిమా నిర్మాత, దర్శకుడు, హీరో ఆర్.నారాయణమూర్తితో కలిసి వ్యవసాయ మంత్రి మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి నిరంజన్ రెడ్డి మాట్లాడుతూ... సమాజ హితం కోసం అనేక మాద్యమాల ద్వారా పలువురు కృషి చేస్తుంటారన్నారు. ఇలా సినిమా మాద్యమం ద్వారా ఆర్ నారాయణ మూర్తి కృషి చేస్తుంటారన్నారని అన్నారు. ప్రజల పక్షపాతి, రైతు పక్షపాతి, తెలుగు ప్రజలకు సుపరిచితుడైన నారాయణమూర్తి ఎన్నో కష్టనష్టాలకు ఓర్చి రైతన్న సినిమాను నిర్మించారని మంత్రి తెలిపారు.
read more చిన్న సినిమాల మనుగడ దానితోనే సాధ్యం... సీఎం జగన్ కి శాల్యూట్
''రైతన్న సినిమాలో మట్టికి, మనిషికి ఉన్న సంబంధాన్ని అద్భుతంగా ఆవిష్కరించారు. ప్రజా ప్రయోజనం జరిగే కృషి ఏ రంగంలో జరిగినా మనం స్వాగతించాలి. ఒక శ్యాం బెనగల్, ఒక మృణాల్ సేన్ మాదిరిగా తెలుగులో నారాయణమూర్తి సినిమాలను తీస్తున్నారు. కాబట్టి ఈ నెల 14న విడుదలవుతున్న రైతన్న సినిమాను ఆదరించాలి'' అని వ్యవసాయ మంత్రి విజ్ఞప్తి చేశారు.
''కేంద్రం తీసుకునే నిర్ణయాలు ప్రజలకు ఇబ్బంది కలిగించేవి అయినప్పడు స్పందించాల్సిన విపక్షాలు విస్మరిస్తున్నాయి. ప్రభుత్వ నిర్ణయాలు తమకు వ్యతిరేకమని ప్రజలు ఒకసారి భావిస్తే వారే విపక్షపాత్ర పోషిస్తారు. అంశాలవారీగా హేతుబద్దతతో కూడిన విమర్శలను సమాజంలో అందరూ స్వాగతించాల్సిందే. కానీ ప్రస్తుత రాజకీయాలలో దురదృష్టవశాత్తు విమర్శ అంటే కువిమర్శ, తిట్లు, సంస్కారహీనత, రెచ్చగొట్టడం విమర్శలుగా మారాయి... ఈ ధోరణి మంచిది కాదు'' అని మంత్రి నిరంజన్ రెడ్డి పేర్కొన్నారు.